కన్నడ సర్కార్ నిర్ణయాలపై పర్యావరణవేత్తల అనుమానాలు..

పశ్చిమ కనుమల్లో మైనింగ్ కార్యకలాపాల కోసం దరఖాస్తు చేసుకున్న 30 కంపెనీలలో 28 దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ..

By :  435
Update: 2024-10-15 10:05 GMT

పశ్చిమ కనుమల్లోని గడగ్ జిల్లాలోని కప్పతగుడ్డ వన్య ప్రాణుల అభయారణ్యంలో 10 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి మంజూరు చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల వాయిదా వేయడంతో పర్యావరణ శాస్త్రవేత్తలు, పరిరక్షకులు ‘కాస్త’ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం ప్రత్యేకమైన వృక్షజాలం, జంతుజాలానికి ఆవాసం.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (SBWL) సెంట్రల్, రక్షిత అటవీ ప్రాంతాల చుట్టూ దాదాపు 30 మైనింగ్ ప్రతిపాదనలు ఉన్నాయని, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అందులో కప్పతగుడ్డ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉందని తెలిపింది. ఈ చర్య కాంగ్రెస్ ప్రభుత్వ పరిరక్షణ వైఖరికి, అటవీ విస్తీర్ణాన్ని రక్షించడానికి, విస్తరించడానికి అనే లక్ష్యానికి విరుద్ధంగా ఉంది.
కప్పతగూడలో 30 మైనింగ్ ప్రతిపాదనల్లో 28..
ప్రతిపాదిత 30 ప్రతిపాదనల్లో 28 ప్రాంతాలు కప్పతగూడ వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. SBWL కప్పతగూడతో సహా రక్షిత అటవీ ప్రాంతాల చుట్టూ మైనింగ్ లైసెన్సుల కోసం అనుమతి మంజూరు చేయడాన్ని వాయిదా వేసినప్పటికీ, పర్యావరణవేత్తలు మాత్రం ఇంకా జాగ్రత్తగానే ఉన్నారు. ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా విరమించుకుంటారనే నమ్మకం లేదు. పర్యావరణవేత్త, రచయిత నగేష్ హెగ్డే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని 'పర్యావరణ వ్యతిరేక'చర్యలుగా అభివర్ణించారు.
పశ్చిమ కనుమల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత జోన్ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఆరుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, దానిని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని హెగ్థే వివరించారు.
అలాగే, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం జూలై 31న MoEF&CC జారీ చేసిన పశ్చిమ కనుమలపై డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ నివేదికకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై తన వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇవన్నీ కప్పతగూడ వన్యప్రాణుల అభయారణ్యం భవిష్యత్తు గురించి పర్యావరణవేత్తలను భయాందోళనకు గురిచేశాయి.


 


పరిరక్షణ రిజర్వ్
2015లో కాంగ్రెస్ నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం పచ్చదనంతో నిండిన కప్పతగుడ్డ కొండలను ఐరన్, గోల్డ్ ఓర్ నిక్షేపాలు కలిగిన ప్రాంతంగా ప్రకటించింది. ఈ ప్రాంతం అంతా 89. 92 హెక్టార్లుగా ఉందని తెలిపింది. ఇక్కడ అరుదైన మొక్కలు ఉన్నాయని, దీనిని రక్షిస్తామని తెలిపింది.
ఏది ఏమైనప్పటికీ, ప్రభుత్వం దిగ్భ్రాంతికరమైన తిరోగమనం ప్రదర్శించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక వన్యప్రాణి బోర్డు నవంబర్ 2017లో ఈ పరిరక్షణ ట్యాగ్‌ను ఉపసంహరించుకుంది. ఈ చర్య పర్యావరణవేత్తలు, గదగ్ ప్రాంతంలోని వివిధ మతపరమైన మఠాల నాయకులను ఆగ్రహం తెప్పించింది. మైనింగ్ లాబీ ఒత్తిడి వల్లే ఈ చర్య తీసుకున్నారని వారంతా విమర్శించారు.
32.346 హెక్టార్లలో విస్తరించి, అరుదైన వృక్ష, జంతుజాలం, ఔషధ వృక్షాల నిధిగా వెలుగొందుతున్న కప్పతగుడ్డ అటవీ శ్రేణిలోని వృక్ష, జంతుజాలాన్ని కాపాడాలని నందివేరి సంస్థాన మఠాధిపతి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
తగ్గుతున్న అటవీ విస్తీర్ణం
ఇటీవలి సంవత్సరాలలో, రాష్ట్ర ప్రభుత్వాలు మైనింగ్ లాబీకి లొంగిపోతున్నందున ఈ ప్రాంతంలోని స్థానిక మూగజీవాల జీవనంపై పర్యావరణవేత్తలు భయాందోళనకు గురవుతున్నారు. మైనింగ్ లాబీ ప్రభుత్వాన్ని కోరడమే ఆలస్యం, ప్రభుత్వాలు వాటిని ఆమోదిస్తాయని కొంతమంది సీనియన్ అధికారులు చెబుతున్నమాట. దీనికి ఉదాహరణగా, ప్రభుత్వం గత రెండు దశాబ్దాల్లో మైనింగ్‌తో సహా 20,805 హెక్టార్ల అటవీ భూమిని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించడాన్ని వారు ఉదహరించారు.
2001 నుంచి 2023 వరకు, కర్నాటక 54.1 లక్షల హెక్టార్ల వృక్షాల విస్తీర్ణాన్ని కోల్పోయింది, ఇది 2000 నుంచి 2.4 శాతం అటవీ విస్తీర్ణం తగ్గుదలకు సమానం. గత సెప్టెంబరులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మైనింగ్‌కు 4,228.21 ఎకరాల అటవీ భూమిని మళ్లించడాన్ని కోర్టు ప్రశ్నించింది.
కప్పతగుడ్డ పవిత్రత
స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు దానితో మానసికంగా, శాస్త్రీయంగా కనెక్ట్ కావడం వల్ల కప్పతగుడ్డ ప్రత్యేకించి విలువైనది.కప్పతగుడ్డ గడగ్, ముందర్గి, శిరహట్టి తాలూకాలలో విస్తరించి ఉంది. కొండ గడగ్, బింకడకట్టి గ్రామం నుంచి మొదలై ముందరగిలోని సిగతలూరు గ్రామం వరకు విస్తరించి ఉంది. అటవీ శాఖ మాజీ డిప్యూటీ కన్జర్వేటర్ యశ్పాల్ క్షీరాసాగర్ ప్రకారం, "కొండపై దాదాపు 500 ముఖ్యమైన ఔషధ మూలికలు ఉన్నాయి "
గడగ్, శిరహట్టి, ముందర్గి ప్రజలకు కప్పతగుడ్ ప్రాణధార మూలం అని పర్యావరణవేత్త చంద్రకాంత్ చవాన్ అభిప్రాయపడ్డారు. దేవాలయాలు, మతపరమైన మఠాలకు నిలయం, గడగ్ దాని చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు ప్రకృతి ఒడిలో జీవిస్తూ లోతైన బంధాన్ని ఏర్పరచుకున్నారు.
గోల్డ్ మైనింగ్
కొండల్లో ఇనుప, బంగారు ఖనిజ నిక్షేపాలు కూడా అధికంగా ఉన్నందున ప్రభుత్వం మైనింగ్ లాబీ ఒత్తిడికి తలొగ్గి వ్యవహరిస్తోందని అన్నదానేశ్వర మహాశివయోగి మఠం పీఠాధిపతి అభినవ అన్నదానేశ్వర స్వామి ఆరోపించారు. నిజానికి ఈ కొండల్లోని విలువైన లోహం కోసం బంగారం తవ్వేవారు కొన్నేళ్లుగా అన్వేషిస్తున్నారు. గడగ్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బంగారు ఖనిజాన్ని కనుగొనడం ఇటీవలి మంచి విషయం కాదు.


 


20వ శతాబ్దపు ప్రారంభంలో ధార్వాడ్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, M/S జాన్ టేలర్ అండ్ సన్స్ ఆఫ్ లండన్ ఎనిమిదేళ్లపాటు పాత వాటిని తవ్వే అవకాశాల కోసం రంగంలో దిగాయి. అయితే, రీఫ్‌ల నుంచి బంగారం రికవరీ తక్కువగా ఉండటం వల్ల మైనింగ్ కంపెనీలు తమ కార్యకలాపాలను మూసివేయవలసి వచ్చింది.
అభినవ అన్నదానేశ్వర స్వామి ప్రకారం, బల్డోటా గ్రూప్ కంపెనీ - రామ్‌గఢ్ మినరల్స్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (RMML) - గడగ్ జిల్లాలో రోజుకు 1,000-టన్నుల బంగారు ధాతువు ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. RMML 2017లో కప్పతగూడలోని జెల్లిగెరె వద్ద సాంగ్లీ గోల్డ్ మైన్స్ ఏర్పాటు కోసం 39.9 హెక్టార్ల (సుమారు 98.6 ఎకరాలు) అటవీ భూమి కోసం దరఖాస్తు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 17,872 హెక్టార్ల ప్రాంతాన్ని పరిరక్షణ రిజర్వ్‌గా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని RMML కర్ణాటక హైకోర్టులో సవాలు చేసింది. 800 హెక్టార్లు-తమ మైనింగ్ ప్రాంతాన్ని మినహాయించాలని కోరింది.
అయితే ఆర్‌ఎంఎంఎల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా, పర్యావరణవేత్త నగేష్ హెగ్డే దృష్టిలో, "బంగారం మార్కెట్ ధర కంటే ఖనిజం వెలికితీత, ప్రాసెసింగ్ ఖర్చులు ఎక్కువ. ఏ గోల్డ్ మైనింగ్ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా లాభసాటి కాదు".
మరో బళ్లారి లేదా సండూరు?
బళ్లారి లేదా సండూర్‌ మార్గంలోనే కప్పతగుడ్డ కూడా వెళ్లే ప్రమాదం ఉందని గడగ్‌తో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లోని పర్యావరణవేత్తలు, సందర్శకులు ఆందోళన చెందుతున్నారు. కప్పతగూడ పరిసర ప్రాంతాల్లో మైనింగ్‌కు అనుమతులివ్వాలనే ఆలోచనను ప్రభుత్వం పూర్తిగా విరమించుకోవాలని వారు కోరుతున్నారు.
మైనింగ్ ప్రతిపాదనలపై స్టేట్ బోర్డ్ ఆఫ్ వన్యప్రాణి సమావేశం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గడగ్ తొంటదార్య మఠం పీఠాధిపతి సిద్ధరామ స్వామి, నందివేరి మఠం శివకుమార్ స్వామి ది ఫెడరల్ తో మాట్లాడుతూ కప్పతగూడ పరిసర ప్రాంతాల్లో గనుల తవ్వకాలను గడగ్ ప్రజలు అనుమతించరని, దానిని తాము అడ్డుకుంటామని అన్నారు.
‘‘కప్పతగూడ పరిసర ప్రాంతాల్లో మైనింగ్‌కు అనుమతి ఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే, ప్రభుత్వం ముందుకు వెళ్లి మైనింగ్ లైసెన్స్ మంజూరు చేస్తే, నిర్మలమైన, కన్నయ్య కప్పతగుడ్డకు ఇది శవపేటికకు మొదటి మేకు అవుతుంది, ”అని తొంటదార్య మఠ పీఠాధిపతి సిద్దరామ అన్నారు.
మైనింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వం 2019లో కప్పతగుడ్డ కొండ శ్రేణికి వన్యప్రాణుల అభయారణ్యం ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతంలో భారీ నిరసనలు చెలరేగాయి. విద్యార్థులు, పర్యావరణవేత్తలు, వివిధ మూగజీవాల ప్రేమికులు ఊరేగింపు చేపట్టారు. ప్రదర్శనలు నిర్వహించారు.
కప్పతగుడ్డను కాపాడాలంటూ నందవేరి మఠం ప్రజలు, భక్తులు ఇప్పటికే ఉద్యమం చేపట్టారు. కప్పతగుడ్డ ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని గత కొన్నేళ్లుగా శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2022లో, "కప్పతగుడ్డ అటవీ ప్రాంతంపై దృష్టి సారించిన మైనింగ్ బ్యారన్లకు నో చెప్పండి" అని హోరట్టి బిజెపి ప్రభుత్వానికి లేఖ రాశారు.
కప్పతగూడ చుట్టుపక్కల ప్రాంతాలలో మైనింగ్‌ను అనుమతించడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నించినా పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ (NCPNR) న్యాయవ్యవస్థ సహాయంతో RMML మునుపటి ప్రయత్నాలను ఆపగలిగింది. కప్పతగూడ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ లైసెన్సులు ప్రభుత్వం మంజూరు చేయొద్దని నిరసనలు చేయడంతో పాటు, కోర్టులను ఆశ్రయిస్తామని జనసంగ్రామ పరిషత్‌కు చెందిన రాఘవేంద్ర కుష్టగి, సమాజ పరివర్తన సముదాయానికి చెందిన దీపక్ సీఎస్, ఎన్‌సీపీఎన్‌ఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌ఆర్ హిర్మత్ తెలిపారు.



Tags:    

Similar News