కర్ణాటకలో 'కావేరి హారతి' ఎందుకు నిర్వహిస్తున్నట్లు..

కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ఆలయంలో, మాండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్ డ్యామ్ వద్ద హారతి కార్యక్రమం చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-10-02 07:31 GMT

ముడా (మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కుంభకోణంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ మాత్రం దసరా ఉత్సవాల సందర్భంగా ‘కావేరి హారతి’ నిర్వహణ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

రెండు చోట్ల హారతి..

మైసూరులో దసరా ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 3న గంగా హారతి తరహాలో కావేరీ హారతి నిర్వహించాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ఆలయంలో, మాండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్ డ్యామ్ వద్ద ఈ హారతి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. మాండ్య ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చెలువరాయస్వామి నేతృత్వంలో మాండ్య, మైసూరు నుంచి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కావేరి అభివృద్ధి సంస్థ సీనియర్ అధికారులు ఇటీవల హరిద్వార్, కాశీని సందర్శించారు. గంగా హారతి నిర్వహణ పద్ధతిపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. కార్యక్రమ నిర్వహణకు వారణాసికి చెందిన పూజారులు రానున్న రోజుల్లో మాండ్య, మైసూర్‌లను సందర్శించనున్నారు.

కావేరి చరిత్ర..

దేశంలోని ఏడు పవిత్ర నదులలో ఒకటైన కావేరీ నదికి కర్ణాటక చరిత్ర, సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్దాలుగా వ్యవసాయ, తాగునీటి అవసరాలు తీర్చే ఈ నది.. దక్షిణ కర్నాటకవాసులకు జీవనాధారం. అందుకే దీన్ని దక్షిణ గంగగా పిలుస్తారు. కావేరి నదిఒడ్డున్న ఉన్న శ్రీరంగపట్నానికి గొప్ప చరిత్ర ఉంది. టిప్పు సుల్తాన్ పాలనలో మైసూర్‌కు ఇది రాజధానిగా ఉండేది. నది ఒడ్డున శాశ్వత కట్టడాలు నిర్మించాక హారతి కార్యక్రమం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.

మోదీతో రాజకీయ ప్రాధాన్యం..

గత 108 సంవత్సరాలుగా హరిద్వార్‌లో, 35 ఏళ్లుగా వారణాసిలో రోజూ రెండుసార్లు గంగా హారతి ఇస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని ప్రేరణతో శివకుమార్‌ కావేరీ హారతి నిర్వహించాలని భావించినా.. JD(S) కంచుకోటగా పరిగణించే కావేరి బెల్ట్‌లో మద్దతు కూడగట్టుకోడానికి కాంగ్రెస్ ఈ కార్యక్రమం తలపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదంతా నాటకమే..

కావేరీ హారతి నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుబడుతోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా 30 ఏళ్ల నాటి కేసులను మళ్లీ తెరిచి, కరసేవకులను జైలుకు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గణేష్ విగ్రహాలను పోలీసు వ్యాన్‌లలో ఎక్కించిన అదే ప్రభుత్వం.. ఇప్పుడు హఠాత్తుగా హిందూ సంప్రదాయాలపై ఆసక్తి చూపడం నటనేనని బీజేపీ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ పేర్కొన్నారు. మీకు నిజంగా దేశం, మతం పట్ల శ్రద్ధ ఉంటే ముందుగా విధానసౌధలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన వారిని, నాగమంగళ, దావణగెరెలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన అల్లర్లకు బాధ్యులైన వారిని అరెస్టు చేయండి అని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News