సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం సిద్ధరామయ్య.. ఎందుకంటే..
కర్నాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. తమకు కరువు సాయం మీ వల్లే అందిందని అన్నారు. ఇందులో బీజేపీ పాత్ర ఏమి లేదని వ్యాఖ్యానించారు.
By : Praveen Chepyala
Update: 2024-04-27 12:03 GMT
కర్నాటకకు, కేంద్రప్రభుత్వం కరువు సాయం నిధులు విడుదల చేయడం పై రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రాన్ని హెచ్చరించి తమకు కరువు సాయం అందేలా చేశారని అన్నారు.
“నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) నిబంధనల ప్రకారం రాష్ట్రానికి రూ.18,171 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం రూ.3,498.98 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ నిధులు కరువు సాయానికి సరిపోవు. బకాయిల కోసం మా పోరాటం కొనసాగుతుంది' అని కలబురగిలో విలేకరులతో సీఎం అన్నారు.
నిధులు విడుదల చేయాలని ఒత్తిడి: సీఎం
కర్నాటకపై ప్రేమతో కేంద్ర ప్రభుత్వం కరువు సాయం నిధులను ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో డబ్బు విడుదల చేయవలసి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ముందు తాము బలమైన వాదనలు వినిపించామని చెప్పారు. రాజకీయ కారణాలతో కర్ణాటకకు కేంద్రం అన్యాయం చేస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే విచారణ సందర్భంగా వారంలోగా కరువు సాయం అందజేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
బీజేపీ పాత్ర లేదు: సిద్ధరామయ్య
సుప్రీం కోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం నిధులు విడుదల చేసిందని సీఎం అన్నారు. ఇందులో బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతుల పట్ల సుప్రీంకోర్టులో మేము చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందని సీఎం అన్నారు.
“కరువు ఉపశమనం కలిగించకపోతే, కర్ణాటకలోని కరువు పీడిత ప్రాంతాల ప్రజలు తమను (బిజెపి నాయకులను) ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోకి రానివ్వరనే భయంతో గ్రాంట్ ప్రకటించడానికి కారణం. రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు ఈ చిన్న ఉపశమనాన్ని తమ ఘనతగా చిత్రీకరిస్తున్నారు, వారికి తగిన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను అభ్యర్థిస్తున్నాను” అని ముఖ్యమంత్రి అన్నారు.
మిగిలిన నిధులు విడుదల చేయండి..
“ఈ కరువు సాయం వెనుక కారణాలు ఏమైనప్పటికీ, నిధులు అందించిన కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. బ్యాలెన్స్ రిలీఫ్ ఫండ్‌లను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నాను ' అని ఆయన తెలిపారు. అలాగే పన్నుల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని అభ్యర్థించారు .
ఈ నిధుల విడుదలపై దేవాదాయ శాఖ మంత్రి ట్వీట్ చేశారు. ఇది రాష్ట్ర రైతుల విజయమని కృష్ణ బైరేగౌడ కొనియాడారు. కేంద్రంపై చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఇదో మైలురాయని అన్నారు.
₹ 18171.44 CR was the relief sought as per SDRF rules for Karnataka drought relief.
— Krishna Byre Gowda (@krishnabgowda) April 27, 2024
Central Government has only sanctioned ₹ 3498 CR.
That is less than 20% of the relief funds we had asked for.
One of the worst droughts, 223 out of 240 Talukas under drought, and Karnataka… pic.twitter.com/DfQkLpjIdP
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13, 2023న 223 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిందని..ఇప్పటికి ఏడు నెలలు అయిందని సిద్ధరామయ్య తెలిపారు. 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దీని వల్ల రూ.35,162 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటక రూ. 18,171 కోట్లు పరిహారంగా కోరింది. ఇది కర్నాటకలో జరిగిన నష్టంలో సగానికంటే ఎక్కువ. అయితే కేంద్ర ప్రభుత్వం నేడు రూ.3,454 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన సాయ సొమ్ము కోసం కర్ణాటక పోరాటం కొనసాగుతుందని సిద్ధరామయ్య తెలిపారు.