గట్టిగా మొరిగి గ్రామాన్ని కాపాడిన కుక్క
హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడటానికి ముందు జరిగిన సంఘటన;
By : Praveen Chepyala
Update: 2025-07-08 12:17 GMT
ప్రకృతి విపత్తులను ముందస్తుగా పసిగట్టడంలో మనుషుల కంటే జంతువులు ముందుంటాయని చాలాసార్లు విన్నాం. ఇప్పుడు అలాంటి ఘటన మరోసారి రుజువైంది.
హిమాచల్ ప్రదేశ్ ను కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. వీటివల్ల వరదలు, కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.
ప్రస్తుతం కుక్క కాపాడిన సంఘటన వారం క్రితం మండి జిల్లాలో జరిగింది. జూన్ 30 న మండి జిల్లాలోని ధరంపూర్ ప్రాంతంలో ఉన్న సియాతి గ్రామంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది.
హెచ్చరిక..
జూన్ 30 న ఒక గ్రామస్తుడి ఇంటిలో రెండో అంతస్తులో కట్టేసిన కుక్క అర్థరాత్రి నుంచి విరామం లేకుండా మొరగడం ప్రారంభించింది. ఎంతకు అది ఆపకపోవడంతో మొదట ఇంటి యజమాని తరువాత పక్కవారు లేచారు.
‘‘నేను అరుపుల శబ్దం విని నిద్రలేచి వచ్చాను.’’ నరేంద్ర అనే యజమాని జాతీయ మీడియాతో చెప్పారు. ‘‘కుక్కకు ఏం ఇబ్బంది ఉందో అని తెలుసుకోవడానికి నేను బయటకు వచ్చాను.
ఆ సమయంలో ఇంటి గోడల్లో పెద్ద పెద్ద పగుళ్లు గమనించాను. దాని నుంచి నీరు రావడం ప్రారంభం అయింది. నేను కుక్కతో సహ కిందకి పరిగెత్తి అందరిని నిద్ర లేపాను’’ అని ఆయన చెప్పారు.
కిందకి వచ్చి కుటుంబసభ్యులతో పాటు ఇతర గ్రామస్థులను అప్రమత్తం చేయడానికి పరుగెత్తాను. వారిని ఇళ్ల నుంచి పారిపోమని గట్టిగా అరిచి చెప్పాడు. గ్రామస్తులు కూడా తమ భద్రత కోసం కట్టుబట్టలతో గ్రామం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇళ్లు నేలమట్టం..
ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టిన కొద్ది సేపటికే గ్రామంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు డజన్ ఇల్లు నేలమట్టం అయ్యాయి. గ్రామంలో కేవలం నాలుగు ఇళ్లు మాత్రమే మిగిలాయి.
గ్రామస్తులు ఇప్పుడు సమీపంలోని త్రియంబాల గ్రామంలోని నైనా దేవీ ఆలయంలో ఆశ్రయం పొందారని, అక్కడ ఒక వారం నుంచి నివసిస్తున్నారు.
పెరుగుతున్న గాయం..
ప్రకృతి విపత్తి తరువాత చాలా మంది గ్రామస్తులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ సమస్య తలెత్తింది. బాధిత గ్రామాలకు ప్రజలు ముందుకు వచ్చి సహాయం అందించారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కేవలం రూ. 10 వేల సాయం అందించింది.
జూన్ 20 నుంచి హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల క్రియాశీలత కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం..
రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. 78 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. వీరిలో 50 మంది కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, మేఘా వృతాలు వంటి వర్ష సంబంధిత విపత్తుల కారణంగా 28 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారు.
మండి జిల్లా ఇప్పటికీ తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలలో ఒకటి. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 280 రోడ్లు పనిచేయడం లేదు. వాటిలో మండిలో మాత్రమే 156 ఉన్నాయి.
భారత వాతావరణ శాఖ పది జిల్లాలకు తాజాగా ఆకస్మిక వరద హెచ్చరిక జారీ చేసింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ రాష్ట్రం 23 ఆకస్మిక వరదలు, 16 కొండచరియలు విరిగిపడ్డాయి.