మణిపూర్ కు కొత్త గవర్నర్ గా మాజీ కేంద్ర హోం సెక్రటరీ నియామకం
మిజోరామ్ కు మాజీ ఆర్మీ చీఫ్ ను నియమించిన రాష్ట్రపతి;
By : Praveen Chepyala
Update: 2024-12-25 07:32 GMT
దేశంలో ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ లోని ప్రెస్ కమ్యూనిక్ తెలిసిన వివరాల ప్రకారం.. ఒడిశా గవర్నర్ పని చేస్తున్న రఘుబర్ దాస్ చేసిన రాజీనామాను ఆమోదించారు. కొత్త గవర్నర్లు వారి కార్యాలయాల్లో విధులు స్వీకరించిన తేదీ నుంచి నియమాకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.
గత కొంతకాలంగా అల్లర్లతో రగులుతున్న మణిపూర్ కు కొత్తగా గవర్నర్ గా కేంద్ర హోమ్ సెక్రటరీగా పనిచేసి రిటైరయిన అజయ్ కుమార్ భల్లాను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కుకీ - మైతేయ్ తెగల మధ్య జాతుల సంఘర్షణ చెలరేగడంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న అనుకున్నా ప్రతిసారీ మళ్లీ అల్లర్లు చెలరేగుతున్నాయి. అందుకే కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
అలాగే మిజోరాం గవర్నర్ గా మాజీ ఆర్మీ చీఫ్ విజయ్ కుమార్ సింగ్ ను నియమించారు. ఆయన ఇంతకుముందు రెండుసార్లు మోదీ మంత్రి వర్గంలో కేంద్రమంత్రిగా పని చేశారు. సింగ్ 2012 లో ఆర్మీ చీఫ్ గా రిటైర్ అయ్యారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
అలాగే ఇన్నాళ్లుగా కేరళ గవర్నర్ గా పని చేస్తున్న ఆరిఫ్ మహ్మద్ ను బిహార్ కు బదిలీ చేశారు. ఇక్కడ వచ్చే సంవత్సరం అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళకు కొత్త గవర్నర్ గా విశ్వనాథ్ ఆర్లేకర్ గా నియమించారు.
ఈ గవర్నర్ల నియామకంలో ఆశ్చర్యం కలిగించే అంశం అజయ్ కుమార్ భల్లా కు గవర్నర్ గా పోస్టింగ్ ఇవ్వడం. ఆయన ఈ ఏడాది ఆగష్టులో హోం సెక్రటరీగా రిటైర్ అయ్యారు. దాదాపు ఐదు సంవత్సరాలుగా ఈ పదవిలో ఉన్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన అస్సాం- మేఘాలయ క్యాడర్ లో సుదీర్ఘంగా పనిచేశారు. అందుకే ఈశాన్యంలో కీలకమైన మణిపూర్ కు ఆయన పంపించారా అనిపిస్తోంది. ఇన్ని రోజులుగా మణిపూర్ కు అస్సాం గవర్నర్ గా పనిచేస్తున్న లక్ష్మన్ ప్రసాద్ ఆచార్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మిజోరామ్ గవర్నర్ గా ఉన్న హరిబాబు కంభంపాటిని ఒడిశా గవర్నర్ గా బదిలీ చేశారు.