మొదటి దశ లోక్ సభ పోలింగ్: మధ్యాహ్నం వరకూ త్రిపుర..

దేశ వ్యాప్తంగా మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా జరగుతోంది. మధ్యాహ్నం వరకూ ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది.

Update: 2024-04-19 11:06 GMT

సార్వత్రిక సమరంలో మొదటి దశ పోలింగ్ మొదలైంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

మధ్యాహ్నం 1 గంట వరకు అత్యధికంగా త్రిపురలో 53.04 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 29.91 ఓటింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. తమిళనాడులోని 39, ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2), అండమాన్, నికోబార్ దీవులు (1), మిజోరాం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1) సిక్కిం (1)  లక్షద్వీప్ (1) స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రాజస్థాన్‌లోని 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, మహారాష్ట్రలో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూలో ఒక్కో స్థానానికి కూడా ఓటింగ్ జరుగుతోంది. జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం..
తమిళనాడు (39 సీట్లు)
తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉదయం మందకొడిగా ఓటింగ్ ప్రారంభమైంది. తర్వాత ఓటింగ్ క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం 1 గంట వరకూ రాష్ట్రంలో 39.51 పోలింగ్ శాతం నమోదైంది. ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోందని, కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరులో చిన్న లోపాలున్నాయని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యబ్రత సాహూ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ (3)
పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50.96 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, కూచ్‌ బెహార్‌ స్థానంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. TMC, BJP కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు. పోల్ హింస, ఓటర్ల బెదిరింపు, పోల్ ఏజెంట్లపై దాడికి సంబంధించిన ఫిర్యాదులను ఇరుపార్టీల వారు చేసుకున్నారు.
మణిపూర్ (2)
హింసాత్మకమైన మణిపూర్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 45.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానం పరిధిలోని తొంగ్జు అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికులు, గుర్తుతెలియని వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ (1)
ఛత్తీస్‌గఢ్‌లో, నక్సల్స్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో 42 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. బీజాపూర్ లో నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) వెళ్లడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ గాయపడ్డారు. ఇదే జిల్లాలో ప్రమాదవశాత్తూ అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (యుబిజిఎల్) షెల్ పేలడంతో ఎన్నికల భద్రతా విధుల్లో మోహరించిన సిఆర్‌పిఎఫ్ జవాన్ కూడా గాయపడ్డాడు.
అరుణాచల్ ప్రదేశ్ (2)
అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 8,92,694 మంది ఓటర్లలో 34.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఉదయం వేళల్లో ఓటింగ్‌ శాతం ఓ మోస్తరుగా నమోదైంది. రాష్ట్రంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం)లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పోలింగ్‌ ఆలస్యమైందని, ఆ తర్వాత వాటిని మార్చామని ప్రధాన ఎన్నికల అధికారి పవన్‌ కుమార్‌ సైన్‌ తెలిపారు.
అండమాన్, నికోబార్ దీవులు (1)
అండమాన్ నికోబార్ దీవుల్లో 35.7 శాతం ఓటింగ్ నమోదైంది. కొన్ని చిన్న ఈవీఎం లోపాలున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించామని అధికారులు తెలిపారు.
అస్సాం (5)
అస్సాంలోని లఖింపూర్‌లోని బిహ్‌పురియాలోని మూడు పోలింగ్ బూత్‌లు, హోజాయ్, కలియాబోర్, బోకాఖత్‌లలో ఒక్కొక్కటి, దిబ్రూఘర్‌లోని నహర్‌కటియాలో ఒక పోలింగ్ బూత్‌లలో EVM పనిచేయలేదని ఎన్నికల అధికారి తెలిపారు. రాష్ట్రంలో 45.12 శాతం పోలింగ్ నమోదైంది.
బీహార్ (4)
బీహార్‌లోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 75 లక్షల మంది ఓటర్లలో 32 శాతం మంది మధ్యాహ్నం 1 గంట వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ (1)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైన మొదటి ఆరు గంటల్లోనే 43.11 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు.
రాజస్థాన్ (12)
రాజస్థాన్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 33 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది.
ఉత్తరాఖండ్ (5)
ఉత్తరాఖండ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 37 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్‌లో అత్యధికంగా 40.46 శాతం పోలింగ్ నమోదు కాగా, హరిద్వార్‌లో 39.41 శాతం, పౌరీ గర్వాల్‌లో 36.60 శాతం, తెహ్రీ గర్వాల్‌లో 35.29 శాతం, అల్మోరాలో 32.29 శాతం పోలింగ్ నమోదైంది.
మహారాష్ట్ర (5)
మహారాష్ట్రలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 32.36 శాతం పోలింగ్ నమోదైంది.
మధ్యప్రదేశ్ (6)
మధ్యప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాల్లో 44.18 శాతం ఓటింగ్ నమోదైంది.
ఉత్తరప్రదేశ్ (8)
ఉత్తరప్రదేశ్‌లో మధ్యాహ్నం వరకూ 36.96 శాతం ఓటింగ్ నమోదైంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. అలాగే మేఘాలలో రెండు స్థానాలకు మధ్యాహ్నం 1 గంటల వరకు 48.9 ఓటింగ్ నమోదైంది. మిజోరం లో 36.67 శాతం, నాగాలాండ్ లో 38.83 శాతం, పుదుచ్చేరి 44.95 శాతం ఓటింగ్ నమోదైంది.
Tags:    

Similar News