మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాల ఐక్యతా రాగం?
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఉమ్మడిగా వ్యూహం ఖరారు చేసుకున్న ప్రతిపక్షాలు;
By : Praveen Chepyala
Update: 2025-07-20 06:15 GMT
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తమ వ్యూహాన్ని ఖరారు చేయడానికి ‘ఇండి’ కూటమి సభ్యులు శనివారం వర్చువల్ గా సమావేశం అయ్యారు. ఐక్యంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఇరుకున పెట్టడంపై కూటమి సభ్యులు వ్యూహం ఖరారు చేసుకున్నారు.
త్వరలోనే స్వయంగా సమావేశం నిర్వహించేందుకు కూటమి నాయకులు అంగీకరించారని తెలిసింది. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాలను చర్చకు తీసుకుని కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వర్గాలు తెలిపాయి.
1. పహల్గామ్ ఉగ్రవాద దాడి తదనంతరం ఆపరేషన్ సిందూర్, ఇండో - పాక్ కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటనలు.
2. భారత్ విదేశాంగ విధాన వైఫల్యాలు, ముఖ్యంగా అమెరికా, చైనా, ఇజ్రాయెల్/గాజాకు సంబంధించి అంశాలలో వైఫల్యం
3. డీలిమిటేషన్ ప్రక్రియ
4. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు
రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడు ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది నాయకులు అహ్మాదాబాద్ విమాన ప్రమాదంపై చర్చ కోసం డిమాండ్ కూడా లేవనెత్తారని అన్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్దరణ, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద లడఖ్ ను చేర్చడం అనే డిమాండ్ సమావేశంలో చర్చించలేదని తెలిపారు.
రాజ్యసభ, లోక్ సభలో ఎంపీలు అయిన మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ లు ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్దరించడానికి, లఢక్ ను ఆరవ షెడ్యూల్ కింద చేర్చడానికి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇండి కూటమి సమావేశంలో కేంద్రపాలిత ప్రాంతమై జేఅండ్ కే సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొని, ఖర్గే, రాహుల్ లేఖను స్వాగతించారు.
సమావేశంలో జమ్మకాశ్మీర్, లడఖ్ సమస్యలు లేవనెత్తారా, ఖర్గే- రాహుల్ మోదీకి రాసిన లేఖలో చేసిన డిమాండ్లను సంయుక్తంగా ముందుకు తీసుకురావడంపై ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం లోపించిందా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది.
మోదీ రావాలి..
పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ సంబంధిత అంశాలపై చర్చ జరిగినప్పుడూ మోదీ పార్లమెంట్ లో తప్పనిసరిగా ఉండాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికలు జరగనున్న బీహార్ లో ఎన్నికల కమిషన్ వివాదాస్పదమైన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణపై కూడా ఇండి కూటమి చర్చకు పట్టుబట్టబోతోంది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీ,పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జేఅండ్ కే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఎన్ సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే(యూబీటీ), అభిషేక్ బెనర్జీ( టీఎంసీ), తేజస్వీ యాదవ్(ఆర్ జేడీ), రామ్ గోపాల్ యాదవ్(ఎస్పీ), తిరుచ్చి శివ (డీఎంకే), ఎంఏ బేబీ, డీ రాజా(సీపీఐ), దీపాంకర్ భట్టాచార్య(సీపీఐ ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు.