వెస్ట్ బెంగాల్‌లో బర్త్ సర్టిఫికెట్ కోసం భారీగా దరఖాస్తులు..కారణం అదే
SIR నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాలోని మైనార్టీలు..;
అసెంబ్లీ ఎన్నికల(Assembly elections)కు ముందు ప్రతి రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (S.I.R) చేపడతామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం(EC) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఓటు హక్కుకు బర్త్ సర్టిఫికేటే ప్రామాణికం అని ఈసీ చెబుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్(West Bengal) సరిహద్దు జిల్లాలైన మాల్డా, ముర్షిదాబాద్‌లోని మైనారిటీలు జనన ధృవీకరణ పత్రం కోసం మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దళారులు వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. సర్టిఫికేట్ కోసం దరఖాస్తుదారుల నుంచి రూ. 1,900 వసూలు చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా సర్టిఫికెట్ల కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రద్దీ నియంత్రణకు, దరఖాస్తుదారుల అనుమానాలను నివృత్తి చేసేందుకు సంబంధిత కార్యాలయాలు ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశాయి.
ఆధార్ అప్‌డేట్‌కు పెరిగిన గిరాకీ..
ఆధార్ కార్డు, రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణించాలని కొన్ని పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈసీపై కేసు వేశాయి. ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఆధార్ కార్డును కూడా ఓటు హక్కుకు ప్రామాణికంగా పరిగణించే అవకాశం ఉందన్న భావించిన కొందరు ఇప్పటికే వాటిని అప్‌డేట్ చేయించే పనిలో ఉన్నారు.
బంగ్లాదేశ్ నుంచి చాలా ఏళ్ల క్రితం వలస వచ్చి మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాలో నివాసం ఉంటున్న వారు చాలా మంది ఉన్నారు. వారికి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. అయితే ఓటరుగా గుర్తించబడాలంటే జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఈసీ చెబుతోంది. బర్త్ సర్టిఫికేట్ సమర్పించని వారిని విదేశీయులుగా పరిగణించి తిరిగి తమ స్వదేశానికి పంపితే .. అక్కడ బంగ్లాదేశ్ తమను తిరిగి దేశంలోకి అనుమతించకపోతే పరిస్థితి ఏమిటన్న భయం వారిని వెంటాడుతోంది.
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం (EC) ఆగస్టు 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లా అధికారులకు లేఖ పంపింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని అందులో పేర్కొంది.