జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

బ్యాడ్మింటన్ ఆడటం, పుస్తకాలను చదవడం ఇష్టపడే హేమంత్‌ సోరెన్.. అతి చిన్న వయసులో జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.

Update: 2024-07-04 13:00 GMT

జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఒక అధికారి తెలిపారు.

సోరెన్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్, ఆయన తల్లి రూపి సోరెన్, భార్య కల్పనా సోరెన్, జేఎంఎం నేతృత్వంలోని కూటమి సీనియర్ నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

బుధవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చంపాయ్ సోరెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28న హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కొద్దిసేపటికే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఎవరీ హేమంత్ సోరెన్..

జార్ఖండ్‌ హజారీబాగ్ సమీపంలోని నెమ్రా గ్రామంలో ఆగస్టు 10, 1975న జన్మించిన సోరెన్.. పాట్నాలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. తరువాత రాంచీలోని మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. కానీ చదువు మధ్యలోనే ఆపేశాడు. బ్యాడ్మింటన్ ఆడటం, పుస్తకాలను చదవడం ఇష్టపడే హేమంత్‌కు భార్య కల్పనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సోరెన్ 2009లో రాజ్యసభ సభ్యునిగా అరంగేట్రం చేశారు. మరుసటి సంవత్సరం బిజెపి నేతృత్వంలోని అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టేందుకు ఎగువ సభలో తన పదవికి రాజీనామా చేశారు.

రెండేళ్ల తర్వాత బీజేపీ-జేఎంఎం ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.

2013లో కాంగ్రెస్, RJD మద్దతుతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే 2014లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి కావడంతో సోరెన్ ముఖ్యమంత్రిగా మొదటి పర్యాయం కొద్దిసేపు కొనసాగింది. తర్వాత ప్రతిపక్ష నేతగా ఎదిగారు.

2016లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం చోటానాగ్‌పూర్ కౌలు చట్టం, ల్ పరగణా కౌలు చట్టాన్ని సవరించడానికి ప్రయత్నించినప్పుడు, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం గిరిజనుల భూమిని లీజుకు ఇవ్వడానికి అనుమతించడానికి, సోరెన్ భారీ ఆందోళనకు నాయకత్వం వహించారు.

అతని మిత్రపక్షాలు కాంగ్రెస్, RJD మద్దతుతో తిరిగి 2019లో అధికారంలోకి వచ్చారు. ఆయన పార్టీ JMM ఒంటరిగా 30 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

హేమంత్ సోరెన్ అతి పిన్న వయసులో 38 ఏళ్లకే జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Tags:    

Similar News