‘రైతులకు నోటీసులివ్వొద్దు, ఇచ్చిన వాటిని విత్‌డ్రా చేసుకోండి’

‘‘ముఖ్యమంత్రి ఆదేశాలు లెక్కచేయకుండా రైతులకు మళ్లీ, మళ్లీ రిమైండర్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తప్పవు’’ - రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేందర్ కుమార్

Update: 2024-11-10 06:58 GMT

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములపై వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో భూ రికార్డులను మార్చడం లేదా వక్ఫ్ చట్టం కింద రైతులకు నోటీసులు జారీ చేయడం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

నోటీసులు విత్‌డ్రా..

కర్ణాటక వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా భూముల ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో.. ఇటీవల సిద్ధరామయ్య జిల్లాల పరిధిలోని ప్రాంతీయ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమావేశమయ్యారు. మ్యుటేషన్ రికార్డులను మార్చాలని గతంలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయం లేదా అధికారులు జారీ చేసిన ఆదేశాలన్నింటిని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేందర్ కుమార్ కటారియా ఒక లేఖలో తెలిపారు. గతంలో ఇచ్చిన అన్ని నోటీసులను ఉపసంహరించుకున్నామని, ఆ భూముల్లో సాగు చేస్తున్న రైతులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కూడా అందులో ఆదేశాలు జారీ చేశారు.

'క్రమశిక్షణా చర్యలు'

‘‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు, భూ యజమానులకు అందజేసిన రిమైండర్‌లను ఉపసంహరించుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాలు కాదని మళ్లీ, మళ్లీ రిమైండర్లు జారీ చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’ అని కటారియా లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశించారు. నవంబర్ 13న మూడు కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తర కర్ణాటక విజయపురలోని హోన్వాడ్ గ్రామంలోని కొందరు రైతులకు నోటీసులు అందాయి.

మరోవైపు మంత్రి జమీర్ ఆదేశాలు..

రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా భూములను 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయాలని కర్ణాటక వక్ఫ్ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో గందరగోళం నెలకొందని బీజేపీ నేత తేజస్వి సూర్య అక్టోబర్ 25న ఆరోపించారు. సూర్య అభ్యర్థన మేరకు వక్ఫ్ (సవరణ) బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీ చైర్మన్ జగదాంబిక పాల్ నవంబర్ 7న కర్ణాటకలో పర్యటించింది. తమ భూములను వక్ఫ్ ఆస్తులుగా చూపుతున్నారని హుబ్బల్లి, విజయపుర, బెలగావి జిల్లాల్లోని రైతులు చైర్మన్ ముందు వాపోయారు.

Tags:    

Similar News