‘‘భారత్- రష్యా స్నేహం అమెరికాకు అస్సలు నచ్చదు’’
ఫెడరల్ కన్సల్టింగ్ ఎడిటర్ దక్షిణామూర్తి ప్రత్యేక విశ్లేషణ
By : Nisha P Sekar
Update: 2025-12-06 06:45 GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండురోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చారు. ఈ పర్యటనలో అనేక కీలక ఒప్పందాలు కుదిరాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఉక్రెయిన్ తో పాటు పరోక్షంగా నాటో తో మాస్కో పోరాడుతోంది. దాన్ని ఒంటరి చేయడానికి పాశ్చాత్య దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ నీరుగారిపోతున్నాయి.
ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడంపై వాషింగ్టన్ ఎలా చూసే అవకాశం ఉందో ‘ది ఫెడరల్ కన్సల్టింగ్ ఎడిటర్’, అంతర్జాతీయ వ్యవహరాల విశ్లేషకులు కే ఎస్ దక్షిణామూర్తి విశ్లేషించే ప్రయత్నం చేశారు. భౌగోళిక రాజకీయాలు, ఇంధన సరఫరా సంకేతాలు, సుంకాల యుద్ధం, శిఖరాగ్ర సమావేశం ద్వారా యూఎస్- భారత్- రష్యా మధ్య సంబంధాలు ఎలా మారతాయో ఆయన వివరించారు.
మోదీ- పుతిన్ స్నేహపూర్వక సంబంధాలను వాషింగ్టన్ ఎలా చూస్తుంది?
వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించడం, ఆయనకు ఘన స్వాగతం పలకడం అమెరికాకు కచ్చితంగా నచ్చవు. ఇందులో వేరే అభిప్రాయానికి తావులేదు. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికా ఎప్పుడూ భారత్ ను అనుమానపు చూపు చూస్తూనే ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలకు కారణం రష్యా నుంచి చమురు దిగుమతులే. అమెరికా కంటే భారత్, రష్యాతోనే లోతైన సంబంధాలు నెరుపుతోంది. కోల్డ్ వార్ సమయంలోనూ న్యూఢిల్లీ, మాస్కోవైపే నిలబడింది. ఇది అమెరికాకు ఇంకా గుర్తుంది.
పుతిన్ తో సమావేశం సహజంగానే వాషింగ్టన్ లోని చాలామంది థింక్ ట్యాంకర్ ను సహజంగానే రెచ్చగొట్టి ఉంటుంది. ముఖ్యంగా భారత్ కు వ్యతిరేకంగా లాబీని నడిపే వ్యవస్థలు ఇప్పుడు వాటి పని ప్రారంభిస్తాయి.
ట్రంప్ కు మోదీపై వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండి ఉండవచ్చు కానీ ఆయన ఢిల్లీపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పుతిన్ పర్యటన సహజంగానే అమెరికాకు చికాకు కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
రష్యన్ ఇంధనంపై అమెరికా ద్వంద్వ వైఖరిపై పుతిన్ విమర్శలు ఎలా చూడాలి?
అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ప్రపంచం చూస్తుంది. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఇదే విషయాన్ని హైలైట్ చేశారు. ఇది యూరప్ కు కూడా ఇది తెలుసని చెప్పారు. అంతర్జాతీయ రాజకీయాలలో మోసాలు నిత్యకృత్యం.
దేశాలు తమ ప్రయోజనాల కోసం పావులు కదుపుతాయి. భారత్, రష్యా నుంచి కొనుగోలు చేసే చమురులో ఎక్కువ భాగం ఇక్కడ శుద్ది చేసి ఈయూకు రవాణా చేస్తున్నారు. ఇది వారికి ప్రయోజనంగా ఉంది.
ఉక్రెయిన్ యుద్ధంలో ప్రారంభంలో యూరప్ ఎక్కువగా రష్యా చమురు, గ్యాస్ పైనే ఆధారపడి ఉన్నందున ఆంక్షలు విధించలేదు. అయితే రష్యా పై ఆంక్షలు విధించిన తరువాత భారత్ చమురు దిగుమతులు పెంచింది.
ఈ సమస్య చాలా సున్నితంగా మారింది. యుద్ధానికి ముందు క్రిమ్లిన్ నుంచి వచ్చే దిగుమతులు 2 శాతం ఉండగా, ఇప్పుడవి దాదాపు 40 శాతం పెరిగాయి. అయితే ట్రంప్ ఒత్తిడితో ఇప్పుడు క్రమంగా చమురు దిగుమతులు తగ్గిస్తున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ అక్టోబర్ నెలలో భారత్, రష్యా నుంచి 30 శాతం తక్కువగా దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. పైకి చూస్తే అమెరికా అభ్యంతరం చెప్పడానికి ఆప్టిక్స్ తప్ప మరేమీ లేదు. భారత్, రష్యాను విమర్శించలేదు. అలాగే పశ్చిమ దేశాలకు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించలేదు. అది తన ప్రయోజనాలకు అనుకూలంగా గేమ్ ఆడుతోంది.
రష్యాతో భారత్ లోతైన ఆర్థిక, ఇంధన నిబద్దతలను అమెరికా ఎలా చూస్తోంది?
ప్రస్తుత సంకేతాలన్నీ కూడా భారత్, రష్యాతో తన సంబంధాలను ఎలా పెంచుకుంటుందో తెలియజేస్తోంది. ఇది ట్రంప్, యూరప్ అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. క్రిమ్లిన్ తో పూర్తి సంబంధాలను తెంచుకోవాలనే వాటి డిమాండ్ ను న్యూఢిల్లీ పట్టించుకోవడం లేదు.
ఇక్కడ రష్యా- భారత్ కుదిరిన లాజిస్టిక్స్ ఒప్పందం చాలా ముఖ్యమైనది. ఇది రష్యన్ సైనిక సిబ్బందికి భారతీయ సౌకర్యాలను యాక్సెస్ చేయడానికి అనుమతి లభించింది. దీనికి బదులుగా ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ కు రష్యా తివాచీ పరవబోతోంది.
అయితే ఇది భవిష్యత్ లో భారత్ కు చిక్కులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అమెరికా, యూరప్ ను కాదని తన సొంత దారిని నిర్మించుకోవడాన్ని సూచిస్తోంది. దీనర్థం భారత్ వాటిని వ్యతిరేకిస్తుందని కాదు.
భారత్ ఇటీవల యూకేతో వాణిజ్య ఒప్పందం సంతకం చేసింది. యూఎస్ తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తోంది. భారత్ ఎవరిని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేదు కానీ కానీ యూరోపియన్లు, అమెరికన్లు మనల్ని ఎలా చూస్తున్నారు. ఆ పరిణామాలకు సిద్దంగా ఉండాలి.
భారత్ నమ్మదగినదా? కేవలం స్వయంప్రతిపత్తి కలిగిందా?
రెండు అభిప్రాయాలు ఉంటాయి. అమెరికా, భారత్ ను నమ్మదగనిదిగా చూస్తుంది. కానీ భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని అనుసరిస్తోంది. భారత్ క్వాడ్ లో ఒక భాగం. ఇది ప్రాథమికంగా చైనా ఎదుర్కోవడానికి ఇండో- పసిఫిక్ లో పాశ్చాత్య ప్రయోజనాలను రక్షించడానికి రూపొందించబడిన సమూహం.
అదే సమయంలో భారత్ రష్యాతో లాజిస్టిక్ ఒప్పందంపై సంతకం చేసింది. చైనాతో సంబంధాలు కొనసాగిస్తోంది. అమెరికాకు పూర్తి అనుంగు మిత్రులు ఎవరైన ఉంటే అది జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, యూకే. భారత్ మాత్రం ఆ జాబితాలో లేదు.
2030 నాటికి భారత్ - రష్యా మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది భవిష్యత్ లో నిరంతర ఘర్షణకు దారితీస్తుంది. ఇది అమెరికా- భారత్ భాగస్వామ్యాన్ని పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.
మోదీ- పుతిన్ శిఖరాగ్ర సమావేశం అమెరికాకు అతిపెద్ద పాఠమా?
అమెరికా కోరుకుంటున్నట్లుగా రష్యా ప్రపంచంలో ఒంటరిగా ఉండటం లేదని ఈ శిఖరాగ్ర సమావేశం చాటిచెప్పింది. అది మొదటి టేక్ అవే. ఇంక రెండో అంశం ఏంటంటే.. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి ట్రంప్ చేసిన కృషిపై పుతిన్ సానుకూల దృక్ఫథాన్ని వ్యక్తం చేశారు.
ఇది మిశ్రమ సందేశం ఇచ్చే అవకాశం ఉంది. మనకు సంబంధించినంత వరకూ ముగింపు చాలా స్పష్టం. భారత్ తన స్వాతంత్య్రం చాటి చెప్పినట్లు అవుతోంది. రష్యా నిరంతర ఇంధన సరఫరాలకు హమీ ఇచ్చింది.
ఇందులో డాలర్ లేకుండా ప్రత్యేకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి వాషింగ్టన్ కు చిరాకు తెప్పించే అంశాలు. న్యూఢిల్లీ ఇప్పటికీ ఏ కూటమితో ఉండకుండా వ్యూహాత్మక అలీన దీర్ఘకాలిక విధానాన్ని కొనసాగించడాన్ని చూపించింది.