ఈశాన్యాన కొత్త కల్లోలం మొదలవబోతుందా?

మయన్మార్- భారత్ సరిహద్దు దేశాల మధ్య కంచె నిర్మాణం వ్యతిరేకిస్తున్న నాగా, కుకీలు;

Update: 2025-08-24 13:06 GMT
మయన్మార్ - భారత్ సరిహద్దు ప్రాంతం

భారత్- మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో కంచె వేయడం, రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న రాకపోకలపై ఉన్నతాధికారుల మధ్య వచ్చే వారంలో చర్చలు ప్రారంభం కాబోతున్నాయి.

అయితే ఈ విధానాన్ని ముఖ్యంగా కల్లోల పరిస్థితులున్న మణిపూర్ లో మరోసారి కుంపటి రాజేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుకీలు, నాగాలు దీనిని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక మెయితీ ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండు పైలెట్ ప్రాజెక్ట్ లు..
అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లో రెండు పైలెట్ ప్రాజెక్ట్ లు ప్రారంభించి వేగంగా చర్యలు తీసుకున్నారు. హైబ్రిడ్ నిఘా వ్యవస్థను ఉపయోగించి అంతర్జాతీయ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేస్తుండటంతో స్థానిక గిరిజన సమూహాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
భారత్, మయన్మార్ మధ్య 1643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి. హోంశాఖ నివేదిక ప్రకారం.. 1472 కిలోమీటర్ల మేర సరిహద్దు గుర్తించడం పూర్తయింది.
మణిపూర్ లో దాదాపు 40 కిలోమీటర్ల మేర సరిహద్దు కంచెను నిర్మించారు కూడా. ఇక్కడ మోరే ప్రాంతంలో దాదాపు 19 కిలోమీటర్ల సరిహద్దు కంచె ప్రధానంగా పూర్తి చేశారు. ఇది సరిహద్దు లో కీలక నగరం.
మణిపూర్ లోని మెయితీ కమ్యూనిటీ ప్రభుత్వం పై తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. కల్లోలిత మయన్మార్ నుంచి కుకీ తెగ ప్రజలు మణిపూర్ లోకి అక్రమంగా వస్తున్నారని వీరు ఆందోళన చేస్తున్నారు. త్వరగా అంతర్జాతీయ సరిహద్దు వెంట కంచె నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం అంటే 2023 మే లో కుకీ- మెయితీ తెగ ప్రజలు మధ్య జాతి వివాదం తలెత్తిన తరువాత ఈ డిమాండ్ తీవ్రమైంది. కుకీ- జో- చిన్ జాతికి చెందిన అక్రమ వలసదారుల సంఖ్య రాష్ట్ర డెమోగ్రాఫిక్ ను మార్చివేస్తోందని మెయితీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగా సమాజం నుంచి వ్యతిరేకత..
మణిపూర్ లో జాతి సంఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో హోంమంత్రిత్వ శాఖ గత సంవత్సరం సరిహద్దుకు కంచె వేయాలని, అంతర్జాతీయ సరిహద్దుకు ఇరువైపులా నివసించే తెగలు ప్రయాణ పత్రాలు లేకుండా ఒకరి భూభాగాల్లో ఒకరు 16 కిలోమీటర్లు ప్రయాణించడానికి అనుమతించే ఎఫ్ఎంఆర్ ని ముగించాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్రం నిర్ణయంపై ఇప్పుడూ తీవ్ర వ్యతిరేకత మణిపూర్ లోని నాగా సమాజం నుంచి వస్తోంది. కుకీ- జో- చిన్ ప్రజల మాదిరిగానే, నాగాలు కూడా భారత్- మయన్మార్ సరిహద్దుకు ఇరువైపులా నివసిస్తున్నారు.
మణిపూర్, నాగాలాండ్ లోని నాగా గ్రూపులు సరిహద్దు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సరిహద్దు వెంట ఉన్న నాగాల సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తుందని వారు ఆరోపించారు.
మణిపూర్ లోని నాగా తెగల అన్ని అత్యున్నత సంస్థల గొడుగు సంస్థ అయిన యునైటెడ్ నాగా కౌన్సిల్, ఎఫ్ఎంఆర్ రద్దు 2007 లో ఆమోదించబడిన ఐరాస స్వదేశీ ప్రజల హక్కుల ప్రకటనలోని ఆర్టికల్ 36 ను ఉల్లంఘించడమే అని ఎత్తి చూపింది.
ఆ ఆర్టికల్ అంతర్జాతీయ సరిహద్దు వెంట విభజించబడిన స్వదేశీ ప్రజలకు సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం సరిహద్దు సంబంధాలను కొనసాగించే, అభివృద్ది చేసుకునే హక్కును ఇస్తుంది. అయితే భారత్ ఈ ఆర్టికల్ పై సంతకం చేయలేదు.
పాస్ పోర్ట్ రూల్స్ మార్పు..
భారత్- మయన్మార్ సరిహద్దుకు ఇరువైపులా నివసించే ప్రజలు తమ చారిత్రక సంబంధాలను కొనసాగించడానికి వీలుగా, 1950 లో హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ పాస్ పోర్టు నియమాలను సవరించింది. దీని ద్వారా సరిహద్దుకు ఇరువైపులా 40 కిలోమీటర్ల లోపు నివసించే కొండ తెగలు పాస్ పోర్టు లేదా వీసా లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. మయన్మార్ కు చెందిన గిరిజన ప్రజలు భారత్ లో 72 గంటలు ఉండటానికి కూడా అనుమతి ఉంటుంది.
అయితే నాగ తిరుగుబాటుదారులు, తరువాత మెయితీ తిరుగుబాటుదారులు, మిజో తిరుగుబాటుదారులు ఈ వ్యవస్థను తమ ప్రయోజనాలను ఉపయోగించడం ప్రారంభిండంతో ఈ ఏర్పాటు త్వరలోనే విమర్శలను ఎదుర్కొంది. నాగా తిరుగుబాటు ఆగష్టు 1947 నాటిది.
మైయితీ తిరుగుబాటు 1964 లో ప్రారంభం కాగా, మిజో తిరుగుబాటు 1966 లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుదారులకు మయన్మార్ సురక్షిత స్థావరంగా మారింది. ఇది భారత్ కు పెద్ద సమస్యగా మారింది.
అనుమతి వ్యవస్థ..
ఆ సంవత్సరం ఆగష్టు నుంచి ఎంహెచ్ఏ సరిహద్దు దాటే ప్రయాణానికి పర్మిట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కానీ సరిహద్దులో కంచెలేకపోవడం, ఎక్కువగా కాపలా లేకపోవడంతో ఇరువైపులా ఉన్నా వ్యక్తులు పర్మిట్ లేకుండా స్వేచ్ఛగా దాటేవారు. భారత్ మళ్లీ 2004 లో ఎఫ్ఎంఆర్ లో పరిమితులను 40 కిలోమీటర్ల నుంచి 16 కిలో మీటర్లకు తగ్గించింది.
గత సంవత్సరం తీసుకున్న ఈ నిర్ణయం తరువాత సరిహద్దులో పరిస్థితి దాదాపుగా మారిపోయింది. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ లోని సరిహద్దుల వెంబడి నివసిస్తున్న తెగల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
అయితే కేంద్రం మయన్మార్ నుంచి వచ్చే వారి బయోమెట్రిక్ డేటాను సేకరించిన తరువాత నియమించబడిన పాయింట్ల ద్వారా వారి ప్రవేశాన్ని పరిమితం చేయాలని నిర్ణయించింది. మణిపూర్ లో కంచె పనులు జరుగుతున్నందున రాష్ట్రం నుంచి బలమైన ప్రతిఘటన ఎదురవుతోంది.
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూఎన్సీ గత నెలలో తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్రానికి 20 రోజుల గడువు విధించింది. దాని గడువు ముగిసిన తరువాత దాని కార్యాచరణ విధానాన్ని 15 రోజుల్లోగా ప్రకటించాలని యూఎన్సీ నిర్ణయించింది. దీనికి ప్రతిస్పందనగా పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించడానికి కేంద్రం మణిపూర్ నుంచి నాగా ప్రతినిధి బృందాన్ని చర్చల కోసం న్యూఢిల్లీకి ఆహ్వానించింది.
ఆగష్టు 26న సమావేశం..
ఆగష్టు 26 న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో జరగనున్న సమావేశానికి హోంమంత్రిత్వ శాఖ ఈశాన్య సలహాదారు ఏకే మిశ్రా ఆహ్వానం పంపారని ధృవీకరిస్తూ యూఎన్సీ అధ్యక్షుడు ఎన్ జీ లోర్హో ది ఫెడరల్ తో మాట్లాడారు. 11 మంది సభ్యుల నాగా ప్రతినిధి బృందం చర్చల్లో పాల్గొంటుందని చెప్పారు. ఈ ప్రతినిధి బృందం ఆగష్టు 25న న్యూఢిల్లీకి వెళ్తుంది.
‘‘ఈ అంశంపై నాగ ప్రజల మనోభావాలు ప్రభుత్వ విధానంలో ప్రతిబింబించాలి’’ అని ఆయన అన్నారు. నాగాలు ఎటువంటి ఆలస్యం చేసే వ్యూహాలను అంగీకరించరని అన్నారు. నాగాలాండ్, మిజోరాం ప్రభుత్వాలు కూడా కేంద్రం సరిహద్దు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. స్పష్టంగా కేంద్ర తన వివాదాస్పద సరిహద్దు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం తన విధానాలను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సి ఉంది.


Tags:    

Similar News