మంచి ముహూర్తం కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా?

అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు;

Update: 2025-02-04 11:02 GMT

దేశంలోకి అక్రమంగా చొరబడిన అక్రమ వలసదారులను బహిష్కరించకుండా, ఇంకా నిర్భంధ కేంద్రాల్లో నిరవధికంగా ఎందుకు ఉంచుతున్నారని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వారిని బయటకు పంపించడానికి ‘‘ మంచి ముహూర్తం కోసం ఏమైనా వేచి చూస్తున్నారా’’ అని ప్రశ్నించింది.

అక్రమ వలసదారులని గుర్తించిన వారందరిని డిటెన్షన్ క్యాంపుల్లో ఎందుకు ఉండనిస్తున్నారని, వారిని వెంటనే దేశం నుంచి పంపించి వేయాలని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా,ఉజ్జల్ భూయాన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
‘‘వారు ఎక్కడి నుంచి వచ్చారో అని తెలియక మీరు బహిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారా? అది మాకు ఆందోళన కలిగిస్తోంది. మీరు వారిని స్వంత దేశాలకు బహిష్కరిస్తారా? లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.’’
ఓ వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించిన తరువాత మీరు తదుపరి చర్య తీసుకోవాలి. మీరు వారిని శాశ్వతంగా నిర్భంధించలేరు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది. అస్సాంలో చాలా డిటెన్షన్ కేంద్రాలు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకూ ఎంతమందిని బహిష్కరించారని ప్రశ్నించింది.
నిర్భంధ కేంద్రాల్లో ఉన్న 63 మందిని రెండు వారాల్లో బహిష్కరించడం ప్రారంభించాలని ఆదేశించింది. దీనిపై వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని అస్సాం ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేసింది.
అక్రమ వలసదారులని ప్రకటించిన వారిని బహిష్కరించడం, వారికి నిర్భంధ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.


Tags:    

Similar News