మాజీ ‘డిప్యూటీ సీఎం’ పై బీజేపీ బహిష్కరణ వేటు
కర్నాటకలో యడియూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప మధ్య శివమొగ్గ కేంద్రంగా బలప్రదర్శన జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఆదేశాలను ధిక్కరించిన ఈశ్వరప్ప శివమొగ్గ నుంచి నామినేషన్..
By : Praveen Chepyala
Update: 2024-04-23 05:50 GMT
కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీకి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసి, ప్రస్తుతం శివమొగ్గ నుంచి స్వత్రంత్య అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కెఎస్ ఈశ్వరప్పను ఆరు సంవత్సరాల పాటు పార్టీ బహిష్కరించింది. పార్టీని అవమానపరిచినందుకుగాను, అధినాయకత్వం ఆదేశాలు ధిక్కరించి, తిరుగుబాటు చేసినందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కమలదళం ప్రకటించింది. "యడ్యూరప్ప కుటుంబం నియంత్రణ నుంచి రాష్ట్ర బిజెపిని రక్షించడం" తన లక్ష్యం అని కేఎస్ ఈశ్వరప్ప ఇంతకుముందే ప్రకటించారు. దీంతో పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన ఈశ్వరప్ప కరడుగట్టిన హిందుత్వ వాదిగా, కురుబ సంఘం నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. జనసంఘ్ రోజుల నుంచి బిబి శివప్ప, హెచ్‌ఎన్ అనంత్‌కుమార్ వంటి వారితో కలిసి రాష్ట్రంలో బిజెపిని కింది స్థాయి నుంచి నిర్మించడంలో యడ్యూరప్ప తో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో బీజేపీకి నమ్మకమైన కార్యకర్తగా ముద్రపడ్డారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని పేర్కొంటూ రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణా సంఘం చీఫ్ లింగరాజ్ పాటిల్ శుక్రవారం సాయంత్రం బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. “పార్టీ సూచనలు బేఖాతరు చేసి స్వతంత్రంగా పోటీ చేయడం ద్వారా ఈశ్వరప్ప బిజెపికి ఇబ్బంది తెచ్చిపెట్టారు” అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవాలని ఆయనను కోరారు, అయితే ఇంతకుముందు కూడా బీజేపీ పెద్దలు ఆయన చేత నామినేషన్ ఉపసంహరణకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్నటి సాయంత్రంతో ఆ గడువు కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. పార్టీ ఆదేశాల మేరకు బీజేపీలోని అన్ని బాధ్యతల నుంచి ఈశ్వరప్పను తక్షణమే తప్పించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లఘించినవారు ఎంత పెద్ద నాయకుడైన బహిష్కరణ వేటు ఎదుర్కొక తప్పదని బీజేపీ అధినాయకత్వం హెచ్చరించినట్లు అయింది.
BSY vs ఈశ్వరప్ప
ఈశ్వరప్పను బిజెపి నుంచి బహిష్కరించడం రాత్రికి రాత్రే జరగలేదు, కొంతకాలంగా ఆయనకు, యడియూరప్పకు మధ్య రాజకీయ ఆధిపత్యం పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇది పార్టీలో చీలికలను సూచిస్తున్నాయి. రాష్ట్రంలో బిజెపిని విస్తరించడంలో కీలక వ్యక్తిగా గుర్తించబడిన ఈశ్వరప్ప, యడియూరప్ప.. అతని కుమారుడు BY విజయేంద్ర నేతృత్వంలోని వర్గంతో విభేదించారు. పార్టీ ఎదుగుదలకు ఆయన గణనీయమైన కృషి చేసినప్పటికీ, యడియూరప్ప శిబిరం ఆయనను పక్కన పెట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్ కేటాయించలేదు. ఈశ్వరప్ప తన కుమారుడు కంఠేష్‌ను హవేరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావించినా, ఆయనకు కూడా అవకాశం దక్కలేదు.
ఈ పరిణామాలు బీఎస్‌వై తనయుడు, ఎంపీ బీవై రాఘవేంద్ర మళ్లీ పోటీ చేస్తున్న శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఈశ్వరప్ప పోటీ చేయాల్సి వచ్చింది. ఆయనకు ఓబీసీ, హిందూత్వ అనుకూల వర్గాల మీద గట్టిపట్టు ఉంది. ఈ పోటీ విజయేంద్ర ఓటిమికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. అలాగే ఈశ్వరప్ప హిందూ అనుకూల నాయకుడిగా బ్రాండింగ్ ఏర్పడే అవకాశం కనిపించకుండా పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.
మోదీకి విధేయత..
శివమొగ్గ లో ప్రచారం చేస్తున్న ఈశ్వరప్ప తన ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఉపయోగిస్తున్నారు. అయితే పార్టీ అధికారిక అభ్యర్థి బీవై రాఘవేంద్ర, స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరప్ప వీటిని లెక్కచేయట్లేదు. మోదీ ఎవరి సొంత ఆస్తి కాదు. ఆయన ప్రపంచం మెచ్చిన నాయకుడు. నేను ఎప్పుడూ మోదీని గుండెల్లో పెట్టుకుంటాను అని ప్రచారం చేసుకుంటున్నారు.
బల ప్రదర్శన
భారీ జనసమీకరణతో, ఈశ్వరప్ప రెండు వారాల క్రితం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన వేలాది మంది కార్యకర్తలతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. "జై శ్రీరాం", మోదీ అనుకూల నినాదాలు, కాషాయ జెండాలను ప్రదర్శించారు.
తన పోరాటం యడియూరప్ప కుటుంబంపైనే అని ప్రకటించిన ఈశ్వరప్ప మరోసారి నరేంద్ర మోదీని దేశానికి ప్రధానిని చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.