‘గవర్నర్’ కేంద్రంలో చేతిలో కీలుబొమ్మ: సీఎం సిద్ధరామయ్య
తనపై కేవలం రాజకీయ కక్షతోనే గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. తాను రాజీనామా చేసేంత తప్పు చేయలేదని పేర్కొన్నారు.
By : Praveen Chepyala
Update: 2024-08-18 04:47 GMT
కర్నాటకలో రాజకీయాల కాక రేగింది. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు సీఎం వర్సెస్ గవర్నర్ గా మారాయి. ‘ముడా ’ స్కామ్ లో సీఎంకు ఆయాచిత లబ్ధి చేకూరినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించడం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కేసులో తనపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆమోదం తెలిపిన విషయంపై మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య, “ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య, దీనిని చట్టపరంగా సవాలు చేస్తాం” అని అన్నారు.
ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీలో చేసిన విధంగానే కర్ణాటకలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ, జేడీ(ఎస్), కొందరు నేతలు భారీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. "నాపై చెల్లుబాటు అయ్యే కేసు లేదు, గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమైనది" అని ఆయన అన్నారు.
రాజీనామా చేసే ఉద్దేశం లేదు: సీఎం
గవర్నర్ చర్యలు ఎలా ఉన్నా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, శాసనసభ్యులు, కేబినెట్ మంత్రులు తనకు అండగా నిలుస్తున్నారని, తన రాజీనామాను డిమాండ్ చేసే నైతిక హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. సామాజిక న్యాయానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం విరుద్ధమని ఆరోపించారు. "వారు మా విజయాన్ని తట్టుకోలేకపోతున్నారు," అని సీఎం విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, మురుగేష్ నిరాణి, శశికళ జొల్లె, జి జనార్దన రెడ్డి వంటి నేతలపై ఫిర్యాదులు చేసినా గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిద్ధరామయ్య ఎత్తిచూపారు. అనధికార మైనింగ్ లైసెన్సులపై కుమారస్వామిపై విచారణ జరిపేందుకు నవంబర్‌లో అనుమతి కోరినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.