ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పంజాజ్ సీఎం అవుతారా? భగవంత్ మాన్ ఏమన్నారు?

ఒక వ్యక్తి హిందువా? సిక్కా? అని చూడకుండా..సీఎం పదవికి కావాల్సిన అర్హతలు ఉంటే చాలని AAP పంజాబ్ చీఫ్ అరోరా వ్యాఖ్యాలను ప్రతిపక్షాలు మరోలా అర్థం చేసుకున్నాయా?;

Update: 2025-02-19 07:08 GMT

పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ మాన్ (Bhagwant Mann) మంగళవారం ప్రతిపక్ష నేతలపై ఫైరయ్యారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారన్న విపక్ష నేతల వ్యాఖ్యలు కేవలం ఊహాగానాలేనని చెప్పారు.

"ఇది సాధ్యమేనా? వారికి ఏం తోస్తే అది మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే మాట్లాడారు. వారు కేవలం పుకార్లు వ్యాప్తి చేయడమే వారి పని," అని మాన్ వారిపై మండిపడ్డారు.

సమావేశంపై పుకార్లు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమి పాలైంది. మొత్తం 70 స్థానాలకు 22 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. మిగతా 48 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఫిబ్రవరి 11న తన అధికారిక నివాసం కపుర్తలా హౌస్‌కు చేరుకోవాలని, అక్కడ ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మాట్లాడతారని సీఎం భగవంత్ మాన్‌ ఆదేశించారు. ఈ సమావేశంపై ప్రతిపక్ష నేతలు అనేక రకాలుగా స్పందించారు. ఢిల్లీలో పరాజయం పాలైన తర్వాత ఆప్ అధినాయకత్వం.. ఇక దృష్టంతా పంజాబ్‌పై కేంద్రీకరిస్తోందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని హుకుం జారీ చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారా?

AAP ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న పంజాబ్ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా(Partap Singh Bajwa) వ్యాఖ్యలు చీపురు పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. పంజాబ్ సీఎం సీటుపై కేజ్రీవాల్ కన్నేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక వ్యక్తి హిందువా? సిక్కా? అని చూడకుండా.. సీఎం పదవికి కావాల్సిన అర్హతలు ఉంటే చాలని గతంలో AAP పంజాబ్ అధ్యక్షుడు అరోరా వ్యాఖ్యానించడం, పంజాబ్‌లోని లుధియానాలో AAP ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉండడంతో ఊహాగానాలకు బలం చేకూర్చాయి. 

Tags:    

Similar News