ALLU ARJUN JAILED | ఈ రాత్రికి చంచల్ గూడ జైల్లోనే అల్లు అర్జున్ బస
అల్లు అర్జున్ డిసెంబర్ 14 శనివారం జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఎ శ్రీనివాస్ తెలిపారు.;
By : The Federal
Update: 2024-12-13 18:16 GMT
ప్రముఖ నటుడు, పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ (Allu Arjun)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆయన డిసెంబర్ 13న విడుదల కావడం అసాధ్యంగానే ఉంది. బెయిల్ ఆర్డర్ సక్రమంగా లేదనే వాదన ఒక పక్క, పూచీకత్తు బాండ్లు తీసుకోవడానికి అర్థరాత్రి సమయంలో అధికారులు ఎవరూ అందుబాటులో లేరనే వాదన మరోపక్క నడుస్తోంది. ఫలితంగా అల్లు అర్జున్ విడుదల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పూచీకత్తు బాండ్లు తీసుకుని న్యాయవాదులు డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. అయితే అక్కడ అధికారులు అందుబాటులో లేరనే ఆరోపణ చర్చనీయాంశమైంది. కొన్ని గంటల నుంచి విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో డిసెంబర్ 13వ తేదీ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండే అవకాశముంది. ఇందుకోసం జైలు సిబ్బంది బ్యారక్‌ను సిద్ధం చేశారు.
అల్లు అర్జున్‌ను డిసెంబర్ 23వ తేదీ ఉదయం అతని నివాసంలో అరెస్టు చేశారు. దిగువ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించగా రాష్ట్ర హైకోర్టు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ ఆర్డర్ కాపీలు ఇంకా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేదని అధికారులు చెబుతున్నారు.
41 ఏళ్ల అల్లు అర్జున్ డిసెంబర్ 14 శనివారం జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఎ శ్రీనివాస్ తెలిపారు. అల్లు అర్జున్ కోసం చంచల్‌గూడ జైలులో క్లాస్-1 బ్యారక్‌ని జైలు అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం.
అల్లు అర్జున్ విడుదల ప్రక్రియలో జాప్యంపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 13వ తేదీ రాత్రి తన కుమారుడు అల్లు అర్జున్ విడుదల అయ్యే అవకాశం లేకపోవడంతో ఆయన చంచల్‌గూడ జైలు వద్ద నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు. జైలు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు బన్నీని చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు అల్లు అర్జున్ సన్నిహితులు, బంధువులు ఆయన నివాసం వద్ద వేచి ఉన్నారు.
'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయారు. మరో బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మరణానికి సంబంధించి పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13 శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన ఘటనపై దాఖలైన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారించింది.
అల్లు అర్జున్ ను చూసేందుకు డిసెంబర్ 4న సినిమా హాలుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. థియేటర్ సామర్థ్యానికి మించి జనం రావడంతో గందరగోళం చెలరేగింది. రేవతి అనే 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీ తేజకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తేజ ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రేవతి భర్త చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 105, 118(1) కింద అల్లు అర్జున్, ఆయన భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం, నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వస్తున్నట్టు ఆ హాలు యాజమాన్యం లేదా నటుడి భద్రతా సిబ్బంది పోలీసులకు తెలియజేయలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ, "చిక్కడపల్లి పోలీసులకు అల్లు అర్జున్ వస్తున్నట్టు సమాచారం లేదు" అని పిటిఐ వార్తాసంస్థ కథనం.
ఈ కేసులో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం సందీప్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇంచార్జి గంధకం విజయ్ చందర్ అరెస్టయ్యారు.
సీఎం ఏమన్నారంటే...
హైదరాబాద్ పోలీసుల చర్యను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఈ విషయంలో తమ జోక్యం ఏమీ ఉండదన్నారు. ఆజ్ తక్ ఎజెండా కార్యక్రమంలో తెలంగాణ సీఎం మాట్లాడుతూ, “అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్లిపోలేదు. అతని కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి, తన సినిమా విడుదల సందర్భంగా గుమికూడిన అభిమానులకు చేతులు ఊపుతూ ఉత్సాహపరిచారు. గ్రీట్ చేస్తూ సందడి చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. తొక్కిస లాట జరిగింది. ఓ మహిళ చనిపోయింది.
‘ఓ అభిమాని మరణానికి అల్లు అర్జున్ ని నిందించడం సరైంది కాదు’ అని సినీ నిర్మాత అశోక్ పండిట్ అన్నారు. "అల్లు అర్జున్ అరెస్ట్ చాలా బాధాకరమైన సంఘటన, దానిలో రెండో అభిప్రాయానికి తావు లేదు. ఇలా జరుగుతుందని అతనూ అనుకోని ఉండడు. తన కేసును ఉపసంహరించుకుంటున్నానని -మరణించిన మహిళ రేవతి భర్త- భాస్కర్ ఓ ప్రకటన చేసినందుకు కృతజ్ఞతలు" అన్నారు అశోక్ పండిట్. అల్లు అర్జున్ అరెస్టుపై నటి, పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ ఆజ్ తక్‌తో మాట్లాడుతూ, ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరమని, ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని అన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పై బీజేపీ స్పందన వేరుగా ఉంది. పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదనే అభిప్రాయం వచ్చేలా బీజేపీ స్పందించింది. ఇదో ‘డెలివరీపై డ్రామా’గా అభివర్ణించింది. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్వీట్ ప్రకారం.. "ఈ డ్రామా ఓవర్ డెలివరీ, డైవర్షన్‌పై డైవర్షన్ - ఇదీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం! ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా తిరుగుతుంటే జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడ్ని అరెస్టు చేశారు. కాంగ్రెస్ కొనసాగిస్తున్న నాటకాన్ని దేశం యావత్తూ చూసింది! అన్నారు.
మొత్తం మీద ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.