గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మణిపూర్‌లో అల్లర్లను నియంత్రించగలరా?
మణిపూర్ అల్లర్లతో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నుంచి అజయ్ కుమార్ భల్లా బాధ్యతలు స్వీకరించారు.;
భారతదేశంలో అత్యధిక కాలం పాటు హోంసెక్రటరీగా పని చేసిన అజయ్ కుమార్ (Ajay Kumar Bhalla) భల్లా జనవరి 3న మణిపూర్ గవర్నర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్‌లో ఆయనతో మణిపూర్ (Manipur ) హైకోర్టు (High Court) ప్రధాన న్యాయమూర్తి డి. కృష్ణకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శి వినీత్ జోషి, ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్(Biren Singh), ఆయన మంత్రివర్గ సహచరులు హాజరయ్యారు. జూలై 2023 నుంచి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇన్‌చార్జీ గవర్నర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎవరీ భల్లా..
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన భల్లాది అస్సాం – మేఘాలయా క్యాడర్. ఆగస్టు 2024 వరకు అయిదేళ్ల పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా చేశారు. వాస్తవానికి భల్లాది పంజాబ్‌లోని జలంధర్. అయితే మణిపూర్ గవర్నర్‌గా ఆయన్ను నియమించడం ఆసక్తిగా మారింది. 2023 మే నుంచి మణిపూర్ వర్గ హింసతో రగిలిపోతున్న విషయం తెలిసిందే.
అదే రోజున మణిపూర్‌లోని కుకి-జో ప్రాంతాల్లో భద్రతా దళాలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు నిరసనగా కాంగ్‌పోక్పి జిల్లాలోని ఒక గిరిజన సమూహం పోలీసు కార్యాలయంపై దాడి చేయడంతో ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు భద్రతా దళాలు, ప్రజలకు మధ్య సంబంధాలను మరింత బలహీనపరిచే అవకాశం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023 మేలో మొదలైన ఘర్షణలో 250 మందికిపైగా మరణించగా, 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
భల్లా ముందున్న ప్రధాన సవాళ్లు..
ప్రజలకు భద్రతా దళాలపై నమ్మకాన్ని పెంచడం. కుకి-జో కౌన్సిల్ బఫర్ జోన్ ను కాపాడడం. బఫర్ జోన్‌ను కాపాడడంలో విఫలమైతే నిరసనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం కూడా ఉంది.
24 గంటల బంద్..
డిసెంబర్ 31న భద్రతా దళాలు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గిరిజన సంఘం (CoTU) జనవరి 3న 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. సాయిబోల్ గ్రామం నుంచి వెంటనే భద్రతా దళాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. గత మంగళవారం భద్రతా దళాలు మహిళలపై లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా భద్రతా దళాల మోహరింపును కుకి-జో మహిళలు అడ్డుకోవాలని చూశారని పోలీసులు చెప్పారు.