మళ్లీ రోడ్డెక్కిన మహారాష్ట్ర రైతులు..
పంటలకు కనీస మద్దతు ధర (MSP), వికలాంగులకు నెలకు రూ.6వేల భత్యం ప్రధాన డిమాండ్లు..
మహారాష్ట్ర(Maharashtra)లో రైతుల ఆందోళన(Farmers Protest) మళ్లీ మొదలైంది. అన్నదాతల 22 డిమాండ్లను సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ ప్రహార్ జనశక్తి పార్టీ (Prahar Janshakti Party) (పీజేపీ) నాయకుడు, మాజీ మంత్రి బచ్చు కడు(Bacchu Kadu) ఇటీవల రైతుల ట్రాక్టర్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొన్ని రోజుల క్రితం అమరావతి జిల్లాలోని చందూర్‌బజార్ నుంచి ప్రారంభమైన ట్రాక్టర్ మార్చ్ నాగ్‌పూర్ చేరుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు విరామం ప్రకటించారు. దీపావళి తర్వాత బచ్చు కడు పిలుపు మేరకు రైతులు మళ్లీ రోడ్డెక్కారు.
రైతుల డిమాండ్లేమిటి?
పంటలకు కనీస మద్దతు ధర (MSP), వికలాంగులకు నెలకు రూ.6వేల భత్యం రైతుల డిమాండ్లలో ప్రధానమైనవి. కడు నేతృత్వంలో కొనసాగుతున్న 'మహా-ఎల్గార్ మోర్చా'కు NCP (శరద్ పవార్ వర్గం), కిసాన్ సభ, రైతు నాయకుడు రాజు శెట్టి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
మళ్లీ మొదలైన తిరుగుబాటు..
రైతుల ఆగ్రహానికి కారణం, సందర్భం కూడా ఉంది. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోయాబీన్, పత్తి, చెరకు, వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది.
పడిపోయిన ధరలు..
రైతుల కష్టాలకు తోడు.. ట్రంప్ సుంకాలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు స్థిరంగా లేవు. పత్తి, సోయాబీన్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే ఉత్పత్తులు.
విధానపర మార్పులు, సుంకాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. భారతదేశంపై ట్రంప్ అధిక సుంకాలు విధించే ముందు కంటే ఇప్పుడు ధరలు మరింత పడిపోయాయి. దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వలసలూ పెరిగాయి.
హామీకి కట్టుబడిన ఫడ్నవీస్..
దీపావళికి ముందు ఆర్థిక సాయం జమ చేస్తామని అక్టోబర్ ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. పంట బీమా చెల్లింపులు, దెబ్బతిన్న పంటలు, పశువుల యజమానులకు పరిహారం చెల్లింపుగా రూ.32 వేలు చెల్లించనున్నట్లు ఫడ్నవీస్ ప్రకటించారు. ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాలకు ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కావడం ప్రారంభించింది. నిధుల కొరత, ఆర్థిక లోటు కారణంగా అత్యంత ప్రజాదరణ పొందిన లడ్కీ బహిన్ యోజన పథకానికి నిధులు సమకూర్చానికి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇతర సంక్షేమ పథకాల నుండి డబ్బును మళ్లించాల్సి వస్తుంది. బకాయిల చెల్లించాలని కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి అధికమైంది. సంక్షిప్తంగా చెప్పాలంటే.. ప్రపంచ వాణిజ్య ఒడిదుడుకులు, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ నిధుల కొరత రైతులను కష్టాలకు గురిచేస్తున్నాయి.
ఎవరీ ఓం ప్రకాష్..
నాలుగుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓంప్రకాష్ అలియాస్ బచ్చు కడు ప్రహార్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు. మాజీ రాష్ట్ర మంత్రి కూడా. విదర్భలోని పశ్చిమ కాటన్ బెల్ట్ అమరావతి జిల్లా పొరుగున ఉన్న అచల్‌పూర్ నియోజకవర్గం నుంచి OBC సామాజిక వర్గానికి చెందిన ఓం ప్రకాశ్ రైతు సమస్యలపై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు.
‘రైతులను తప్పక ఆదుకుంటాం’..
రైతుల ఆందోళనల నేపథ్యలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్(CM Devendra Fadnavis) స్పందించారు."రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిశీలించడానికి ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సహాయం చేయడమే ప్రస్తుతం మా ప్రాధాన్యత. వ్యవసాయ రుణమాఫీకి మేము వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదు" అని అన్నారు.