కేరళ: కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలు ఎందుకు కీలకం
నెల రోజుల క్రితం, సీపీఐ(ఎం) నేతలు లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నప్పుడు, పొన్నాని నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల గురించి ఓ సీనియర్ నేత..
పార్టీ పరిశీలనలో రెండు పేర్లు ఉన్నాయి కానీ ఇంకా ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు. ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అడినప్పుడు మాత్రం ఆయన ఇలా అన్నారు. "అభ్యర్థి ఎవరైనా కావచ్చు - పార్టీ సభ్యుడు, సానుభూతిపరుడు, తోటి ప్రయాణికుడు లేదా స్వతంత్రుడు అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం. అతడు కొడవలి- సుత్తి నక్షత్రం గుర్తుతో పోటీ చేస్తాడు"
నాయకుడి మాట్లాడిన మాటలు నాకు సరిగా అర్థం కాకపోయినా, పార్టీలో చాలామంది పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. పైగా సీపీఎం సొంతంగా లోక్ సభ ఎంపీలను గెలుచుకునే ఏకైక రాష్ట్రం కేరళనే. కాగా పార్టీ చివరకు ఐయూఎంఎల్ అసంతృప్తి నాయకుడు కెఎస్ హంజా పై ఆధారపడింది. ఆయనకే పార్టీ టికెట్ కేటాయించింది.
ఇంతకు ముందు ఉదహరించిన సిపిఐ(ఎం) నాయకుడు ది ఫెడరల్‌తో చెప్పినట్లుగా, పార్టీ తన 15 మంది అభ్యర్థులను పార్టీ గుర్తుతో బరిలోకి దింపింది. ఎలాగైన పార్టీ మెజారిటీ ఓట్లు సీట్లు గెలవాలనే కృత నిశ్చయంతో ఉంది.
వామపక్ష వ్యతిరేక ఎత్తుగడలా?
సీపీఐ(ఎం) పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన ఎన్నికలలో ఇది ఒకటి కాగలదని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే ఎలాంటి తప్పులు చేయకుండా పోల్ మేనేజ్ మెంట్ చేయాలని తన కార్యకర్తలను కోరింది.
కోజికోడ్‌లో జరిగిన కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్‌ప్రైజెస్ (KSFE) ఆఫీసర్స్ యూనియన్ సదస్సులో CPI(M) సెంట్రల్ కమిటీ సభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి AK బాలన్ మాట్లాడుతూ "దేశంలో వామపక్ష ఉద్యమాన్ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో, మనం నిర్ణీత శాతం ఓట్లు లేదా ఎంపీల సంఖ్యను సాధించడంలో విఫలమైతే, మన పార్టీ జాతీయ స్థితి మారుతుంది. మేము 'స్వతంత్ర పార్టీ' అవుతాము. అప్పుడు మేము మా సీనియర్ నాయకులను స్వతంత్రంగా ఉపయోగించి ప్రచారం చేయాలి. మనం మన గుర్తింపులను కొల్పోలేం ”బాలన్ అన్నారు.
1968 ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ కేటాయింపు) ఆర్డర్‌లో పేర్కొన్న మూడు షరతుల్లో దేనినైనా నెరవేర్చినట్లయితే రాజకీయ పార్టీ జాతీయ హోదా పొందుతుంది. కనీసం నలుగురు లోక్‌సభ సభ్యులు ఎన్నిక కావడంతో పాటు లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లను అది తప్పనిసరిగా పొందాలి.
ప్రత్యామ్నాయంగా, అది లోక్‌సభ స్థానాల్లో రెండు శాతానికి తక్కువ కాకుండా కనీసం మూడు రాష్ట్రాల అభ్యర్థులను నిలబెట్టాలి. అదనంగా, అది కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తించబడాలి.ప్రస్తుతం, కేవలం ఆరు పార్టీలు - AAP, BJP, BSP, CPI(M), కాంగ్రెస్, NPP - జాతీయ పార్టీ హోదాను కలిగి ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ఎన్‌సిపి 2023లో హోదాను కోల్పోయాయి, ఆ సంవత్సరం ఆప్ జాతీయా హోదా పొందింది.
సీపీఐ(ఎం) అవకాశాలు
ప్రస్తుతం, CPI(M)లోక్‌సభలో కేవలం మూడు స్థానాలను మాత్రమే కలిగి ఉంది - కేరళ నుంచి ఒకటి తమిళనాడు నుంచి రెండు. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తమిళనాడులో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందినందున ఇది జాతీయ ట్యాగ్‌ను కలిగి ఉంది. కానీ పార్టీ ఏడు రాష్ట్రాల అసెంబ్లీలలో ఉనికి ఉంది. కేరళలో అత్యధికంగా 62 సీట్లు ఉన్నాయి. దీనికి త్రిపురలో 11 మంది ఎమ్మెల్యేలు, తమిళనాడు, బీహార్‌లో ఇద్దరు చొప్పున, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాంలలో ఒక్కొక్కరు ఉన్నారు.
ప్రారంభం, పతనం
వామపక్ష పార్టీలు, ఒక కూటమిగా కూడా ప్రస్తుత లోక్‌సభలో కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు - CPI(M) నుంచి ముగ్గురు, CPI నుంచి ఇద్దరు. ఇది దాదాపు ఆరు దశాబ్దాల్లో వామపక్షాలకు ఇదే కనిష్ట స్థాయి సీట్లు.
1990 నుంచి 2009 మధ్య, వామపక్షాలు జాతీయ ఎన్నికలల్లో స్థిరంగా తమ ప్రభావాన్ని చూపాయి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, CPI(M) నాయకుడు, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు ప్రధానమంత్రి కావడానికి దగ్గరగా వచ్చిన సమయంలో పార్టీ ప్రభ మరో స్థాయికి పెరిగింది.
2004లో, వామపక్ష పార్టీలు తారాస్థాయికి చేరుకున్నాయి, CPI(M) 43 లోక్‌సభ స్థానాలను, CPI 10, ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) ఒక్కొక్కటి ముగ్గురు ఎంపీలను పంపాయి. అయితే, 2009 నుంచి 2019 వరకు, వారు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు మాత్రమే పొందారు. 2011లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, 2018లో త్రిపురలో బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీకి షాక్ ఇచ్చాయి.
తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు
సీపీఐ(ఎం) 40కి పైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, అందులో ఆశాజనకంగా ఉన్న స్థానాల్లో తమిళనాడు నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి ఒకరు ఉన్నారు. కేరళ మాత్రమే పార్టీకి నిజమైన ఆశ అని ఈపరిణామాలు తెలియజేస్తున్నాయి.
CPI(M) దేశంలోని ఆధిపత్య వామపక్ష పార్టీ, పాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)లో చీలిక తర్వాత 1964లో స్థాపించబడింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, CPI(M) మూడు రాష్ట్రాలను (పశ్చిమ బెంగాల్, కేరళ త్రిపుర) అధికారంలో ఉండేది.