త్రివర్ణ పతాక ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తమిళనాడులో త్రివర్ణ పతాక ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని కండీషన్లతో బైక్ ర్యాలీకి అనుమతినిచ్చింది.

Update: 2024-08-14 11:22 GMT

తమిళనాడులో త్రివర్ణ పతాక ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని కండీషన్లతో బైక్ ర్యాలీకి అనుమతినిచ్చింది. స్వాతంత్ర దినోత్సవ రోజున జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించాలని తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావించింది. ఆ మేరకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరింది. అందుకు పర్మిషన్ లభించలేదు. పోలీసులు చెప్పిన సమయానికే ర్యాలీ నిర్వహిస్తామని చెప్పినా.. అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు ఖరాఖండిగా చెప్పారు. దీంతో బిజెపి యువమోర్చా కోయంబత్తూరు జిల్లా కార్యదర్శి ఎ కృష్ణ ప్రసాత్‌ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను జస్టిస్‌ జి జయచంద్రన్‌ పరిశీలించి తీర్పునిచ్చారు. కొన్ని షరతులకు లోబడి ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు.

ఆగస్టు 15న పశ్చిమ తమిళనాడు నగరంలో నాలుగు చోట్ల మాత్రమే సుమారు 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ర్యాలీలో పాల్గొనేవారు జాతీయ జెండాను గౌరవించాలని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ర్యాలీ కొనసాగించాలని సూచించింది. ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్య, రూట్ వివరాలను ముందుగా పోలీసులకు తెలపాలని ఆదేశించింది. ఈ అనుమతి స్వాతంత్ర్య దినోత్సవానికి మాత్రమే వర్తిస్తుందని, మరే ఇతర రోజుకు వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారిని స్మరించుకునేందుకే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కృష్ణప్రసాద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం ప్రాముఖ్యత, దానిని సాధించడంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుల పాత్ర గురించి యువ తరానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ర్యాలీ నిర్వహించాలనుకున్నామని చెప్పారు.

Tags:    

Similar News