తాగునీటి ప్రాజెక్టులపై కర్ణాటక సర్కారు మల్లగుల్లాలు

యెత్తినహోళె, మేకేదాటు, ఎగువ భద్ర వద్ద ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించడం లేదని కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Update: 2024-08-07 08:48 GMT

యెత్తినహోళె, మేకేదాటు, ఎగువ భద్ర వద్ద ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించడం లేదని కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపిస్తోంది. 2023 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పర్ భద్ర ప్రాజెక్ట్ (యుబిపి)కు కర్ణాటక రాష్ట్రానికి రూ.5,300 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆ నిధులను చేయకపోవడంతో సీఎం సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.

కీలకమైన నీటి ప్రాజెక్టు..

ఎగువ భద్ర ప్రాజెక్ట్ ..ముఖ్యమైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. ఖరీఫ్ సీజన్‌లో సాగునీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అదనంగా చిక్కమగళూరు చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె కరువు పీడిత తాలూకాలకు తాగునీరందిస్తోంది.

కృష్ణా నీరవారి నిగమ్ లిమిటెడ్ (కెఎన్‌ఎన్‌ఎల్) ప్రాజెక్ట్‌లలో యెట్టినహోల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వైఐడిడబ్ల్యు) ఒకటి. ఇది కర్ణాటకలోని శాశ్వత కరువు పీడిత జిల్లాలలోని దాదాపు ఏడు మిలియన్ల ప్రజల దాహార్తిని తీర్చడానికి రూపొందించిన ప్రాజెక్టు.

బెంగళూరు నీటి అవసరాల కోసం..

రామనగర జిల్లా కనకపుర సమీపంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో కూడిన మేకేదాటు ప్రాజెక్టు ఒక బహుళార్ధసాధక ప్రాజెక్ట్. బెంగళూరు, పొరుగు ప్రాంతాలకు 4.75 TMCల తాగునీరు అందించడం, 400 MW విద్యుత్ ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే.. కర్ణాటక రాజధానితోపాటు పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీరుతుంది. ఈ ప్రాజెక్ట్ వరదలు నివారణకు, కరువును నివారించడానికి దోహదపడుతుంది. రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

యెట్టినహోల్ ప్రాజెక్ట్..

గతేడాది ఆగస్టులో ఉపముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మొదలుపెట్టిన యెత్తినహోళె ప్రాజెక్టు మొదటి దశను పనుల పూర్తికి 100 రోజుల గడువు విధించారు. డిసెంబర్ నాటికి నీటిని ఎత్తిపోయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లను ఆదేశించారు. అయితే దాదాపు ఏడాది పూర్తవుతున్నా.. ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో తమకు హామీ ఇచ్చిన రూ.5,300 కోట్లు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు పూర్తికాలేదని కర్ణాటక సర్కారు కేంద్రాన్ని విమర్శిస్తోంది.

ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు..

గత అసెంబ్లీ సెషన్‌లో యెత్తినహోళె ప్రాజెక్టు పురోగతి గురించి హెచ్‌కె సురేష్ (బిజెపి) అడిగిన ప్రశ్నకు శివకుమార్ సమాధానమిస్తూ.. రాణాఘాట్ సమీపంలోని 5.24 కి.మీ సొరంగంలో 2.4 కి.మీ పనులు పూర్తయ్యాయని చెప్పారు. తుమకూరు జిల్లా సిరా తాలూకాలోని ట్యాంకులు నిండేలా ప్రాజెక్టులో మార్పులు చేయాలని మే నెలలో ఎమ్మెల్యే, న్యూఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి టిబి జయచంద్ర డిమాండ్ చేశారు. జలవనరుల శాఖాధికారులతో సమావేశమైన జయచంద్ర మాట్లాడుతూ.. సిరాకు తాగునీరు అందించడం వల్ల ప్రయోజనం ఉండదని అందుకు బదులుగా సిరా పట్టణంలోని 200 ట్యాంకులను ప్రాజెక్టు నీటితో నింపడం వల్ల లాభం ఉంటుందని చెప్పారు.

నీటి కొరత నివారణకు శివకుమార్ ప్రణాళిక..

గత నెలలో నీటి కొరత నివారణకు డిప్యూటీ సీఎం శివకుమార్ ఒక ప్రణాళిక రూపొందించారు. జూలై నుంచి నేత్రావతి నది నుంచి యెత్తినహోళే ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేయడానికి ప్రణాళిక తయారుచేశారు. అయితే రుతుపవనాలు శివకుమార్‌కు కొంత ఊరటనిచ్చాయి. ఈ ప్రణాళిక అమలుకు దాదాపు 500 ఎకరాల అటవీ భూమి అవసరమని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. అందుకు ప్రతిఫలంగా అటవీశాఖకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అయితే ప్రజల కోసం కీలకమైన 500 ఎకరాల భూమిని వదులుకోవడానికి అటవీ శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అటవీ భూమికి బదులుగా దేవాదాయ శాఖ సమాన విస్తీర్ణాన్ని తిరిగి ఇస్తుందని అన్నారు.

నీటిని పంపింగ్ చేయడం..

లిఫ్ట్ కాంపోనెంట్ ఇప్పటికే ఉన్నందున శివకుమార్ తన బృందాన్ని ఇంధన శాఖను సంప్రదించి పంపింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఆయన ప్రకారం నేత్రవతి నుండి కనీసం 48 కి.మీ వరకు ప్రవహించే అవకాశం ఉంది. అయితే ఏడాదికి మూడు నెలలు మాత్రమే (వానాకాలంలో) నీటిని పంపింగ్ చేయవచ్చు. ఏడాది పొడవునా నీళ్లను పంపింగ్ చేసేందుకు, నీటి వృథా అరికట్టేందుకు నలుగురు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని శివకుమార్ నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు మొదట ఆమోదం లభించినప్పుడు దీని వ్యయం రూ.8,323 కోట్లుగా అంచనా వేశారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సవరించిన అంచనా వ్యయం రూ.12,912.36 కోట్లు.

భూ స్వాధీనానికి అయ్యే ఖర్చేంత?

భూసేకరణ ఖర్చు నాలుగు రెట్లు పెరిగింది. ఇప్పుడు సవరించిన అంచనా రూ. 23,251 కోట్లు. 'అభివృద్ధే' తమ ప్రధాన ఎజెండా అని నిరూపించుకోడానికి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన యెత్తినహోళీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చింది. బసవరాజ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం యెత్తినహోల్ ప్రాజెక్టుకు రూ.23,251 కోట్ల అంచనాలను సవరించడంతో దశాబ్దకాలంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యెత్తినహోళె నీటి మళ్లింపు ప్రాజెక్టుకు కొత్త జీవో వచ్చింది. దీంతో ప్రాజెక్టు వ్యయం 179 శాతం పెరిగింది.

వివాదాస్పదమైన YWDP జూలై 2012లో ఆమోదం పొంది దాదాపు దశాబ్దం కాలం గడిచిపోయింది. స్థానికులు, రాజకీయ నాయకుల నిరసనలు, వ్యతిరేకత కారణంగా ప్రాజెక్ట్ అమలు సంస్థ విశ్వేశ్వరయజల నిగమ్ లిమిటెడ్ (VJNL) దాదాపు 60 శాతం పనులు పూర్తి చేసింది. ఇంకా పనులు జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

మేకేదాటు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదని ఆరోపించిన సిద్ధరామయ్య.. మోదీ సర్కారు ఆమోదం తెలిపితే కావేరి మీదుగా మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును నిర్మించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చిత్తశుద్ధి ఉంటే కుమారస్వామి జోక్యం చేసుకోవాలి..

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామికి మండ్య జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి ఉంటే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో చర్చలు జరపాలని సిద్ధరామయ్యను కుమారస్వామి కోరారు.

కుమారస్వామి సూచనకు ప్రతిస్పందిస్తూ..శివకుమార్ ఇలా అన్నారు.. “కర్ణాటక, తమిళనాడు రైతుల భవిష్యత్తుకు మేకేదాటు ఆనకట్ట కీలకం. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, ఎన్‌డిఎ కూటమి భాగస్వామి ప్రాజెక్ట్ అమలులో చొరవ తీసుకోవాలి.’’ అని పేర్కొన్నారు. 

Tags:    

Similar News