కర్ణాటకలో వాటర్ ట్యాక్స్ పెంపు..

లీటరుకు ఒక పైసా పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం. జల సంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు.;

Update: 2025-03-15 10:35 GMT

కర్ణాటక(Karnataka)లో ఇంటింటికి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు వసూలు చేసే ఆలోచనలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఇప్పుడు నీటి పన్ను కూడా పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారే (D K Shivakumar) స్వయంగా వెల్లడించారు. 2014 తర్వాత నీటి చార్జీలు పెంచలేదని చెబుతూ.. ప్రతి లీటరు నీళ్లపై ఒక పైసా పెంచనున్నట్లు తెలిపారు.

BWSSB ప్రతిపాదన.. ప్రభుత్వ నిర్ణయం..

‘‘నష్టాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు (BWSSB) నీటి చార్జీ(Water Tax)ని లీటరుకు 7 నుంచి 8 పైసాలు పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఒక పైసా మాత్రమే పెంచాలనుకుంటున్నాం. ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం", అని శివకుమార్ చెప్పారు.

తాగునీటి సమస్య రానివొద్దు..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామోజీ గౌడ వేసవిని దృష్టిలో ఉంచుకుని కావేరి నీటిని త్వరగా అందించాలని కోరగా.. శివకుమార్ స్పందిస్తూ "గతేడాది నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడ్డాం. 7వేల బోర్లు ఎండిపోయాయి. ప్రైవేట్ ట్యాంకర్లనూ వాడాల్సి వచ్చింది. కావేరి ప్రాజెక్ట్‌ 5వ దశ పనులతో 110 గ్రామాలకు నీరందుతుంది,’’ అని సమాధానమిచ్చారు.

అక్రమ కనెక్షన్లపై కొరడా..

‘‘నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ భవంతులు నిర్మితమవుతున్నాయి. BWSSBకి డిపాజిట్ చెల్లించకుండానే అక్రమ కనెక్షన్లు తీసుకున్నారు. అలాంటి వారికి నోటీసులు ఇచ్చాం,’’ అని డీకే చెప్పారు.

నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు..

"కొంతమంది పశువులను శుభ్రం చేసేందుకు మంచినీళ్లను వాడుతున్నారు. అదే నీటితో మొక్కల దాహం తీరుస్తున్నారు. ఖాళీ స్థలాలను కాంక్రీటుతో కప్పేయడం మూలంగా జలశోషణకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమస్యలను జనం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. నీటి సంరక్షణ అవగాహన కల్పించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే మార్చి 22న జల సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నాం,’’ అని మంత్రి చెప్పారు.

BJP ఎమ్మెల్సీ కేశవ ప్రసాద్ అలమట్టి ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం, మహారాష్ట్ర అభ్యంతరాల గురించి ప్రశ్నించగా.. "అన్ని పార్టీల ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలిసి, అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ మూడో దశపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఒత్తిడి చేద్దామని", అని డీకే సమాధానమిచ్చారు.

సమస్యగా మారిన చెత్త నిర్వహణ..

చెత్త నిర్వహణ సమస్యగా మారిందని, మహాదేవపుర నియోజకవర్గంలో చెత్త ట్రక్కులు నిలిచిపోయాయని MLC నాగరాజ్ యాదవ్ అడిగిన ప్రశ్నకు డీకే స్పందిస్తూ .."చెత్త సేకరణ నిర్వహణ మాఫియా చేతుల్లోకి వెళ్లింది. గతంలో టెండర్ పిలిచాం. కానీ వెండర్లు కోర్టుకు వెళ్లి పనులు నిలిపేశారు. ఇప్పటివరకు కోర్టు తీర్పు రాలేదు. ఇందోర్‌లో చెత్త నిర్వహణపై అధ్యయనం చేయనున్నాం,’’ అని చెప్పారు. 

Tags:    

Similar News