EDకి రూ. 30 వేల ఫైన్ విధించిన మద్రాస్ హైకోర్టు..
ఇల్లు, కార్యాలయాన్ని సీజ్ చేయడంపై కోర్టుకు ఆశ్రయించిన సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, వ్యాపారవేత్త విక్రం రవీంద్రన్ ..;
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TASMAC)లో రూ. వెయ్యి కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీతో ప్రయివేట్ డిస్టిలరీలు, అనుమానిత వ్యక్తులను లోతుగా విచారిస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తనిఖీ కోసం ఈడీ అధికారులు సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, వ్యాపారవేత్త విక్రం రవీంద్రన్ ఇల్లు, కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో తాళాలు వేసి ఉండడంతో వాటికి సీజ్ చేశారు. టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్‌లో తమ నంబర్ సేవ్ అయి ఉందన్న ఒకే ఒక్క కారణంతో తమ ఇల్లు, ఆఫీసును ఎలా సీజ్ చేస్తారని పిటీషనర్లు భాస్కరన్, రవీంద్రన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారించిన జస్టిస్ ఎం.ఎస్. రమేష్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం EDని ప్రశ్నించింది. సీజ్ చేయడానికి తగిన ఆధారాలు చూపాలని ఆదేశించింది. గడువులోగా ఆధారాలు చూపకపోగా మరికొంత సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు కోర్టు అనుమతించింది. ఆ గడువులోగా కూడా ఎలాంటి ఆధారాలు చూపకపోకడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఈడీకి రూ. 30 వేలు జరిమానా విధించారు.