హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

19 ఏళ్ల మహిళపై సెప్టెంబర్ 14, 2020న సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలిని చికిత్స కోసం తొలుత అలీఘర్‌కు తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు.

Update: 2024-12-12 11:23 GMT

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. హత్రాస్‌లో 2020 సెప్టెంబర్‌లో సామూహిక అత్యాచారానికి గురై మరణించిన దళిత మహిళ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఉదయం 11.15 గంటలకు బూల్ గర్హి గ్రామానికి చేరుకున్న రాహుల్ బాధిత కుటుంబంతో 35 నిమిషాల పాటు గడిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించాక గ్రామంలో గుమికూడిన విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ మాజీ హత్రాస్ చీఫ్ చంద్రగుప్తా విక్రమాదిత్య విలేఖరులతో మాట్లాడారు. ‘‘రాహుల్, ప్రియాంక ఇద్దరూ అక్టోబర్ 3, 2020న బాధిత కుటుంబాన్ని కలిశారు. కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని చెప్పారు. ప్రస్తుతం వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు రాహుల్ వచ్చారు." అని చెప్పారు.

సంభాల్ జిల్లాలో హింసాకాండ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అక్కడి బాధితులను పరామర్శించేందుకు గత నెలలో రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయితే డిసెంబర్ 10 వరకు ప్రజా ప్రతినిధులతో సహా బయటి వ్యక్తుల ప్రవేశంపై జిల్లాలో నిషేధం విధించారు.

రాహుల్ పర్యటనపై బీజేపీ నేతల విమర్శలు..

ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ రాహుల్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలిసే ఉంటుంది. బీజేపీ పాలనలో ఏ నేరస్థుడు కూడా తప్పించుకోలేదు.’’ అని చెప్పారు. యూపీ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూడా రాహుల్‌ రాకను విమర్శించారు. ఈ కేసును సీబీఐ విచారించి చాలాకాలమైంది. ఇంకేమైనా కొత్త విషయాలుంటే మాకు తెలుపవచ్చు." అని పేర్కొన్నారు.

అసలేం జరిగింది..

19 ఏళ్ల మహిళపై సెప్టెంబర్ 14, 2020న సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలిని చికిత్స కోసం తొలుత అలీఘర్‌కు తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29, 2020న మరణించింది. 30వ తేదీ తెల్లవారుజామున కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక పోలీసుల ప్రోద్భలంతో త్వరగా అంత్యక్రియలు ముగించాల్సి వచ్చిందని బాధిత కుటుంబం ఆరోపించింది. అయితే కుటుంబం కోరిక మేరకు దహన సంస్కారాలు నిర్వహించినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టింది. నలుగురు నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది.

Tags:    

Similar News