ఉత్తరాఖండ్: లోయలో పడిన టెంపో ట్రావెలర్..
ఉత్తరాఖండ్ లోని రుద్ర ప్రయాగ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో..
By : Praveen Chepyala
Update: 2024-06-15 11:59 GMT
దేవభూమిలో ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్ర ప్రయాగ్ జిల్లాలో శనివారం 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
విచారణకు ఆదేశించిన సీఎం
రిషికేష్- బద్రీనాథ్ హైవే వెంట ఉన్న అలక్ నంద నదీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద వివరాలు తెలిసిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహూటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. టెంపోలో ప్రయాణిస్తున్న వారంతా కూడా ఢిల్లీ నుంచి చోప్తా రంగనాథ్ కు వెళ్తున్నారు. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేసిన ఆయన వెంటనే విచారణ జరపాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించారు.
ఈ ఘటనపై సీఎం సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించారు. ‘‘ రుద్ర ప్రయాగ్ జిల్లాలో జరిగిన టెంపో ప్రమాదం గురించి ఇప్పుడు సమాచారం అందింది. స్థానిక యంత్రాంగంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమయి ఉన్నాయి. క్షత గాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాం. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించాం’’ అని పోస్ట్ చేశారు
మరణించిన పవిత్ర ఆత్మలకు భగవంతుడి పాదాల దగ్గర చోటు కల్పించాలని, మృతుల కుటుంబాలకు ఈ అపారమైన బాధను భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్ ను కూడా ప్రార్థిస్తున్నాని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం చార్ ధామ్ యాత్రలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో ని రియాసీ లో భక్తులపై ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడిలో తొమ్మిది మంది భక్తులు మరణించారు. జూన్ 29 నుంచి ప్రసిద్ద అమర్ నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు భక్తులను ఆందోళన పరుస్తున్నాయి.