మోదీకి సోరెన్ రాసిన బహిరంగ లేఖలో కోరిందేమిటి?

రాష్ట్రానికి "ప్రత్యేక బడ్జెట్" కేటాయించడమని అడగడం లేదని, తమకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను చెల్లించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానిని కోరారు.

Update: 2024-10-15 13:13 GMT

జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. తాను రాష్ట్రానికి "ప్రత్యేక బడ్జెట్" కేటాయించడమని అడగడం లేదని, తమకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను చెల్లించాలని లేఖలో కోరారు.

"జార్ఖండ్‌కు ‌ప్రత్యేక బడ్జెట్ కేటాయించమని అడగడం లేదు. మేం మా హక్కులను మాత్రమే అడుగుతున్నాం." అని సోరెన్ ప్రధానికి రాసిన బహిరంగ లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మైనింగ్, రాయల్టీ బకాయిలను వసూలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందంటూ సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ.. "చట్టంలో నిబంధనలు, న్యాయపరమైన ప్రకటనలు ఉన్నా.. మీ నుంచి బొగ్గు కంపెనీలకు ఎలాంటి చెల్లింపులు జరగడం లేదు... ఈ విషయాన్ని మీ కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తెచ్చాం. అయినా మాకు రావాల్సిన రూ. 1.36 లక్ష కోట్లు ఇంకా చెల్లించలేదు" అని సోరెన్ పేర్కొన్నారు.

"జార్ఖండ్ అభివృద్ధి చెందని రాష్ట్రం. మాకు న్యాయంగా రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడంతో చాలా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. జార్ఖండ్ ప్రజలు తమ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. ఇప్పుడు మేము మా వనరులు, హక్కులను సక్రమంగా వినియోగించు కోవాలనుకుంటున్నాం. జార్ఖండ్‌ అభివృద్ధికి బకాయి నిధులను విడుదలచేస్తే పిల్లలకు విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు వినియోగిస్తామన్నారు. మా హక్కులను పొందడానికి మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక హోదాను అడగడం లేదు. మేము కొన్ని రాష్ట్రాల మాదిరిగానే కేంద్ర బడ్జెట్‌లో ఎక్కువ వాటాను అడుగుతున్నాము. జార్ఖండ్ ప్రజలు న్యాయాన్ని కోరుకుంటున్నారని’’ అని సోరెన్ కోరారు

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 5తో ముగుస్తుంది.  

Tags:    

Similar News