బీహార్: ఎన్నికల కోసం ప్రపంచ బ్యాంకు నిధులు వాడారు
జన్ సురాజ్ పార్టీ ఆరోపణలు
By : Praveen Chepyala
Update: 2025-11-16 08:00 GMT
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు బదిలీ చేసిన రూ. 10,000 వేల ప్రపంచ బ్యాంకు నిధులనీ, ఇందుకోసం రూ.14 వేల కోట్లను ఖర్చు చేశారని ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపణలు గుప్పించింది.
‘‘ఇది ప్రజా వనరులను స్పష్టంగా దుర్వినియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయడానికి చేసిన అనైతిక ప్రయత్నం’’ అని జేఎస్పీ విమర్శలు గుప్పించింది.
ఈ అంశంపై అది వివరణాత్మక దర్యాప్తును డిమాండ్ చేసింది. పార్టీ ప్రతినిధి పవన్ వర్మ మాట్లాడుతూ.. బీహార్ లో ప్రస్తుతం ప్రభుత్వ అప్పు రూ. 4,06,000 కోట్లుగా ఉందని, రోజుకు రూ. 63 కోట్ల వడ్డీ ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఆరోపణలకు ఎన్డీఏ నాయకత్వం నుంచి బీహార్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం..
జన్ సురాజ్ పార్టీ తన తొలి ఎన్నికల ప్రక్రియలో కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులను ఉచితాల కోసం మళ్లించారని ఆరోపించారు.
జూన్ నుంచి ఎన్నికలు ప్రకటించే వరకూ నితీశ్ కుమార్ ప్రభుత్వం ఓట్లు కొనుగోలు చేయడానికి రూ.40 వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఇందులో ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 14 వేల కోట్ల కూడా ఇందుకోసం మళ్లించారని, ఇది నిధుల దుర్వినియోగం అని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఖాతాలో వేసిన రూ. 10,000 లను రోజ్ గార్ యోజన గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
‘‘మొదటిసారిగా మోడల్ ప్రవర్తనా నియమావళి ఉన్నప్పటికీ పోలింగ్ ముందు రోజు వరకూ చెల్లింపులు జరిపారు. ఇటువంటి బదిలీలు మహిళలను ప్రభావితం చేశాయి’’ అని ఆరోపించారు.
2025 బీహార్ ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన ఈ పరిహారం ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తున్నారు. బీహార్ లో ఎన్డీఏ విజయం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై ఆధారపడి ఉందని జన్ సురాజ్ పార్టీ విమర్శలు గుప్పించింది.
జంగిల్ రాజ్..
జన్ సురాజ్ పెన్షన్లను రూ. 2000 వేలకు పెంచుతామని ప్రతిజ్ఞ చేసిన తరువాతే బీహార్ ప్రభుత్వం పెన్షన్లను రూ. 700 నుంచి రూ. 1100 కు పెంచిందని అన్నారు. రాష్ట్రంలో మరోసారి జంగిల్ రాజ్ వస్తుందనే భయంతోనే జన్ సురాజ్ కు చెందిన ఓటర్లు తిరిగి ఎన్డీఏకు ఓటు వేశారని పేర్కొన్నారు.
జన్ సురాజ్ పార్టీ ప్రతినిధి పవన్ వర్మ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఉపయోగించిన మొత్తం కూడా ప్రపంచ బ్యాంకు నిధులే అన్నారు. మోడల్ ప్రవర్తనా నియామవళి అమల్లోకి రావడానికి ముందే రూ. 14 వేల కోట్లను తీసుకుని రాష్ట్రంలోని మహిళలకు ఖాతాలకు మళ్లించారని పేర్కొన్నారు.
ఇవి చట్టబద్దంగా అనుమతించినప్పటికీ ఇవి అనైతిక చర్యలని, వీటిపై ప్రభుత్వాలు వివరణ మాత్రమే ఇస్తాయని పేర్కొన్నారు. తరువాత ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహ ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా నగదు బదిలీల కింద ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ(89), జేడీయూ(85) ఇతర పక్షాలలో కలిపి మొత్తం 202 సీట్లను గెలుచుకుంది. మరోవైపు విపక్ష మహా ఘట్ బంధన్ కేవలం 35 స్థానాలకే పరిమితం అయింది.