‘‘ ఆ డ్యామ్ నీళ్లను భారత్ పై బాంబులా ప్రయోగిస్తుంది’’
బ్రహ్మాపుత్రా నదీపై చైనా నిర్మిస్తున్న డ్యామ్ పై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం పెమాఖండు;
By : Praveen Chepyala
Update: 2025-07-09 14:50 GMT
బ్రహ్మాపుత్రా నదీపై చైనా నిర్మించబోతున్న మెగా డ్యామ్ భారత్ కు పెను ప్రమాదం తీసుకువస్తుందని, అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఉనికికే ముప్పుగా మారుతుందని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ కు ట్రిక్కింగ్ వాటర్ బాంబులా దానిని కమ్యూనిస్టు దేశం వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు. జాతీయ మీడియాతో ఖండు మాట్లాడుతూ..బ్రహ్మపుత్రా నదీపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మించడానికి చైనా ప్రయత్నిస్తోందని, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
అంతర్జాతీయ జల ఒప్పందాలపై చైనా సంతకం చేయలేదని, కాబట్టి నిబంధనలు పాటించమని దానిపై ఒత్తిడి చేయలేమని అన్నారు. చైనాను ఎట్టిపరిస్థితుల్లో నమ్మలేమని, వారు ఎప్పుడు ఎం చేస్తారో ఎవరికి తెలియదని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేర్కొన్నారు.
అస్థిత్వ ముప్పు..
చైనా నిర్మిస్తున్నమెగా డ్యామ్ వలన దాని సైనిక ముప్పు కంటే పెద్దదని అన్నారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా గిరిజన ప్రజల అస్థిత్వ ముప్పుగా పరిణమిస్తుందని చెప్పారు
. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం, ఎందుకంటే చైనా దీనిని నీటి బాంబులాగా కూడా ఉపయోగించవచ్చు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
అంతర్జాతీయ జల ఒప్పందాలపై చైనా సంతకం చేసి ఉంటే ఈ ఆనకట్ట అరుణాచల్ ప్రదేశ్ కు ఒక వరంలా మారి ఉండేదని చెప్పారు. ఈ ఆనకట్ట వలన తమ రాష్ట్రంతో పాటు, అస్సాం, బంగ్లాదేశ్ లో వరదలను నిరోధించి ఉండేదని ఆయన అన్నారు.
కానీ చైనా సంతకం చేయనందున అకస్మాత్తుగా నీటిని విడుదల చేయగలదు. దీనివలన రాష్ట్రంలోని సియాంగ్ నదీ పరివాహాక ప్రాంతం మొత్తం దెబ్బతింటుంది. ఇక్కడ ఎక్కువగా ఆది తెగ నివాసం ఉంటోంది. ఇది వారి ఆస్తి, భూమి, వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉందని, ఇది రక్షణ యంత్రాంగంగా పనిచేస్తుందని, నీటి భద్రతను కాపాడుతోందని ఖండు అన్నారు. భారత ప్రభుత్వంఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగితే ఆ ప్రాంత నీటి అవసరాలను తీరుస్తుందని అన్నారు. కానీ భవిష్యత్ లో చైనా తన మెగా డ్యామ్ ను పూర్తి చేస్తే భారత్ లోని సియాంగ్, బ్రహ్మపుత్రా నదులు ఎండిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా ఆనకట్ట..
2021 లో చైనా ప్రధానమంత్రి లీకెకియాంగ్ ఆ ప్రదేశాన్ని సందర్శించిన తరువాత బ్రహ్మపుత్రా నదిపై చైనా ప్రాజెక్ట్ ను ప్రకటించింది. వార్తా కథనాల ప్రకారం.. గత సంవత్సరం చైనా ఐదు సంవత్సరాలలో పూర్తి చేయబోయే 137 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ లను ఆమోదించింది.
ఇది 60 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ఆనకట్టగా రికార్డుల కెక్కుతుంది. ఇది హిమాలయలలో అత్యంత సున్నిత ప్రాంతంలో ఉంది. ఇక్కడ భూకంపాలు కూడా అధికంగా వస్తుంటాయి.