లంచాలు ఇచ్చేందుకు యువత రుణాలు తీసుకుంటోంది: ప్రధాని మోదీ
బెంగాల్ టీఎంసీ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, వారు చేసే స్కామ్ లకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కట్ అండ్ కమీషన్ సంస్కృతి..
పశ్చిమ బెంగాల్ అవినీతి తారాస్థాయికి చేరిందని, ఉద్యోగాలు ఇవ్వడానికి టీఎంసీ నేతలు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. లంచాలు ఇవ్వడం కోసం యువత రుణాలు చేస్తున్నారని, వారి భవిష్యత్ అంధకారంగా మారిందని టీఎంసీ నేతృత్వంలోని మమతా సర్కార్ పై నిప్పులు చెరిగారు.
పశ్చిమ బెంగాల్ లో స్కామ్ లు రాజ్యమేలుతున్నాయని, టీఎంసీ అంటే స్కామ్ లకు పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి "కట్ అండ్ కమీషన్" సంస్కృతి కారణంగా పశ్చిమ బెంగాల్ యువకులు నష్టపోయారని విమర్శించారు.
టీచర్ల రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చేపట్టిన 26 వేల టీచర్ల నియామక పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.