కోల్‌కతా రేప్ అండ్ మర్డర్ కేసులో మాట మార్చిన ప్రధాన నిందితుడు

ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు మాట మార్చారు. ఈ కేసులో తనను కావాలని ఇరికించారని చెబుతున్నాడు.

Update: 2024-11-05 07:20 GMT

సీజీవో కాంప్లెక్స్ వద్ద మహిళల నిరసనను అడ్డుకుంటున్న పోలీసులు

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్ దారుణ హత్యకు గురై దాదాపు మూడు నెలలు కావొస్తుంది. ‘‘ఈ నేరం నేనే చేశా. కావాలంటే మీరు నన్ను ఏమైనా చేసుకోండి’’ అని అరెస్టు చేసిన వెంటనే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ నుంచి వచ్చిన మాటలవి. కాని ఇప్పుడేమో తనను ఈ కేసులో కావాలని ఇరికించారని మీడియాతో అన్నాడు.

‘11 నుంచి రోజూవారీ విచారణ’

అత్యాచారం, హత్య ఘటన కేసులో రోజువారీ విచారణ నవంబర్ 11 నుంచి కోల్‌కతాలోని సీల్దా కోర్టులో ప్రారంభమవుతుంది. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌ సెమినార్ గదిలో ఆగస్టు 9న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్‌ని పేర్కొంటూ అతనిపై వివిధ సెక్షన్ల కింద చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న విషయం విధితమే.

‘నన్ను కావాలని ఇరికించారు’

“నేను ఏమీ చేయలేదు. ఈ కేసులో నన్ను కావాలని ఇరికించారు. నా మాట ఎవరూ వినడం లేదు. ప్రభుత్వమే నన్ను ఇరికించి, నోరు విప్పొద్దని బెదిరిస్తోంది.'' అని సోమవారం సీల్దా కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చిన సందర్భంగా రాయ్ విలేఖరులతో అన్నారు.

‘రాయ్ వాదనపై విచారణ అవసరం’

రాయ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని విచారించాలని పశ్చిమ బెంగాల్ సీనియర్ కాంగ్రెస్ అధిర్ చౌదరి కోరారు. “నిందితుడి వాదనలను విస్మరించరాదు. విచారించాలి. ఈ తరహా నేరం ఒక్క వ్యక్తితో సాధ్యం కాదని చెబుతూ వస్తున్నాం. నిందితుడు చెబుతున్నట్టుగా ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని మా అనుమానం. పోలీసుల పాత్రపై కూడా విచారణ జరగాల్సి ఉంది’’ అని అన్నారు చౌదరి.

‘బెయిల్ ఇవ్వొద్దు’

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత నెలలో సమర్పించిన చార్జ్ షీట్‌లో రాయ్‌ను ఈ కేసులో "ఏకైక ప్రధాన నిందితుడు"గా పేర్కొంది. ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, సస్పెండ్ అయిన తలాహ్ పోలీస్ స్టేషన్‌ అధికారి అభిజిత్ మోండల్‌ను కోర్టు ముందు హాజరుపరచగా వారికి నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. సీబీఐ తన చార్జిషీట్‌లో వారి పేర్లను “నిందితులు”గా కనపర్చని కారణంగా బెయిల్ మంజూరు చేయాలని వారి తరపు న్యాయవాది కోరారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, వీరిద్దరికి బెయిల్ ఇస్తే "పెద్ద కుట్ర"కు పాల్పడే అవకాశం ఉందని సీబీఐ తరుపు న్యాయమూర్తి తన వాదన వినిపించారు.

అవినీతి కేసులో ఘోష్ అరెస్ట్..

సందీప్ ఘోష్ హయాంలో ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ప్రారంభించింది. అయితే దీని విచారణ కూడా సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆగస్టు 23న ఆదేశించింది. దాంతో ఈ కేసులో ఘోష్‌ అరెస్టయ్యారు.

‘కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలి’

ఇటు కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ పౌర సంఘాలు కరుణామోయి క్రాసింగ్ నుంచి సాల్ట్ లేక్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. “దుర్ఘటన జరిగి దాదాపు మూడు నెలలైంది. సీబీఐ ఏం చేస్తోంది? వారి విచారణలో స్పష్టత లేదు. వీలైనంత త్వరగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని కోరుతున్నాం’’ అని మార్చ్‌లో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయురాలు లిపికా చక్రవర్తి అన్నారు.

‘సీబీఐ సీరియస్‌గా తీసుకోవాలి’

ఆందోళన చేస్తున్న వైద్యుల్లో ఒకరైన కింజల్ నందా తన వీడియో మెసేజ్‌లో ఇలా అన్నారు. “మూడు నెలలు అయ్యింది. ఒకరిని మాత్రమే అరెస్టు చేశారు. నేర స్వభావాన్ని బట్టి చూస్తే ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయాన్ని ఉందని అర్థం చేసుకోవచ్చు. సీబీఐ ఏం చేస్తోంది? కేసును ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు? అరెస్టయిన నిందితుడు తనను ఇరికించారని చెబుతున్నాడు. అది తీవ్రమైన ఆరోపణ. దానిపై కూడా విచారణ జరగాలి. దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని కోరుతున్నాం. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. సీబీఐ కేసు విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో జూనియర్ డాక్టర్లు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ర్యాలీలు నిర్వహించారు.

Tags:    

Similar News