మేం ప్రతీకార రాజకీయాలు చేయం: సీఎం సిద్ధరామయ్య
బీఎస్ యడ్యూరప్ప పై ఫోక్సో చట్టంపై విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై వస్తున్న విమర్శలకు కన్నడ సీఎం స్పందించారు.
By : Praveen Chepyala
Update: 2024-06-15 12:31 GMT
తాను, తన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదని, ఇకముందు ఆ పని చేయబోమని కర్నాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే బీజేపీ అలాంటి చర్యలకు పాల్పడటంలో అందేవేసిన చేయి అని ఆరోపించారు
పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై అరెస్ట్ వారెంట్ రావడంతో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ, జేడీ(ఎస్) విమర్శలు గుప్పించాయి. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుటుంబాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యడ్యూరప్ప కుటుంబాన్ని టార్గెట్ చేస్తోందని జెడి(ఎస్) నేత, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా బెంగళూర్ లో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య.. ‘వాళ్లు (బీజేపీ) మాపై కేసులు పెట్టినప్పుడు అది టార్గెట్ కాదా? నాపై, డీకే శివకుమార్ (డిప్యూటీ సీఎం), రాహుల్ గాంధీ (కాంగ్రెస్ నేత)పై కేసులు పెట్టారని, దాన్ని ఏమని పిలవాలని ప్రశ్నించారు. వారు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని (లోక్‌సభ) రద్దు చేశారని అన్నారు.
‘‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపారు.. దాన్ని ఏమని పిలవాలి. ఇవీ ప్రేమతో చేసిన రాజకీయామా? ప్రతీకార రాజకీయాలకు పాల్పడేవారు వారే. మేం ఇప్పటి వరకూ అలాంటి రాజకీయాలు చేయలేదు. నేను నిన్ననో, ఈ రోజు రాజకీయాల్లోకి రాలేదు. ప్రతీకార రాజకీయాలు చేయడం బీజేపీ పని’’ అని సీఎం అన్నారు.
ప్రస్తుతం ఫోక్సో చట్టంపై యడ్యూరప్పను అరెస్ట్ చేయకుండా కర్నాటక హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. మాజీ సీఎంను ఫోక్సో కేసులో జూన్ 17న తమముందు హజరుకావాలని కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఆదేశించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్యూరప్ప తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపించిన 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 354 A (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని ఈ లైంగిక వేధింపులు జరిగాయని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
బీజేపీ దక్షిణాదిలో విస్తరించదు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దక్షిణాది నుంచి ఎనిమిది మంది కేంద్ర మంత్రులు చేసింది.. పార్టీ విస్తరణ కోసమేనా అన్న ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ.. బీజేపీ ఏం చేసిన దక్షిణాదిన ప్రజలు దానికి మద్దతు ఇవ్వరు. ఎందుకంటే అది ఆర్ఎస్ఎస్ ముసుగు అని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిలోనూ, ఉత్తరప్రదేశ్, ముంబయి (మహారాష్ట్ర)లోనూ ఎదురుదెబ్బ తగిలిందని, వారి అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఒకరు అన్నారని సీఎం గుర్తు చేశారు.
ప్రతీకార రాజకీయాలే బీజేపీ పని అని, 'ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐ పేరుతో బెదిరించడం, మొదటి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తారని అందుకే ప్రజలు వారికి మెజారిటీ ఇవ్వలేదని సిద్ద రామయ్య అన్నారు.
నీట్ పరీక్ష విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని.. దీనిపై విచారణ జరిపి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ) పరీక్షలను సరిగ్గా నిర్వహించలేదు, గ్రేస్ మార్కులు ఇవ్వడం మంచి పద్ధతి కాదు, ఎవరూ గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయకూడదు. వీలైనంత త్వరగా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు.