హైస్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం ఉన్న శైలజ.. తరగతి గదిలో నిలబడి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై సీపీఎం వైఖరేమిటో విద్యార్థులకు వివరిస్తుంది. ఆ చట్టం మతం ఆధారంగా వివక్ష చూపుతుంది" అని విమర్శిస్తుంది. "డైన్ విత్ శైలజ" అనే ప్రోగ్రాంలో అందరికీ కొసరి కొసరి వడ్డిస్తుంది. దగ్గరుండి యోగక్షేమాలు కనుక్కుంటుంది. ఓటర్లను అన్నా, అక్కా, వదిన, చెల్లి, తమ్ముడూ అంటూ ఆకట్టుకుంటుంది. భోజనం వడ్డిస్తుంది. వారితో పాటే కలిసి తింటుంది. తద్వారా జనంలోకి దూసుకువెళుతుంది.
వడకర ఒకప్పుడు సీపీఎం పెట్టని కోట...
వడకర నియోజకవర్గం ఒకప్పుడు సీపీఎం పెట్టని కోట. ఆ తర్వాత అది చేజారింది. ఇప్పుడు శైలజ రూపంలో అది తిరిగి సొంతమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పోయిన ప్రభావాన్ని నిలబెట్టే క్రమంలో సీపీఎం శైలజను రంగంలోకి దింపింది. 2009 ఎన్నికల నాటి నుంచి వడకర సీటు సీపీఎం చేజారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ సీపీఎం గెలిచింది లేదు. 2009లో కాంగ్రెస్ కురువృద్ధుడు ముల్లపల్లె రామచంద్రన్ సీపీఎం అభ్యర్థి పి.సీతాదేవిని 56 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. 2014లోనూ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. రామచంద్రన్ చేతిలో సీపీఎం అభ్యర్థిపై 53వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.మురళీధరన్ సీపీఎం అభ్యర్థి పి.జయరాజన్ ను సుమారు 86 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడించి ఈ సీటు కాంగ్రెస్ దేనని ఖరారు చేశారు.
కూటమిలో మిత్రులు.. కేరళలో శత్రువులు
చిత్రమేమిటంటే ఈ రెండు పార్టీలు ఇండియా విపక్ష కూటమిలో సభ్య పార్టీలే. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పెట్టిన ప్రతి సమావేశానికి సీపీఎం నాయకత్వం వెళుతుంది. చిత్రంగా కేరళలో మాత్రం సీట్ల సర్దుబాటు కుదరక రెండూ పార్టీలు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కన్నూరు జిల్లాలోని మత్తన్నూరు నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన శైలజ పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న షఫీ పరంబిల్ తో పోటీ పడుతున్నారు. ఇక ఈ రెండు పార్టీలకు శత్రువుగా ఉన్న బీజేపీ తరఫున ఆ పార్టీ యువజన విభాగం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ప్రఫుల్ కృష్ణన్ పోటీ చేస్తున్నారు. నిజానికి ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ. సుమారు 31 శాతం మంది ఉన్నారు. వడకర నియోజకవర్గ విజేతను నిర్ణయించడంలో ముస్లిం ఓటర్లదే ప్రముఖ పాత్ర. వీళ్లిప్పుడు కాంగ్రెస్ ను నమ్ముతారా, కమ్యూనిస్టులను నమ్ముతారా అనేది సమస్య.
రెండో విడత పోలింగ్ జరిగే ఈనెల 26న వడకర నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతుంది. అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సంధించాయి. పాత, కొత్త ఆరోపణలు చేసుకుంటున్నాయి. వడకర నియోజకవర్గానికి రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, హత్యల చరిత్ర ఉంది. గత ఎన్నికల్లో సీపీఎం ఈ కారణాలతోనే ఓడిపోయిందంటారు. 2012 మే నెలలో సీపీఎంపై తిరుగుబాటు చేసి సొంత కుంపటి- ఇండియన్ రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ- పెట్టుకున్న టీపీ చంద్రశేఖరన్ అనుహ్యాంగా మర్డర్ అవుతారు. ఆ ఆరోపణ ఎవరి మీదికి వస్తుందో ఊహించాల్సిన పని లేదు. సీపీఎం పైకి ఆ ఆరోపణ వచ్చింది. చంద్రశేఖరన్ భార్య కేకే రమ ఆ ఆరోపణే చేశారు. తన భర్తను చంపేసినా పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ శపథం చేశారు. కొత్త పార్టీకి జవసత్వాలు కల్పించారు. సీపీఎంకి ఆ జిల్లాలో పక్కలో బల్లెంలా నిలిచారు. వడక్కర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యేదాకా వెళ్లారు.
ఎన్నికలు వస్తున్నప్పుడల్లా వడకర ప్రాంతంలో హింస చెలరేగడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 5న పన్నూరు ప్రాంతంలో క్రూడ్ బాంబు తయారు చేస్తుండగా సీపీఎం కార్యకర్త ఒకరు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇదే అదునుగా కాంగ్రెస్ రంగంలోకి దిగింది. కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై విమర్శలకు లంకించుకుంది. పన్నూరు ప్రాంతంలో శాంతియాత్రలు చేపట్టింది. సీపీఎం హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ శాపనార్థాలు పెట్టింది. ప్రస్తుతం దీని చుట్టూతా చర్చలు సాగుతున్నాయి జనంలో. ఎన్నికల భవితవ్యాన్ని ఇటువంటి హింసాత్మక ఘటనలు నిర్ణయిస్తాయంటున్నారు ఓ రిటైర్డ్ టీచర్ చంద్రప్పన్. ప్రస్తుత యువత రాజకీయాల్లో హింసను కోరుకోవడం లేదన్నారు ఆయన.
శైలజ సేవల్ని గుర్తించిన ఐక్య రాజ్య సమితీ..
1956 నవంబర్ 20న జన్మించిన శైలజ బీఎస్సీ కెమిస్ట్రీ చదివారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ముందు టీచర్ గా పని చేశారు. ఆమెపై వాళ్ల అమ్మమ్మ ఎంకే కల్యాణి ప్రభావం ఎక్కువ అని చెబుతారు. కల్యాణి కూడా మంచి కమ్యూనిస్టు. ప్రజా సంక్షేమం అంటే మక్కువ చూపే మనిషి. బ్రిటీష్ హయాంలో కమ్యూనిస్టులు చూపిన తెగువ, త్యాగం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. ఆ వారసత్వాన్ని శైలజ అందిపుచ్చుకున్నారు. ఆమె ఉద్యమాల్లోకి చేరిన తర్వాత డీవైఎఫ్ఐ నేత భాస్కరన్ మాస్టారును పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. 1980ల తర్వాత స్త్రీ శబ్దం అనే పత్రికకు ఎడిటర్ గా పని చేశారు. 1996లో కూత్ పరంబ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు.
ఆరోగ్య శాఖ మంత్రిగా...
ఆరోగ్య మంత్రిగా శైలజ టీచర్ తన నిబద్ధత, దృఢమైన పని తీరుతో ఎందర్నో ఆకట్టుకున్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని ఆమె సహోద్యోగుల్లో ఒకరు చెప్పినట్టుగా "ఆమె చాలా టఫ్ టాస్క్‌మాస్టర్. అర్ధరాత్రైనా అపరాత్రైనా, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా కరోనా సమయంలో ఆమె చూపిన పట్టుదల అపారం. పట్టిన పని పూర్తి అయ్యే వరకు విశ్రమించే వారుకాదు. అనుకున్న పని అనుకున్నట్టు జరిగితే తప్ప ఇంటికి వెళ్లేవారు కాదంటారు.
కేరళలో కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆమె చూపిన చొరవ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీసు విభాగం ఆమెను న్యూయార్క్ కు ఆహ్వానించింది. ది గార్డియన్ పత్రిక ఆమెను "కరోనావైరస్ స్లేయర్", "రాక్ స్టార్ ఆరోగ్య మంత్రి"గా అభివర్ణించింది.బీబీసీ న్యూస్ ఆమెను మహిళా కరోనా ఫైటర్స్ జాబితాలో చేర్చింది. వోగ్ మ్యాగజైన్ "వోగ్ ఉమెన్ వారియర్"గా ప్రకటించింది. బ్రిటీష్ మ్యాగజైన్ ప్రాస్పెక్ట్ ఆమెను 2020కి ప్రపంచంలోని 'అత్యున్నత ఆలోచనాపరురాలు'గా ఎంపిక చేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ శైలజను 2020లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా పేర్కొంది. అటువంటి ఆమెకు ముఖ్యమంత్రి విజయన్ రెండోసారి తన మంత్రివర్గంలో చోటు ఇవ్వనందుకు సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థలు దుమ్మెత్తి పోశాయి. ఇప్పుడామెనే తన సొంత జిల్లా పరిధిలోని వడకర నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీకి పెట్టారు విజయన్.ఏప్రిల్ 26న జరిగే ఎన్నికల్లో ఆమె భవిత్వం తేలనుంది.