జాతీయ విద్యా విధానం.. తమిళ భాషా యోధులను మళ్లీ గుర్తుచేస్తుందా?
తమిళనాట1960లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమ ప్రభావం ఇప్పటికీ ఎంత బలంగా ఉంది? ఆ ఉద్యమంలో పాల్గొన్న భాషా యోధుల అభిప్రాయాలను తెలుసుకుందాం.;
1972లో సామాజిక సంస్కర్త పెరియార్ ముందు సమావేశానుద్దేశించి ప్రసంగిస్తున్న తిరుమావళవన్
చెన్నై నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నామలై యూనివర్సిటీ. విశ్వవిద్యాలయం ఎంట్రెన్స్‌లోనే కనిపించే ఓ విగ్రహం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అది ఒకప్పటి యూనివర్సిటీ విద్యార్థి రాజేంద్రన్ విగ్రహం. 1960లో తమిళనాడులో జరిగిన భాషా ఉద్యమానికి ఆయన సజీవ సాక్ష్యం. తమిళ భాషకు ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయం. జాతీయ విద్యా విధానం (NEP) వల్ల తమిళనాట హిందీని మళ్లీ వ్యతిరేకించడం మొదలైంది. రాజేంద్రన్ త్యాగం నాటి భాషా యోధులను గుర్తుచేస్తుంది.
1965లో ఏం జరిగిందంటే..
ఆ రోజును ఇప్పటికీ మరిచిపోలేదని చెబుతున్నారు 81 ఏళ్ల ము తిరుమావళవన్. తిరుమావళవన్ అన్నామలై యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఉద్యమకారుడు కూడా. అప్పట్లో విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ..హిందీని వ్యతిరేకించిన వేలాది మంది విద్యార్థులలో ఈయన ఒకరు. పోలీసుల అమానుష దాడికి గురయిన వారిలో తిరుమావళవన్ కూడా ఉన్నారు.
“అప్పుడు విశ్వవిద్యాలయంలో 2వేల నుంచి 3వేల మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో 1,500 నుంచి 2వేల మంది ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ రోజు ఉదయం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, లైబ్రరీ వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. ‘ఉడల్ మన్నుకు, ఉయిర్ తమిళుకు’ (శరీరం మట్టికోసం, ప్రాణం తమిళానికి) నినాదంతో యూనివర్సిటీ హోరెత్తింది. విద్యార్థులను పట్టణంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు,” అని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు తిరుమావళవన్.
పోలీసుల దాడికి నిరసనగా కొంతమంది విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లోనే రాజేంద్రన్ ఓ చెట్టు దగ్గర గాయపడి మరణించారు,” అని తిరుమావళవన్ వివరించారు.
తిరుమావళవన్ ప్రకారం..తమిళనాడు NEP విధానాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. “ఆ విశ్వవిద్యాలయం ముందు రాజేంద్రన్ విగ్రహం ఎందుకు ఉంచారో నేటి విద్యార్థులు తెలుసుకోవాలి,” అని అంటారాయన.
కేంద్ర మంత్రి ప్రధాన్ వ్యాఖ్యల ప్రభావంతోనే..
తమిళనాడు NEP 2025 అమలు చేయకపోతే, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయబోమని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడంతో తమిళనాడులో మళ్లీ భాషా ఉద్యమం ఊపందుకుంది.
గతంలో పెద్ద ఉద్యమమే నడిచింది..
1960లో హిందీ విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 60 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇప్పుడు NEP కింద మూడు భాషల విధానం తప్పనిసరి చేయడాన్ని విద్యార్థులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
1968 నుంచి తమిళనాడు రెండు భాషల విధానాన్ని (తమిళం, ఇంగ్లీష్) అనుసరిస్తూ వచ్చింది. ఇంతవరకు రాష్ట్రం మూడు భాషల విధానాన్ని అమలు చేయలేదు.
రూ. 2,400 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంతో.. 1960 నాటి ఉద్యమకారుల కుటుంబ సభ్యులు, తమిళ భాషా నిపుణులు ఆ నిధులను విరాళాలుగా అందజేస్తున్నారు.
ఆ నాటి ఉద్యమం మళ్లీ వస్తుందా?
1960 ఉద్యమ ప్రభావం ఇంకా తమిళనాడులో బలంగా ఉందని నాటి ఉద్యమకారులు, వారి కుటుంబ సభ్యులు, భాషా ప్రియులు అంటున్నారు.
1964లో హిందీ విధానానికి వ్యతిరేకంగా తన తండ్రి చిన్నసామి ప్రాణత్యాగాన్ని గుర్తు చేశారు 64 ఏళ్ల ద్రవిడ సెల్వి. చెన్నైకి 300 కిలో మీటర్ల దూరంలోని అరియలూర్ జిల్లా కిజాపలువుర్ గ్రామానికి చెందిన చిన్నస్వామి.. హిందీని బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికి సెల్వి వయసు మూడేళ్ల. తండ్రి ప్రేమను గుర్తుచేసుకుంటూ బాల్యదశను దాటేశారు. “బలవంతంగా రుద్దే భాషా విధానాలకు మా కుటుంబం ఎప్పుడూ వ్యతిరేకం,” అని అంటారావిడ. “మా నాన్న త్యాగానికి గుర్తుగా.. మా ఇంట్లో అందరం తమిళానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నా మనవళ్లు కూడా నా జన్మదినానికి తమిళంలో కవితలు రాస్తారు,” అని పేర్కొన్నారు.
కిజాపలువుర్‌లో స్వారక భవనం..
చిన్నసామి త్యాగానికి గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఆయన గ్రామం కిజాపలువుర్‌లో స్మారక భవనాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. తన భర్త త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ 80 ఏళ్ల కమలమ్.. “చిన్నసామి స్ఫూర్తితో 60 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ త్యాగం ఎన్నటికీ మర్చిపోలేనిది” అని పేర్కొన్నారు.
తిరుమావళవన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. “రెండు భాషల విధానం తమిళనాడులో ఎప్పటికీ కొనసాగుతుంది,” అని తేల్చి చెప్పారు. “తమిళం నాకు జ్ఞానం ఇచ్చింది. ఇంగ్లీష్ జీవనోపాధిని ఇచ్చింది,” అని అంటారాయన. “నా కుమారులు ఇంగ్లీష్, ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నారు. పెద్ద కుమారుడు ఐటీ రంగంలో ఉద్యోగం చేసి అమెరికాలో స్థిరపడ్డాడు, అది ఇంగ్లీష్ నేర్చుకున్నందువల్లే,” అని చెప్పారు.
భాషను ప్రేమతో నేర్చుకోవాలి..
మద్రాస్ హైకోర్టు మహిళా హక్కుల న్యాయవాది సుధా రామలింగం.. NEP విధానాన్ని హిందీ బలవంతపు విధానంతో పోలుస్తూ.. “భాష అనేది ప్రేమతో నేర్చుకోవాలి, బలవంతంగా కాదు” అని అన్నారు.
“1966లో నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. రెండు నెలల పాటు హిందీ అక్షరాలు నేర్పించారు. మా చుట్టూ గోడలపై ‘తమిళానికి జయహో, హిందీ తిప్పికొట్టండి’ నినాదాలతో పోస్టర్లు దర్శనమిచ్చేవి. బలవంతపు భాషా విధానాన్ని వ్యతిరేకించాల్సిన అవసరాన్ని అవి గుర్తుచేసేవి. మేమూ నినాదాలు ఇచ్చాం. “అప్పుడు హిందీ బలవంతపు విధానం ఎందుకు తప్పు అనేది అర్థమైంది. ఇప్పుడు NEP విధానం కూడా అదే నిబంధనల్ని రుద్దేలా ఉంది,” అని అభిప్రాయపడ్డారు.
ఆ పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు..
సుధా తన వృత్తి కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాలను సందర్శించారు. అక్కడ ఆమె న్యాయవాదులు, సాధారణ ప్రజలతో సంభాషించాల్సిన సందర్భాలు ఎదుర్కొన్నారు. “నేను వారితో ఇంగ్లీష్‌లో మాట్లడాను. అప్పుడప్పుడు హిందీలోనూ. హిందీ నాకు పూర్తిగా తెలియదని నన్నెవరూ తక్కువ చేసే చూడలేదు. హిందీ తెలియకపోవడం నాకు ఎప్పుడూ సమస్యగా అనిపించలేదు. అయితే అనేక సందర్భాల్లో ఇంగ్లీష్ మాత్రం ఎంతో ఉపయోగపడింది,” అని ఆమె ‘ది ఫెడరల్’కు తెలిపారు.
సుధా తన కుమార్తె, మనవరాలు కూడా తమిళం, ఇంగ్లీష్ భాషల్ని నేర్చుకున్నారని, వారు ఎంతో సౌకర్యంగా జీవిస్తున్నారని తెలిపారు. “ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు (AI) ఉన్నందున.. భాష అంతటి పెద్ద సమస్య కాదు. అందువల్ల ఏ భాషనైనా బలవంతంగా నేర్పించాల్సిన అవసరం లేదు,” అని ఆమె స్పష్టం చేశారు.