స్టాలిన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన మాజీ సీఎం పళని స్వామి
వచ్చే ఏడు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని ఆశాభావం;
Translated by : Praveen Chepyala
Update: 2025-04-29 13:34 GMT
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మరోసారి అధికారంలోకి వస్తానని స్టాలిన్ 2.0 లోడింగ్ వ్యాఖ్యలపై ఈపీఎస్ సైటైర్లు వేశారు. రాష్ట్రంలోని మహిళల భద్రత సహ అనేక అంశాలపై ఆయన డీఎంకే ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో డీఎంకేకు తమ సత్తా చూపిస్తామని అన్నారు.
గత సంవత్సరం కల్లకురిచ్చిలో జరిగిన హూచ్ విషాదం, అన్నా విశ్వవిద్యాలయం విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ఎస్సీ కుటుంబాలకు ఉపయోగించే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులో మానవ మలాన్ని కలిపిన వెంగైవాయల్ సంఘటనలను ప్రస్తావిస్తూ డీఎంకేను పళనిస్వామి తూర్పారబట్టారు. రాష్ట్రంలో యథేచ్ఛగా మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయని ఇదంతా డీఎంకే అసమర్థత వల్లే జరిగిందని మండిపడ్డారు.
2023 లో ఉద్యోగాలకు నగదు కుంభకోణంలో మాజీ మంత్రి వీ. సెంథిల్ బాలాజీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై కూడా ఆయన డీఎంకే పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు ‘‘బై బై స్టాలిన్’’ అని చెబుతారని పళని స్వామి ఎక్స్ లో ఒక పోస్ట్ లో అన్నారు. ‘‘2026 లో ఒకే ఒక వెర్షన్ ఉంది. అది #TN -AIADMK వెర్షన్’’ అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
అంతకుముందు స్టాలిన్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తన పార్టీ డీఎంకే అధికారాన్ని నిలుపుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ 2026 అంటే వెర్షన్ 2.0 లోడింగ్ అని ఆయన అన్నారు.
డీఎంకే పాలన వచ్చే నెలలో ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోందని, వివిధ పథకాలు, విజయాలకు ధన్యవాదాలు, తదుపరి ప్రభుత్వానికి కూడా ద్రవిడ పార్టీ నాయకత్వం వహిస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారని రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రసంగంలో స్టాలిన్ అన్నారు.
‘‘ఇప్పటి వరకూ చూసిందేమిటంటే ద్రవిడ మోడల్ గవర్నమెంట్ పార్ట్ 1. వెర్షన్ 2.0, 2026 లో లోడ్ అవుతోంది. ఆ తరువాత మేము మరిన్ని రికార్డులు సృష్టిస్తాము’’ అని ఆయన అన్నారు.
పళని స్వామి విమర్శలపై డీఎంకే కౌంటర్..
పళని స్వామి విమర్శలపై డీఎంకే ఎదురుదాడికి దిగింది. స్టెర్లైట్ వ్యతిరేక నిరసనకారులపై ట్యూటీకోరన్ పోలీసుల కాల్పులు, పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసులను ప్రస్తావించి విమర్శించారు. ఇవి అన్నాడీఎంకే హాయాంలో జరగాయని ద్రవిడవాద పార్టీ ఆరోపించింది.
2016-21 మధ్య ముఖ్యమంత్రి గా ఉన్న పళని స్వామి అవినీతి ప్రభుత్వాన్ని నడిపించారని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతీ ఆరోపించారు. బీజేపీ కూటమి చేరడంతోనే అన్నాడీఎంకే వెర్షన్ ముగిసిందని అన్నారు.
ఎన్నికలకు ముందే ప్రజలు తమకు ఘోరమైన ఓటమిని అప్పగిస్తారని పళని స్వామి బయపడుతున్నారని,అందుకే పగటిపూట నాటకాలు ప్రదర్శిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకేకు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా గెలవరని జోస్యం చెప్పారు.