‘సర్’ పై తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటున్నా డీఎంకే, డెమోక్రసీకి బలం పెరుగుతుందని వ్యాఖ్యానించిన అన్నాడీఎంకే
By : The Federal
Update: 2025-10-28 06:35 GMT
మహాలింగం పొన్నుస్వామి
భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) చేపట్టడానికి సమాయత్తమవుతున్నామని ప్రకటించడం, అందులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే తమిళనాడు ఉండడం స్థానిక రాజకీయాలు వేడెక్కేలా చేసింది.
రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలు ‘సర్’ పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష అన్నాడీఎంకే దీనిని ప్రజాస్వామ్య రక్షణ కవచంగా అభివర్ణించి, క్యాడర్ తో ర్యాలీ నిర్వహించింది. పాలక డీఎంకే- కాంగ్రెస్ కూటమి ‘సర్’ ను ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా వ్యాఖ్యానించింది.
వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వందశాతం ఓటర్లకు అర్హత కల్పించే దిశగా ‘సర్’ గేమ్ ఛేంజర్ గా పనిచేస్తుందని మాజీ మంత్రి, అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ జయకుమార్ అన్నారు.
ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం..
‘‘మన ప్రజాస్వామ్య బలం మన ఓటర్ల చేతుల్లోనే ఉంది. అర్హత గల ప్రతి ఓటర్ కు 2026 అసెంబ్లీ ఎన్నికలో ఓటు వేసే అవకాశం ఉండాలి’’ అని జయకుమార్ ఫెడరల్ తో అన్నారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ను గుర్తు చేసుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, అర్హత గల ఓటర్లను జాబితాలోకి చేర్చాలని ఆయన అన్నాడీఎంకే క్యాడర్ కు పిలుపునిచ్చారు.
2023 సమ్మర్ లో జరిగిన ఎన్నికల జాబితాలోని తప్పులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సమయంలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లను తొలగించారని, కేవలం 8 లక్షల మంది యువ ఓటర్లను మాత్రమే జత చేశారని చెప్పారు.
దీనివల్ల అసమతుల్యత ఏర్పడినట్లు ఆరోపించారు. అలాగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సవరణలోనూ 18 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు, వృద్దుల పేర్ల నమోదులోనూ వ్యత్యాసం ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణాల వీరి జాబితాలో వీరి పేర్లు ఎక్కువగా నమోదు అయినట్లు చెప్పారు.
2024 మధ్యకాలంలో శ్రీ పెరంబుదూర్ లో 44 లక్షల ఓటర్లను జత చేసే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, కేవలం 31 లక్షల మందిని చేర్చగలిగినట్లు చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్న వలస కార్మికుల వల్లే ఇలా జరిగిందని వివరించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్ల కోసం ఆయన బహుముఖ వ్యూహాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
లక్ష్యిత డ్రైవ్ లో మొదటిసారి 18 సంవత్సరాలు ఉన్న ఓటర్లు, 80 సంవత్సరాలు దాటిన వృద్దులు, వికలాంగులు, వలసకార్మికులపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, పట్టణ మునిసిపాలిటీలు ఎంట్రీలను ధృవీకరించడానికి ఇంటింటి సర్వేలు చేయాలన్నారు. మూడో దశలో బూత్ స్థాయి ఏజెంట్లతో సర్వే చేయించి, మంచి పనితీరు కనపరిచిన వారికి ప్రొత్సహకాలు ఇవ్వాలని చెప్పారు.
డీఎంకే పై విమర్శలు..
‘సర్’ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అధికార డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై జయకుమార్ విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, అయినప్పటికీ ఇష్టమున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈసీ కార్యకలాపాలు అనుమానాస్పదం..
ఎన్నికల సంఘం కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్ ఎన్నికలలో దీనిని పరీక్షించారని, నిజమైన ఓటర్లను ప్రక్షాళన చేయడానికి ఇలాంటి ప్రత్యేక సవరణ ఒక కుట్ర ఎంచుకున్నారని వారు ఆరోపించారు.
బీహార్ లో ముస్లింలు, షెడ్యూల్డ్ కులాలు, మహిళలు వంటి సమూహాల నుంచి లక్షలాది మంది ఓటర్లను తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ఒక నియోజకవర్గం నుంచి 80 వేల ముస్లిం పేర్లను తొలగించడానికి ప్రయత్నాలు జరిగాయని సుప్రీంకోర్టు న్యాయవాదీ ప్రశాంతో భూషణ్ ఆరోపించారు.
ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం ఉల్లంఘించినట్లు ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటిలాగే ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దీనిపై ప్రేక్షకపాత్రను పోషించిందని అన్నారు. తమిళనాడు పార్టీలు కూడా ‘సర్’ తీసుకొచ్చిన సమయాన్ని కూడా విపక్షాలు ప్రశ్నించాయి.
నవంబర్- డిసెంబర్ లలో ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు లో భారీ వర్షాలు కురుస్తాయని, స్థానికంగా ఫీల్డ్ వర్క్ చేయడం అసాధ్యంగా అభివర్ణించారు. ఫొటోలను అతికించడం, పాతరోల్ లను ఆన్ లైన్ లింక్ చేయడం వంటి అవసరాలు మెజారిటీ ఓటర్లకు భారంగా మారుతుందని అధికార పక్షం వాదిస్తోంది.
‘‘సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత కూడా ఆధార్ ను గుర్తింపు కార్డుగా ఎందుకు అంగీకరించడం లేదు? కుటుంబ గుర్తింపు కార్డు(రేషన్ కార్డు) అంగీకరించాలనే మా డిమాండ్ ఎందుకు విస్మరించాలి’’? అని కాంగ్రెస్, డీఎంకే నాయకులు ప్రశ్నిస్తున్నారు.
బీహార్ ఓటర్ల హక్కును లాక్కున్నట్లే, తమిళనాడు ఓటర్ల హక్కును లాక్కోవడానికి సర్ పేరిట కుట్రలు చేస్తున్నారని మిత్రపక్షాల కూటమి తీర్మానం చేసింది. ఆదివారం(నవంబర్ 2)న ఉదయం పది గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాలని డీఎంకే కూటమి తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.
రాజకీయ విభేదాలను అధిగమించి నాయకులంతా రావాలని కోరింది. సమావేశంలో సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. ‘‘ఇది తమిళనాడు సమస్య. అన్ని రాజకీయ పార్టీలు దీనిని అప్రమత్తంగా పర్యవేక్షించి సర్ ను అడ్డుకోవాలి’’ అని తీర్మానం పేర్కొంది. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, రాష్ట్ర భవిష్యత్ ను కాపాడటానికి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.