మనకూ తాటాకు బ్యాలెట్లు ఉండేవి, తెలుసా?

ప్రాచీన భారతదేశంలో దాదాపు 920 ADలో తమిళనాడులో గ్రామ అసెంబ్లీ ఎన్నికలకు తాటి ఆకులను ఉపయోగించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

Update: 2024-05-04 06:14 GMT

దేశంలో అతి పెద్ద పండగ జరుగుతోంది. అదే ఎన్నికల పండుగ. పదేళ్లు నిండిన పిల్లల మొదలు శతాధిక వృద్ధుల వరకు అందరూ ఇందులో ఏదో విధంగా పాలుపంచుకుంటుంటారు. ప్రపంచంలో ఇంత భారీ సంఖ్యలో భాగస్వామ్యాన్ని స్వీకరించే పండగ లేదంటే అతిశయోక్తి కాదు. భారతదేశ ఎన్నికల వ్యవస్థకు అసాధారణ చరిత్ర ఉంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థ వరకు అనేక మలుపులు తిరిగింది.

ఏ జాతి అయినా ఓటు వేసిన వ్యవస్థపై ఆధారపడుతుంది. ఓటింగ్‌ను పారదర్శకంగా, సమర్ధవంతంగా, విశ్వసనీయంగా నిర్వహిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియ అంత సజావుగా సాగుతుంది. ఆ దిశగా ఏర్పడిందే మన ఎన్నికల సంఘం. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. పేపర్ బ్యాలెట్ ను మనం ఆనాడు ఉపయోగించాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) వినియోగిస్తున్నాం.

అసలింతకీ ఈ పేపర్ ఎలా వచ్చిందీ
ప్రపంచ చరిత్రలో బ్యాలెట్ కి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 139లో రోమ్‌లో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌ ను ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. చిత్రమేమిటంటే రోమ్ తర్వాత మనం అంటే ఇండియన్లు బ్యాలెట్ ను ఉపయోగించారు. అదీ ఎప్పుడనుకుంటున్నారు.. క్రీస్తుశకం 920లోనే.. ఆ రోజుల్లోనే మనం తాటాకు బ్యాలెట్ ను వాడినట్టు ఇటీవలే బయటపడింది. మన తర్వాత అమెరికాలోని మసాచుసెట్స్ బే కాలనీలో ఓ చర్చి పాస్టర్ ను ఎన్నుకునేందుకు 1629లో బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగించారట. ఓటింగ్ స్లిప్పులు కూడా ఆవేళ ఇచ్చినట్టు రుజువులు ఉన్నాయి.
తాటాకు బ్యాలెట్ నుంచి ఈవీఎంల వరకు...
ప్రాచీన భారతదేశంలో దాదాపు 920 ADలో తమిళనాడులో గ్రామ అసెంబ్లీ ఎన్నికలకు తాటి ఆకులను ఉపయోగించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. చాణుక్యుల కాలంలో ఈ వ్యవస్థ ఉండేదని, దాని పేరు కుడవోలై వ్యవస్థ అని నిర్ధారించారు. 10వ శతాబ్దపు చోళ శకం నాటి పురాతన ఎన్నికల పద్ధతి కుడవోలై వ్యవస్థ. ఉతిరమేరూర్ శాసనాలలో ఈ అంశం ఉంది. ఇది గ్రామ పరిపాలనా ప్రతినిధులను అంటే నేటి మన సర్పంచులు, వార్డు మెంబర్లు వంటి వారిని ఎన్నుకోవటానికి ఉపయోగించారు. ఈ వ్యవస్థలో గ్రామాలను వార్డులుగా విభజించారు. ఆ గ్రామంలో ఉండే జనం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా వారి ప్రతినిధులను ఎన్నుకుంటారు. తాటాకుపై పోటీదారుల పేర్లు (వోలై) రాసి ఒక కుండలో ఉంచుతారు. ఊళ్లోని ఓ పదేళ్ల పిల్లాడిని ఎంపిక చేసుకుని అతనితో ఆ కుండలోని ఓ తాటాకును తీయమంటారు. ఆ పిల్లాడు తీసిన తాటాకుపై పేరున్న వ్యక్తిని అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ప్రకటిస్తారు. అతను ప్రజలకు నచ్చినట్టుగా పాలన చేయాల్సి ఉంటుంది. ఆవేళ్టికి అదే ప్రజాస్వామిక విధానం. ఆ తర్వాత ఆ వ్యవస్థ చాలా మారుతూ వచ్చింది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో కుండను పెట్టి తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసేందుకు కుండ పెంకుల్ని ఇచ్చేవారు. అదే బ్యాలెట్. తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలనుకున్న వారు ఈ కుండ పెంకుల్ని ఆ కుండలో వేసి వస్తే చీకటిపడిన తర్వాత ఊరి పెద్దల ముందు వాటిని లెక్కించి గెలిచిన వ్యక్తిని ప్రకటించే వారు. ఆ తర్వాతి దశలో గ్రామ ప్రజలు ఇష్టపడే అభ్యర్థుల పేర్లను తాటి ఆకులపై రాసి వాటిని 'కుడం' అంటే మట్టి కుండలో ఉంచేవారు. అందరికీ తలా ఒక తాటాకు ముక్కను ఇచ్చేవారు. వాళ్లు ఆ ఓట్లను ఆయా అభ్యర్థులకు కేటాయించిన కుండల్లో వేయాలి. ఏ కుండలో ఎక్కువ ఆకులు ఉంటాయో ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించేవారు. చోళ పరిపాలనలో పంచాయితీ వ్యవస్థను పెంపొందించానికి ప్రజాస్వామ్య సూత్రాలపై పనిచేసింది. ఉత్తరమేరూరు శాసనాలు ప్రత్యేకంగా కుడవోలై వ్యవస్థను ప్రస్తావిస్తున్నాయి. చోళ రాజవంశంలో గ్రామ పరిపాలనకు విశిష్టమైన ప్రాధాన్యత ఇచ్చాయని ఆ శాసనాలు చెబుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించిన ఓ శకటం ఈ శాసనాలను, కుడవోలే వ్యవస్థను కళ్లకు కట్టింది.

ఆ తర్వాత మన బ్యాలెట్ పేపరు అనేక రూపాలుగా మారుతూ వచ్చింది. తెల్లకాగితంపై నల్లటి బొమ్మల నుంచి మొదలైన మన బ్యాలెట్ పేపరు ఒక వరుస నుంచి రెండు వరుసలకు, బ్లాక్ అండ్ వైట్ నుంచి రంగుల్లోకి మారింది. ఇప్పుడు మరింత ఆధునికతను సంతరించుకుని ఈవీఎంలపై బటన్ నొక్కితే ఓటు పడే వ్యవస్థ వచ్చింది. కాగితం కనుమరుగై కంప్యూటర్ యుగం వచ్చింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు వ్యక్తుల ప్రాధాన్యత, పలుకుబడిని బట్టి ఎంపికలు జరిగేవి. ఏజెంట్లను ఎంచుకున్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటి ఎన్నికలు బ్రిటీష్ ఇండియాలో 1920లో జరిగాయి. ఆ కాలంలో ఎంపిక చేసిన వారికి మాత్రమే ఓట్లు ఉండేవి. మహిళలందరికీ ఓటు హక్కు ఉండేది కాదు. పలుకుబడి గలిగిన లేడీస్ కి మాత్రమే ఓటు ఉండేది. 1930 జనవరి 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రకటించిన పూర్ణ స్వరాజ్ (బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశ స్వాతంత్ర్య ప్రకటన)తో పరిస్థితి మారింది.
1931లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ మేరకు 1947లో పురుషులు, మహిళలు ఇద్దరికీ సమానమైన ఓటింగ్ హక్కు ఇచ్చింది. 1950 జనవరి 25న ఏర్పడిన భారత ఎన్నికల సంఘం 1951లో మొదటి సాధారణ ఎన్నికలు నిర్వహించింది.
1951 నుంచి 1981 వరకు పాత పేపర్ బ్యాలెట్ విధానం కొనసాగింది. సులభమైన పద్ధతిలో ఈ బ్యాలెట్ ఉండేది. ఓటు అనేది ఒక ప్రాథమిక హక్కు. అది చిత్తుకాగితంలా కనిపించవచ్చు గాని ఈ దేశ భవిష్యత్ ను మార్చేది. ప్రజల తలరాతను మార్చేది. దీని మీద ప్రతి ఓటరు తనకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేస్తారు. ఓట్లను రహస్యంగా ఉంచుతూనే అది ప్రభుత్వం ఇచ్చిందా కాదా అని నిర్దారించేందుకు పాలనపరమైన గుర్తులు ఉండేవి.ఓటు వేసిన తర్వాత దాన్ని తీసుకువచ్చి పోలింగ్ బూత్ లోని ఓ డబ్బాలో వేసేవారు. అప్పుడప్పుడు ఓటర్లు తమకు ఇష్టమైన నినాదాలు రాసేవారు. మరికొన్ని సార్లు కవితలు, డిమాండ్లు కూడా రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేసే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాయి. దేశంలో మొదటగా 1981లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. 1999 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వాడుతున్నారు. 2004 నుంచి పూర్తిగా టిక్కెట్ పేపర్ ఫ్రేమ్‌వర్క్‌పై ఈవీఎంలు పని చేస్తున్నాయి. ఈవీఎంల వాడకంపై భిన్న వాదనలు కొనసాగుతున్నా సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం సరైందేనని తేల్చిచెప్పింది.
Tags:    

Similar News