ఆస్తి పన్నుకు గార్బేజ్ యూజర్ చార్జీ అటాచ్

మండిపడుతున్న ఢిల్లీ వాసులు - ఇంటి పన్ను కట్టని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్న పన్ను చెల్లింపుదారులు;

Update: 2025-04-09 12:00 GMT

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) చెత్త సేకరణకు గృహ యజమానుల నుంచి యూజర్ చార్జీ(Garbage collection Tax)లను వసూలు చేయనుంది. అయితే దాన్ని ఆస్తి పన్నుతో కలిసి వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నును బట్టి నెలకు ఒక్కో ఇంటి నుంచి 50 నుంచి గరిష్టంగా రూ. 200 వరకు వసూలు చేయనున్నారు.

ఢిల్లీ(Delhi)లోని 4.3 మిలియన్ల కుటుంబాలలో 1.3 మిలియన్లు మాత్రమే ఆస్తిపన్ను చెల్లిస్తున్నాయి. MCD నిర్ణయాన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తప్పుబడుతున్నాయి. యునైటెడ్ రెసిడెంట్స్ జాయింట్ యాక్షన్ (URJA) సహా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA) నిజాయితీగల పన్ను చెల్లిస్తున్న వారి నుంచి యూసర్ చార్జీలు వసూలు చేయడం దారుణమని, మరి పన్ను చెల్లించనివారు 3 మిలియన్ల కుటుంబాల నుంచి ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని కాలనీలు చెత్తను తీసుకెళ్లేందుకు ప్రైవేటు వ్యక్తులతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు రెట్టింపు ఛార్జీల భారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీరో-వేస్ట్ అమలు చేస్తున్న తమకు మినహాయింపు ఇవ్వాలని వసంత్ కుంజ్, డిఫెన్స్ కాలనీ, మునిర్కా విహార్ వంటి కాలనీవాసులు కోరుతున్నారు.

MCD ఫెయిల్..

ఇంటింటికి చెత్త సేకరణలో MCD విఫలమైందని కొంతమంది పేర్కొంటున్నారు. గత సంవత్సరం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) నిర్వహించిన ఆడిట్‌లో కార్పొరేషన్ అసమర్థతలు బయటపడ్డాయి. వివిధ మండలాల్లో ప్రాథమిక వ్యర్థాల సేకరణ సామర్థ్యంలో లోపాలను ఆడిట్ గుర్తించింది. వ్యర్థాల సేకరణలో కీలక పాత్ర పోషించే అనధికారిక వ్యర్థ సేకరణ కార్మికులను తొలగిస్తే వారి జీవనోపాధి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు.

ఆప్, బీజేపీని ఒకటి చేసిన ఎంసీడీ..

యూజర్ చార్జీ వసూలు నిర్ణయంపై ఆప్, బీజేపీ ఏకమయ్యాయి. ఈ రెండు పార్టీలు (AAP, BJP) ఎంసీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ కౌన్సిలర్ల మాటను కమిషనర్ లెక్కపెట్టడం లేదని ఆప్ అంటుండగా.. కమిషనర్ నివాసం వద్ద బీజేపీ కౌన్సిలర్లు నిరసన చేపట్టారు.

రోజుకు ఎంత? సామర్థమెంత?

ఢిల్లీలో రోజుకు 11,000 టన్నుల చెత్త పోగవుతుంది. అయితే కేవలం 7,200 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం ఉంది. యూజర్ చార్జీలను వసూలు చేసే ముందు MCD కార్యాచరణ లోపాలను సరిచేయాలని ఢిల్లీవాసులు కోరుతున్నారు. ఎంసీడీ సంస్కరణలు చేపట్టకపోతే వ్యర్థ యుద్ధాలు తప్పేలా లేవు. 

Tags:    

Similar News