పీఎంకే సమావేశానికి అన్బుమణి రామదాస్ గైర్హాజరు..

తండ్రితో విభేదాలే కారణమా?;

By :  177
Update: 2025-05-16 13:46 GMT

పట్టాలి మక్కల్ కట్చి(PMK) వర్కింగ్ ప్రెసిడెంట్ అన్బుమణి రామదాస్(Anbumani Ramadoss) శుక్రవారం తమిళనాడు రాష్ట్రం తిండివనం సమీపంలోని తైలపురంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరుకాలేదు. పీఎంకే అధ్యక్షుడు, ఆయన తండ్రి ఎస్ రామదాస్ (S Ramadoss) ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి 110 మంది జిల్లా కార్యదర్శులు హాజరుకావాల్సి ఉన్నా.. కేవలం 20 మంది మాత్రమే సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. మెజారిటీ కార్యదర్శులు రాకపోవడంపై సీనియర్ రామదాస్‌ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఒక దశలో జిల్లా కార్యదర్శులు సమావేశానికి హాజరు కాకపోవడం గురించి సీనియర్ రామదాస్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

‘‘మామల్లపురంలో మే 11, 2025న జరిగిన వన్నియార్ యువజన సమావేశానికి జిల్లా కార్యదర్శులంతా హాజరయ్యారు. అలసట కారణంగా ఈ సమావేశానికి రాలేమని వారిలో కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు.’’ అని పేర్కొన్న సీనియర్ రామదాస్ తన కొడుకుతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఇతర జిల్లా కార్యకర్తల మాదిరిగానే తన కొడుకుకు కూడా ఆహ్వానం పంపామని చెప్పారు.

‘అలాంటి వారు పార్టీకి అవసరం లేదు..’

పార్టీలోని విభేదాలు, రాజకీయాల నుంచి రిటైర్ కావాలని పార్టీ సభ్యులలో ఒక వర్గం నుంచి వస్తున్న డిమాండ్ గురించి అడిగినప్పుడు.. సీనియర్ రామదాస్ ఇలా స్పందించారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసన్నారు. అదే సందర్భంలో జిల్లా కార్యదర్శులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అంకితభావంతో పనిచేయలేని వారు, ఆరోగ్య కారణాల వల్ల కొనసాగలేమని చెప్పేవారు పార్టీకి అవసరం లేదని స్పష్టంచేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో నిలుస్తుందని, కనీసం 50 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వారం క్రితం మామల్లపురంలో జరిగిన యువజన సమావేశంలోనూ ఆయన ఇదే విషయం చెప్పారు.

అప్పటి నుంచి దూరందూరంగా..

2024 లోక్‌సభ ఎన్నికలకు పొత్తు వ్యూహంపై తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాల మాట. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పీఎంకే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత స్పష్టంగా కనిపించాయి. సీనియర్ రామదాస్ కోరికకు విరుద్ధంగా జూనియర్ అన్బుమణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో జతకట్టారు. జూనియర్ రామదాస్ తన భార్య సౌమియా అన్బుమణిని ధర్మపురిలో నిలబెట్టారు. వన్నియార్ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆమె డీఎంకే చేతిలో ఓడిపోయారు.

కుల ప్రాతినిధ్య పార్టీ..

తమిళనాడులో కుల ఆధారిత రాజకీయ పార్టీ అయిన పీఎంకేను 1989లో ఎస్ రామదాస్ స్థాపించారు. వన్నియార్ కులానికి ప్రాతినిధ్యం వహించే ఈ పార్టీ ఉత్తర తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ప్రాంతంలో ఈ పార్టీకి మంచి ప్రజాదరణ ఉండేది. జూనియర్ రామదాస్ పార్టీలో ఆధిపత్య పాత్ర పోషించడంతో పార్టీ ప్రభావం తగ్గింది. 

Tags:    

Similar News