సీబీఐ అధికారినంటూ వైద్యుడి దగ్గర ‘కోటి’ కొట్టేసిన సైబర్ నేరగాడు
కోటి పదిలక్షలు మొత్తాన్ని స్తంభింపజేసిన సైబర్ క్రైమ్ పోలీసులు;
Translated by : Praveen Chepyala
Update: 2025-05-17 11:55 GMT
(మూలం.. మహాలింగం పొన్నుస్వామి)
ఫేక్ సీబీఐ అధికారులు మరో డాక్టర్ ను మోసం చేసి, కోటి రూపాయలను దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని తిరువారూర్ జిల్లా ముత్తుపేటకు చెందిన 82 ఏళ్ల వైద్యుడి దగ్గర నుంచి సీబీఐ అధికారులంటూ నటించిన సైబర్ మోసగాళ్లు రూ. 1.19 కోట్లు కొట్టేశారు.
కాలియంమన్ కోవిల్ స్ట్రీట్ లో ఆస్పత్రి నడుపుతున్న మీరా హుస్సేన్ అనే డాక్టర్ కు ముంబై నుంచి సీబీఐ అధికారినని చెప్పుకునే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి అతనిపై మాదక ద్రవ్యాలు మానవ అక్రమ రవాణా వంటి నేరాలలో ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేసి అతని ఆధార్, పాన్ వివరాలు డిమాండ్ చేశాడు.
జైలు శిక్ష బెదిరింపు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కామర్ హుస్సేన్ ను ‘‘డిజిటల్ అరెస్ట్ చేశామని’’ డబ్బు చెల్లించకపోతే జైలు శిక్ష విధిస్తామని బెదిరించాడు. కాల్ ను డిస్ కనెక్ట్ చేయవద్దని సూచించి, రూ. 2 కోట్లు డిమాండ్ చేశాడు. ఒత్తిడికి లోనైన హుస్సేన్ ఒక బ్యాంకు ఖాతాకు రూ. 55 లక్షలు, మరొక బ్యాంకు ఖాతాకు రూ. 64.20 లక్షలు బదిలీ చేసి మొత్తం రూ. 1.19 కోట్లు బదిలీ చేశాడు.
ఈ ఖాతాలు ఎకే ఎంటర్ ప్రైజేస్(ఇండస్ బ్యాంక్, తిరుచిరాపల్లి), గ్రీన్ విక్ గ్లోబల్ ఎంటర్ ప్రైజేస్ (ఐసీఐసీఐ బ్యాంకు, ఉతంగరై) కు చెందినట్లు తేలింది.
మోసగాళ్లు మళ్లీ పోన్ చేసి మరిన్ని డబ్బులు అడిగారు. హుస్సేన్ అనుమానం వచ్చి తాను మోసపోయాయని గ్రహించాడు. మే 14న తిరువారూర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నంబర్ 06/2025 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు వాట్సాప్ నంబర్లను +917068358830, +917376930602 గుర్తించి బదిలీ చేయబడిన మొత్తంలో రూ. 1.11 కోట్లను స్తంభింపజేశారు.
పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్..
భారత అంతటా డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో 2025 జనవరిలో ఒక వైద్యుడు రూ. 3 కోట్లు, నోయిడా లో గత సంవత్సరం మరొక వైద్యుడు రూ. 45 లక్షలు ఇలాంటి మోసాల వల్ల కోల్పోయారు.
తమిళనాడు సైబర్ క్రైమ్ ఏడీజీపీ సందీప్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు. పగలు లేదా రాత్రి ఏ సమయంలో నైనా హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేయండి. డబ్బు పొగొట్టుకున్న సందర్భాలలో ఇది మొదటి రక్షణ మార్గం. పోలీస్ స్టేషన్ ను సందర్శించి, పొగొట్టుకున్న డబ్బును తిరిగి పొందడానికి ‘గోల్డెన్ అవర్స్’ వృథా చేసే బదులు, డబ్బు పోయినప్పుడు ఆలస్యం చేయకుండా 1930 కి ఫిర్యాదు చేస్తే ఉత్తమం’’ అన్నారు.
సురక్షితంగా ఎలా ఉండాలి..
ఏజెన్సీ అధికారిక నంబర్ ను సంప్రదించాలి. అనుమానాస్పద కాల్ లను సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలి. స్కామ్ కు గురైతే మీ ఖాతాను స్తంబింపజేయమని వెంటనే మీ బ్యాంకును తెలియజేయండి.
చేయకూడనివి
ఆధార్, పాన్ లేదా బ్యాంక్ సమాచారం వంటి వ్యక్తిగత వివరాలు తెలియని కాలర్లతో పంచుకోవద్దు. ‘‘డిజిటర్ అరెస్ట్’’ బెదిరింపులను నమ్మవద్దు. భయంతో డబ్బును బదిలీ చేయవద్దు. ధృవీకరించిన వివరాలను కాలర్లతో సన్నిహితంగా ఉండవద్దు.