కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో KSRTC అలర్ట్..
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్న కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి..
కర్నూలు జిల్లాలో స్లీపర్ బస్సు దగ్ధమై (Bus accident) 20 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం (Karnataka Government) అప్రమత్తమైంది. బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (BMTC), కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KKRTC), నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థల (NWKRTC) మేనేజింగ్ డైరెక్టర్లను కోరారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
గతంలో తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, హవేరి జిల్లా సమీపంలో ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగిందని గుర్తుచేశారు. ఒక ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై చాలా మంది ప్రయాణికులను బలిగొందని, ఆ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సెఫ్టీ డ్రైవ్ నిర్వహించామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, కాంట్రాక్ట్ బస్సులు, ప్రైవేట్, టూరిస్ట్ బస్సులు, టెంపో ట్రావెలర్లు, స్కూల్ బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవి పనిచేస్తున్నాయో లేదో కూడా తనిఖీ చేయాలని ఆర్డీఏ అధికారులకు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగలగొట్టడానికి వీలుగా సుత్తెలు అమర్చాలని, లగేజీ కంపార్ట్‌మెంట్ ఏరియాలో ఏ వ్యక్తినీ నిద్రించడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించకూడదని ఆదేశించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మండే స్వభావం ఉన్న వస్తువులు లేదా మెటీరియల్‌ను బస్సుల్లో తీసుకెళ్లేందుకు అనుమతించకూడదని డ్రైవర్లను కోరారు. అలా తీసుకెళ్లే వాహనాలను తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.