ఉన్నతాధికారులపై విచారణకు సీఎం ఆదేశం..కారణమేంటి?
కేరళలో ఉన్నతాధికారులపై సొంత పార్టీ (ఎల్‌డిఎఫ్) ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు.. సీఎం పినరయి విజయన్‌కు తలనొప్పిగా మారాయి.
కేరళలో ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలు సీఎం పినరయి విజయన్‌కు తలనొప్పిగా మారాయి. ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడ్డారని సొంత పార్టీ (ఎల్‌డిఎఫ్) ఎమ్మెల్యే అనడంతో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి.
అధికార ఎల్‌డిఎఫ్ నిలంబూరు శాసనసభ్యుడయిన అన్వర్ ఇటీవల ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజకీయ కార్యదర్శి పి.శశి, ADGP (లా అండ్ ఆర్డర్) ఎంఆర్ అజిత్ కుమార్‌పై ఆరోపణలు చేశారు.ADGPకి బంగారం స్మగ్లింగ్ రాకెట్‌లతో సంబంధాలు ఉన్నాయని, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడని అన్వర్ ఆరోపించారు.
విచారణకు ఆదేశించిన సీఎం..
ఎమ్మెల్యే అన్వర్ ఆరోపణలపై సీఎం విజయన్ స్పందించారు.పక్షపాతానికి తావు లేకుండా ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. పోలీసుశాఖలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని కూడా చెప్పారు. కొట్టాయంలో పోలీసు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ADGP అజిత్ కుమార్ కూడా వేదికపై ఉన్నారు.
కాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఏడీజీపీ నేరుగా స్పందించలేదు. ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ తాను ఇప్పటికే ముఖ్యమంత్రికి, డీజీపీకి లేఖ ఇచ్చానని విలేఖరులకు సమాధానం ఇచ్చారు.
సీఎం విచారణకు ఆదేశించిన వెంటనే మలప్పురంలో అన్వర్ ఏడీజీపీపై తాజా ఆరోపణలు చేశారు. రాజధాని నగరంలోని కొవడియార్ ప్యాలెస్ సమీపంలోని ఖరీదైన భవనాన్ని నిర్మిస్తున్నారని, ఖరీదైన ఏరియాలో స్థలం కొని ఇల్లు కట్టుకోవడానికి ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కుమార్ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కొన్ని టెలిఫోన్ సంభాషణలు కూడా బయటపెట్టాడు అన్వర్.
మంత్రుల ఫోన్ సంభాషణలను కుమార్ ట్యాప్ చేశారని, బంగారం స్మగ్లింగ్ రాకెట్‌లతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని అన్వర్ ఆదివారం ఆరోపించారు.పతనంతిట్ట ఎస్పీ సుజిత్ దాస్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.
‘వాటిని ప్రభుత్వం, పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది’
సోమవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ కొట్టాయంలో విలేకరులతో మాట్లాడుతూ.. “ఆరోపణలను ప్రభుత్వం, పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. తదనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటుంది” అని చెప్పారు.
ముఖ్యమంత్రి విజయన్ లాగా, ఎంవీ గోవిందన్ కూడా అన్వర్‌ను విమర్శించలేదు. అతని ఆరోపణలను తిరస్కరించలేదు.
‘సీఎం రాజీనామా చేయాలి’
ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సిఎం బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
“ముఖ్యమంత్రి కార్యాలయం నేరస్థుల కేంద్రంగా మారిపోయింది. సీఎంగా ఒక్క నిమిషం కూడా కొనసాగే హక్కు లేదు. ఆరోపణలపై సమగ్ర విచారణకు సిబిఐకి అప్పగించాలి' అని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ డిమాండ్ చేశారు.
‘ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి’
సిఎం రాజకీయ కార్యదర్శి పి శశిపై కూడా అన్వర్ ఆరోపణలు చేశారని సతీశన్ పేర్కొన్నారు.
‘‘సీఎం బాధ్యతలు చూసే వ్యక్తి శశి. అలాంటప్పుడు (ఈ ఆరోపణల) బాధ్యత నుంచి సీఎం విజయన్ ఎలా పారిపోతారు? ఇద్దరు ఉన్నతాధికారులు కేరళ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని సతీషన్ ఆరోపించారు.
‘సీఎం తప్పుకోవాలి’
ముఖ్య కార్యదర్శి, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) బంగారం స్మగ్లింగ్, దేశ వ్యతిరేక కార్యకలాపాలు, హత్యలకు పాల్పడ్డారని అధికార ఎమ్మెల్యే స్వయంగా ఆరోపిస్తే ..వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఎలా కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కే సురేంద్రన్ ప్రశ్నించారు.
“ప్రభుత్వాన్ని అధికారంలో కొనసాగడానికి ఏ హక్కు ఉంది? ఎమ్మెల్యే చెప్పింది తప్పయితే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి’’ అని అన్నారు.