అలహాబాద్ హైకోర్టు జడ్జిపై అభిశంసన తీర్మానం నోటీసు
దేశంలో ‘యూసీసీ’ తీసుకురావాలని ప్రసంగించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్
By : 491
Update: 2024-12-13 09:24 GMT
ఇటీవల వీహెచ్ పీ నిర్వహించిన ఓ సమావేశంలో అలహబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ పై పాల్గొని ప్రసంగించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాజాగా ఆయనపై రాజ్యసభలో పలు పార్టీలు అభిశంసనకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.
అభిశంసన తీర్మానం నోటీసుపై కపిల్ సిబల్, వివేక్ తంఖా, దిగ్విజయ్ సింగ్, జాన్ బ్రిట్టాస్, మనోజ్ కుమార్ ఝా, సాకేత్ గోఖలే సహా 55 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు. ఎంపీలు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను కలిసి అభిశంసన నోటీసును అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
న్యాయమూర్తుల (విచారణ) చట్టం, 1968, రాజ్యాంగంలోని ఆర్టికల్ 218 ప్రకారం, జస్టిస్ యాదవ్‌పై అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ మోషన్ కోసం నోటీసు అందించారు.
విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నిర్వహించిన ఒక కార్యక్రమంలో జస్టిస్ యాదవ్ చేసిన దేశంలో అందరికి ఓకే చట్టం ఉండాలని, ప్రత్యేకంగా కొందరికి వేరే హక్కులు ఉండరాదని అన్నారు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత విషయంలో కొందరికి ప్రత్యేక హక్కులు ఉన్నాయని, వీటన్నింటిని యూసీసీ అమలుతో చెక్ పెట్టవచ్చని ఆయన అన్నారు.
దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్వేషపూరిత ప్రసంగం చేశారని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేశాయి. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ యాదవ్ ప్రసంగంపై పత్రికా మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుప్రీంకోర్టు స్పందించింది. వెంటనే అలహబాద్ హైకోర్టు నుంచి వివరాలు కోరింది.