హీరో విజయ్ పర్యటన వారం పాటు వాయిదా
కరూర్ తొక్కిసలాట తరువాత ప్రతిపక్షాలు, ప్రభుత్వాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్
By : Praveen Chepyala
Update: 2025-10-01 10:48 GMT
తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండు వారాల పాటు జరిగాల్సిన సమావేశాలను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
‘‘మా ప్రియమైన వారిని కోల్పోయినందుకు మేము తీవ్ర దు:ఖంలో ఉన్నాము. ఈ పరిస్థితిలో రాబోయే రెండు వారాల పాటు మా పార్టీ నాయకుడు బహిరంగ సమావేశాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము’’ అని పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
‘‘మా పార్టీ నాయకుడి ఆమోదంతో బహిరంగ సమావేశాలకు సంబంధించిన కొత్త వివరాలను తరువాత ప్రకటిస్తామని మీకు తెలియజేస్తున్నాము’’ అని ట్వీట్ లో టీవీకే పేర్కొంది.
విజయ్ వీడియో..
కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా, పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీనిపై ఆయన వీడియో ప్రసంగం చేయగా, టీవీకే పార్టీ ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘‘నిజం త్వరలోనే బయటపడుతుంది’’ అని ఆయన రాష్ట్రంలోని స్టాలిన్ ప్రభుత్వాన్ని నేరుగా సవాల్ చేశారు. కుట్ర వల్లే కరూర్ లో తొక్కిసలాట జరిగిందని విజయ్ ఆరోపించారు.
కరూర్ లో జరిగిన టీవీకే ర్యాలీ విషాదకరంగా ముగిసిన రెండు రోజుల తరువాత ఈ ప్రసంగం జరిగింది. తొక్కిసలాటలో డజన్ల కొద్ది ప్రజలు అక్కడికక్కడే మరణించారు. అనేకమంది గాయపడగా, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ర్యాలీలు జరిగిన ప్రతిసారి ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని, పోలీసులను సంప్రదించి అనుమతి తీసుకున్నాకే రోడ్ షో స్థలాలను ఎంపిక చేసుకున్నామని విజయ్ అన్నారు. కరూర్ తొక్కిసలాటకు కారణమైన పూర్తి వాస్తవాలు బయటకు రావాలని ఆయన కోరారు. నిజం త్వరలోనే బయటపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం..
సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన తొక్కిసలాటను తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన తీరును టీవీకే విమర్శించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ లోని సచివాలయం లో వివరణాత్మక విలేకరుల సమావేశం నిర్వహించారు.
కరూర్ టీవీకే టూర్ సంబంధిత ప్రమాదాలు, జనసమూహ పెరుగుదల జిల్లాల వారీగా గణాంకాలను అధికారులు వెల్లడించారు. సంభాషణ సందర్భంగా పలు వీడియోలు ఉపయోగించి పోలీసుల మోహరింపు, విద్యుత్ సరఫరా, అంబులెన్స్ ప్రతిస్పందన వంటి కీలక అంశాలపై అధికారులు వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు.