‘కులగణనలో వ్యక్తిగత ప్రశ్నలొద్దు’
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కర్ణాటక(Karnataka)లో ప్రభుత్వం కులగణన(caste census) జరుగుతోంది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహిస్తున్న ఈ సర్వే సెప్టెంబర్ 22న మొదలైంది. అక్టోబర్ 7 వరకు కొనసాగనుంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఎన్యుమరేటర్లకు ఒక సూచన చేశారు. వ్యక్తిగత వివరాలు అడగొద్దని వారిని కోరారు. కొన్ని కుటుంబాలు సర్వేకు దూరంగా ఉంటుండడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘అనవసరమైన ప్రశ్నలు అడగొద్దు’
కొనసాగుతోన్న సర్వేపై ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ.. "మీకు ఎన్ని కోళ్లు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఎంత బంగారం ఉంది. ఎన్ని ఫ్రిజ్‌లు ఉన్నాయి. ఇలాంటి వివరాలు అడగొద్దని నేను మా అధికారులకు చెప్పాను. అవన్నీ వ్యక్తిగత విషయాలు. కానీ అది స్వతంత్ర కమిషన్ కాబట్టి వారు ఏమి చేస్తారో నాకు తెలియదు" అని అన్నారు.
సర్వేను పొడిగిస్తారా? అన్న ప్రశ్నకు కమిషన్, సంబంధిత శాఖ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సర్వేలో అందరూ పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేశారు.
రూ. 420 కోట్లతో సర్వే..
ఇటీవల ఐదు కార్పొరేషన్లతో ఏర్పాటైన గ్రేటర్ బెంగళూరులో కులగణన జరుగుతోంది. రూ.420 కోట్ల అంచనా వ్యయంతో సర్వే చేయిస్తున్నారు. 60 ప్రశ్నలకు వివరాలు సేకరిస్తున్నారు. 2015లో సర్వే కోసం ప్రభుత్వం రూ.165.51 కోట్లు ఖర్చు చేసింది. దానిపై ప్రభావవంతమయిన వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో కొత్తగా మరోసారి సర్వే చేయిస్తున్నారు.