బీజేపీ జాతీయ మండలిలో ఆ ముగ్గురికి చోటు..
తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకి అధిష్టానం ఇచ్చిన ఆఫరేంటి? ఆయనతో పాటు ఆ ఛాన్స్ కొట్టేసిన మరో ఇద్దరు ఎవరు?;
తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై(Annamalai).. ఇకనుంచి ఆ పార్టీ జాతీయ మండలి సభ్యుడు. జాతీయ స్థాయిలో తమిళనాడుకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న అధినాయకత్వం.. ఆయనతో పాటు వానతి శ్రీనివాసన్(Vanathi Srinivasan), తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan)కు కూడా జాతీయ మండలిలో చోటు కల్పించారు.
నాగేంద్రన్ పేరు ఖరారు.. అధికారిక ప్రకటన..
2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఏఐఏడీఎంకెతో కలిసి పోటీచేస్తామని గురువారం చెన్నైకి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటించారు. ఇటు తాను రేస్ నుంచి తప్పుకుంటూనే కొత్త బీజేప్ చీఫ్ పదవికి నాగేంద్రన్ (Nainar Nagendran) పేరును అన్నామలై ప్రతిపాదించారు. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం చెన్నై సమీపంలోని వనగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో నైనార్ నాగేంద్రన్‌ను తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అధికారికంగా ప్రకటించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాగేంద్రన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. మరో బీజేపీ నాయకుడు సుధాకర్ రెడ్డి నాగేంద్రన్‌కు పార్టీ కండువా కప్పి, తిరుపతి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అన్నామలై బీజేపీ-ఏఐఏడీఎంకె కూటమిని హైలైట్ చేస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ సంకీర్ణానికి ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వం వహిస్తారని కూడా చెప్పారు. నాగేంద్రన్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయానికి కృషి చేయాలని కోరారు.
అనంతరం నాగేంద్రన్ ప్రసంగించారు. "నాకు అప్పగించిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహిస్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, అన్నాడీఎంకే భాగస్వామ్యంతో కలిసి తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తా" అని అన్నారు.
అన్నామలై ఎందుకు దూరమయ్యారు?
కొన్ని రోజుల క్రితం అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి ఫళని స్వామి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు.
అన్నాడీఎంకే నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నామలైని తప్పిచేస్తే జతకడతామని ఆయన హోమంత్రితో చెప్పినట్లు సమాచారం. ఆ కారణంగానే అన్నామలై పదవికి దూరం కావాల్సి వచ్చింది.
ఇంతకు ఎవరీ నాగేంద్రన్ ?
తిరునెల్వేలి జిల్లా రాధాపురం తాలూకా తండయార్ కుళంలో అక్టోబర్ 16, 1960న జన్మించారు నైనార్ నాగేంద్రన్. 1980లో తిరునెల్వేలిలో AIADMK కార్యకర్తగా పనిచేసిన నాగేంద్రన్‌కు ఆ పార్టీ స్థానిక నాయకులతో ఉన్న సంబంధాలు ఆయనను పార్టీలో ఎదిగేలా చేశాయి.
జయలలిత మంత్రివర్గంలో మినిష్టర్‌గా..
తన నియోజకవర్గం తిరునెల్వేలిలో మౌలిక సదుపాయాల(మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, మురుగు కాలువల నిర్మాణం)పై దృష్టి పెట్టి ప్రజల మన్ననలు పొందారు. 2001-2006 మధ్యకాలంలో జయలలిత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తన హయంలో రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరా, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేశారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో DMK జోరు కొనసాగినా తన స్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. అయితే 2011లో DMK అభ్యర్థి ALS లక్ష్మణన్ చేతిలో ఓడిపోయారు. అయినా కూడా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ.. దక్షిణ తమిళనాడులో AIADMK ఇంకా బలంగానే ఉందని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
బీజేపీకి షిప్ట్..
డిసెంబర్ 2016లో జయలలిత దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. అ తర్వాత అన్నాడీఎంకే పగ్గాల కోసం ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్), టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పగ్గాల కోసం పోటీపడుతున్న సమయంలో నాగేంద్రన్ 2017లో బీజేపీలోకి మారిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికలో బీజేపీ ఓటు శాతం 3.5 మాత్రమే. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతానికి పూనుకున్న నాగేంద్రన్ తన పాత సంబంధాలను వినియోగించుకున్నారు. తిరునెల్వేలిలోని క్రైస్తవులు, ముస్లిం, మైనారిటీలతో నాగేంద్రన్‌కు ఉన్న సత్సంబంధాలు పార్టీ విస్తరణకు దోహదపడ్డాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాగేంద్రన్ BJP అభ్యర్థిగా తిరునేల్వేలిలో పోటీ చేసి DMK అభ్యర్థిని 23,107 ఓట్ల తేడాతో ఓడించారు. శాసనసభా పక్ష నేత హోదా కూడా ఆయనకు దక్కింది. జాతీయ రాజకీయాల్లోనూ దూసుకుపోయాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 3,42,821 ఓట్లు సాధించి 32.31 శాతం ఓట్ షేర్ సాధించారు. 2024లో తిరునెల్వేలిలో పోటీచేసి 3,36,676 ఓట్లు సాధించి ఓడిపోయారు. కానీ ఆయన ఓట్ షేర్ (31.5%)ను మాత్రం ఎవరూ గమనించలేదు.
వివాదాలు కూడా..
నాగేంద్రన్ పొలిటికల్ కెరీర్ వివాదాలతో ముడిపడింది. 2010లో ఆయన AIADMK మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయ వనరులకు మించి రూ. 3.9 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) ఆయనతో, ఆయన కుటుంబసభ్యలపై చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసు తన ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారిపోయింది. అయితే తన మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తూనే కేరీర్ కొనసాగించారు.