‘దేవనహళ్లి భూములను స్వాధీనం చేసుకోం’

ఇష్టపూర్వకంగా అమ్మితే కొంటామన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య - 1,200 రోజుల పోరాటం విజయవంతమైందన్న రైతులు..;

Update: 2025-07-15 14:15 GMT

కర్ణాటక(Karnataka)లో సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కు తగ్గింది. రెండో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూ స్వాధీన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోమని, వారే స్వచ్ఛందంగా అమ్మితే కొంటామని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన బెంగళూరులో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, రైతుల ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"ఇష్టపూర్వకంగా అమ్మితేనే కొంటాం"

ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ.. “ప్రభుత్వం ఓ ఒక్క రైతు భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోదు. స్వచ్ఛందంగా అమ్మితే కొంటాం. పౌరుల ఆదాయం పెరగాలంటే అభివృద్ధి అవసరం. దేవనహళ్లి అటు బెంగళూరుకు, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం వల్ల పారిశ్రామికాభివృద్ధికి అనువైన ప్రదేశమని భావించాం. అయితే భూములను స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చాలా మంది రైతులు(Farmers) భూములపైనే ఆధారపడి తమ జీవనం సాగుతోందని చెప్పారు. వారి ఇబ్బందులను అర్థం చేసుకున్నాం. మా నిర్ణయాన్ని మార్చుకున్నాం.’’ అని చెప్పారు.

"ఇది ఉద్యమ ఫలితం.."

రైతు నేత బడగలపుర నాగేంద్ర మాట్లాడుతూ.. “భూములను బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకించాం. వేలాదిమంది రైతులు, మహిళలు కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. మా పోరాటంలో విజయం సాధించాం,’’ అని హర్షం వ్యక్తం చేశారు.

ఏరోస్పేస్ హబ్ కోసం 13 గ్రామాలకు చెందిన 1,777 ఎకరాల సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.

సినిమా రంగం మద్దతు..

రైతుల ఉద్యమానికి కన్నడ చలనచిత్ర పరిశ్రమ నుంచి భారీ మద్దతు లభించింది. నటులు ప్రకాశ్ రాజ్, కిషోర్‌ రైతు పోరాటాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో ఏర్పాటుచేసిన రైతుల సమావేశానికి ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు కూడా. ప్రముఖ రచయిత బారగూరు రామచంద్రప్ప సైతం రైతుల పక్షాన నిలిచారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బెంగళూరులో సంబరాలు..

సీఎం నిర్ణయం నేపథ్యంలో బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో రైతు సంఘాలు, ప్రజా ఉద్యమకారులు, మేధావులు సంబరాలు చేసుకున్నారు. ‘‘రైతు హిత సంస్ధల సమాఖ్య” పేరుతో నిర్వహించిన ఈ సభలో విభిన్న వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి నిర్ణయంపై పరిశ్రమల మంత్రి ఎం.బి.పటీల్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఖెచ్ మునియప్ప అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 

Tags:    

Similar News