నేను తొందరేం లేదు, నా గమ్యం ఏమిటో నాకు తెలుసు: డీకే శివకుమార్
సంచాలనాల కోసం వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని మీడియాను తీవ్రంగా మందలించిన కర్ణాటక డిప్యూటీ సీఎం..
కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) మీడియాపై ఒక్కసారిగా ఫైరయ్యారు. తప్పుడు రాతలు రాసేవారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘సంచలనాల కోసం తప్పుడు వార్తలు రాస్తే మీపై పరువునష్టం దావా వేయాల్సి ఉంటుంది. అంతేకాదు. నేను మీకు ఇకపై సహకరించను. మీకు ఫోన్ చేయను. ప్రెస్‌మీట్లు పెట్టను. మిమ్మల్ని పిలవకుండా రాజకీయాలు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం శనివారం బెంగళూరు (Bangalore) లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్(Botanical Garden)ను సందర్శించారు. అక్కడ వాహ్యానికి వచ్చిన నగరవాసులతో కాసేపు మాట్లాడారు. తాను ఇక్కడ రాజకీయాలు గురించి మాట్లాడటానికి రాలేదంటూనే..
‘సంచలనాల కోసం కల్పితాలు రాయొద్దు’
"కొంతమంది నేను ముఖ్యమంత్రి కావాలని తమ కోరికను వ్యక్తపరిచారు. అయితే ముఖ్యమంత్రి అయ్యే సమయం ఆసన్నమైందని నేను చెప్పినట్లుగా కొందరు రాశారు. నేను ఎక్కడైనా అలా చెప్పానా? దాని గురించిన ప్రస్తావన వచ్చినపుడు నేను మౌనంగా ఉంటున్నా. ఆ విషయంలో నాకు తొందరేం లేదు. సంచలనాల కోసం లేనిపోనివి రాయొద్దు. నా గమ్యం ఏమిటో నాకు తెలుసు.’’ అని తీవ్రంగా మందలించారు.
‘‘ఆ దేవుడు నాకు ఏ అవకాశం ఇచ్చాడో నాకు తెలుసు. ఏ అవకాశం ఇస్తాడో కూడా తెలుసు. నా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలనుకుంటున్నా. అందుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నాను," అని పేర్కొన్నారు డీకే.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నవంబర్ నాటికి రెండున్నరేళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సిద్ధరామయ్య-డీకేఎస్ మధ్య మళ్లీ పోటీ?
మే 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ పోటీపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం డీకేను పిలిపించి మాట్లాడింది. డిప్యూటీ సీఎంగా ఉండమని కోరింది. అందుకు ఆయన అంగీకరించారు. అయితే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తొలుత సిద్ధరామయ్య, ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు సీఎం డీకే ఉండేలా వారిదర్ది మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని గతంలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) పదవి కాలం రెండున్నరేళ్లు పూర్తికానుండడంతో మీడియాలో భిన్న కథనాలు వస్తున్నాయి.