భాషా వివాదం: కేంద్రంపై కనిమొళి విమర్శలు

కేంద్ర విద్యాలయాలలో జర్మన్ సహా ఇతర విదేశీ భాషలను తొలగించి హిందీ, సంస్కృతాన్ని మాత్రమే పెట్టడంపై ఆగ్రహం;

Update: 2025-03-04 13:04 GMT

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై మంగళవారం రాష్ట్రంలోని అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకేకు పిల్లల భవిష్యత్తుకంటే రాజకీయమే ముఖ్యమని ఆయన ఆరోపించారు. జాతీయ విద్యా విధానం (NEP) విషయంలో మాటల యుద్ధం మరింత ముదిరిన నేపథ్యంలో.. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి అన్నామలై(Annamalai)కి సవాలు విసిరారు. నిజంగా మీకు విద్యపై శ్రద్ధ ఉంటే విద్యా నిధులను విడుదల చేయించాలని కోరారు.

“బీజేపీ హిందీ ఎజెండాను తమిళనాడు ఎప్పటికీ అంగీకరించదు” అని కనిమొళి (Kanimozhi)‘ఎక్స్’లో పోస్టు చేస్తూ.. సంఖ్యాలను తారుమారు చేయడం, గణాంకాలను తమ అనుకూలంగా మార్చడం బీజేపీకి అలవాటని, అందుకే DMK ప్రభుత్వం విద్యా విధానాల ప్రభావాన్ని అంచనా వేయడానికి స్వతంత్రంగా సర్వే నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ASER నివేదికను పూర్తిగా వక్రీకరించారని ఆమె ఆరోపించారు.

2025 ఆర్థిక సర్వేలో కూడా ‘ఇల్లం తీడి కల్వి, ‘ఎన్నం ఎజుత్తుం’ విద్యార్థుల కోసం ఉచిత అల్పాహార పథకం లాంటి పథకాలతో తమిళనాడు విద్యను విప్లవాత్మకంగా మార్చిందని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అక్షరాస్యత కోసం బాధపడుతున్నా.. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి పెడుతోందని వ్యాఖ్యానించారు.

"మీకు విద్యార్థుల గురించి నిజంగా శ్రద్ధ ఉంటే తమిళనాడుకు రావాల్సిన రూ.2,152 కోట్లు (సమగ్ర శిక్ష అభియాన్ నిధులు) ఎందుకు నిలిపివేశారు? మాకు పాఠాలు చెప్పడం మాని, బీజేపీతో చెప్పి వాటిని విడుదల చేయించండి ’’ అని కనిమొళి మండిపడ్డారు.

కేంద్ర విద్యాలయాలలో జర్మన్ సహా ఇతర భాషలను తొలగించి, హిందీ, సంస్కృతాన్ని ప్రాధాన్యతనిస్తుండటాన్ని తీవ్రంగా విమర్శించారు. “మీరు మూడుభాషల విధానానికి మద్దతు ఇస్తున్నారని చెబుతారు – అయితే, ఎన్ని కేంద్ర విద్యాలయాలు తమిళాన్ని బోధిస్తున్నాయో డేటా ఇవ్వగలరా? తమిళనాడులోని చాలా కేంద్ర విద్యాలయాల్లో తమిళ ఉపాధ్యాయులే లేరని మీకు తెలుసా?” అని ఆమె ప్రశ్నించారు.

అన్నామలై ప్రతిస్పందన

అన్నామలై తన ‘ఎక్స్’ పోస్ట్‌లో కనిమొళికి రిప్లై ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం విద్యారంగ నాణ్యతను అర్థం చేసుకోవడానికి సర్వే నిర్వహించినా..అందులో దిగజారిన విద్యా ప్రమాణాలు స్పష్టంగా బయటపడతాయన్నారు. "డీఎంకేకు పిల్లల భవిష్యత్తుపై కన్నా రాజకీయమే ముఖ్యమైనది. డీఎంకే ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాస్తూ.. PM శ్రీ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై బీజేపీ తమిళనాడు విభాగం ఒత్తిడి తెచ్చిందా?" అని అన్నామలై ప్రశ్నించారు.

"PM శ్రీ పథకం సమగ్ర శిక్షలోని అనేక అంశాలను చేర్చారు. మీరు, తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి మీడియా ముందు ముక్కు మూసుకుని ఉన్నా.. మీ సోదరుడు (స్టాలిన్) మేనల్లుడు (ఉదయనిధి) దీనిపై సమాధానం ఎందుకు చెప్పడం లేదు? కనీసం మీరయినా సమాధానం చెబుతారా?" అని అన్నామలై నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మూడో భాష నేర్చుకునే అవకాశాన్ని ఎందుకు నిరాకరించారని, అయితే CBSE, మెట్రిక్యులేషన్, డీఎంకే కుటుంబం నిర్వహించే ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం హిందీ భాష అందుబాటులో ఉందని అన్నామలై అన్నారు. 

Tags:    

Similar News