ఊటీ, కొడైకెనాల్ సందర్శకులకు కోర్టు షరతులు..
ప్రైవేటు వాహనాల సంఖ్యను పరిమితం చేస్తూ ఉత్తర్వులు..;
తమిళనాడు(Tamil Nadu)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలయిన ఊటీ( Ooty), కొడైకెనాల్(Kodaikanal)కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. పర్యావరణం, రోడ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల మద్రాసు హైకోర్టు(Madras High Court)కు నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన జస్టిస్ ఎన్. సతీష్ కుమార్, జస్టిస్ డి. భారత చక్రవర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం వాహనాల సంఖ్యను పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్ 1 నుండి జూన్ వరకు కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
ప్రభుత్వ నివేదికలో ఏముంది?
‘‘హిల్ స్టేషన్లకు వచ్చే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వేసవిలో రోజుకు సుమారు 20 వేల వాహనాలు వస్తాయి.అపరిమిత వాహనాల రాకపోకలతో ఘాట్ రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. వాటి సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ఐఐటీ-మద్రాస్, ఐఐఎమ్-బెంగళూరు సాయం తీసుకుంటున్నాం’’ అని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
వీకెండ్‌లో కాస్త ఎక్కువ..
ఊటీలోకి రోజుకు 6వేల వాహనాలు, వీకెండ్ (శనివారం, ఆదివారం) రోజుల్లో 8వేల వాహనాలు, అలాగే కొడైకెనాలో రోజుకు 4వేలవాహనాలు, వీకెండ్ రోజుల్లో 6వేల వాహనాలను మించి అనుమతించవద్దని సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ బస్సుల్లో వచ్చే పర్యాటకులకు, స్థానికులకు సరుకులు రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.
గతేడాది ఏప్రిల్‌లో ఈ కొండ ప్రాంతాల్లో ప్రవేశానికి ఉచిత ఈ-పాస్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
వసతి గురించి..
ప్రభుత్వ నివేదిక ప్రకారం.. నీలగిరి ప్రాంతంలో సుమారు 20,000 మంది పర్యాటకులు విడిది చేసే అవకాశం ఉంది. అక్కడ ప్రైవేట్ హోటళ్లతో పాటు, ప్రభుత్వం నిర్వహించే టిటిడిసి (TTDC), పిడబ్ల్యుడీ (PWD), అటవీ, తోటల శాఖ గెస్ట్ హౌసులు, హోమ్‌స్టేలు ఉన్నాయి.